‘సంక్షేమ’ పండుగ!

26 May, 2019 03:10 IST|Sakshi

నీరసించిన చదువులకు వైఎస్సార్‌ సీపీ పాలనలో జవసత్వాలు 

సంక్షేమానికి కొత్త సీఎం పెద్దపీట వేస్తారని అధికారుల్లో ఆశాభావం 

గిరిజన సంక్షేమ విద్యలో పూర్తి స్థాయి మార్పులకు సిద్ధం 

అసిస్టెంట్‌ సాంఘిక సంక్షేమ కార్యాలయాల పరిధిల్లో మార్పులు

సాక్షి, అమరావతి: ఐదేళ్ల టీడీపీ పాలనలో నీరసించిన సంక్షేమ విద్యకు వైఎస్సార్‌ సీపీ జీవం పోస్తుందనే ఆశాభావం అధికార యంత్రాంగంలో వ్యక్తమవుతోంది. నూతన సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీల్లో సంక్షేమానికే పెద్దపీట వేశారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు జవసత్వాలు కల్పిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి పెడతారని అధికారులు భావిస్తున్నారు. 

648 హాస్టళ్లను రద్దు చేసిన టీడీపీ రాష్ట్రంలో సంక్షేమ శాఖల ద్వారా సగం బడ్జెట్‌ విద్యకే ఖర్చు చేస్తున్నారు. సంక్షేమ హాస్టళ్లు, సంక్షేమ గురుకుల విద్యాలయాలు, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లు, కార్పొరేట్‌ స్కూళ్లు, సివిల్స్‌ కోచింగ్, విదేశీ విద్యా దీవెన పథకాల ద్వారా సంక్షేమ విద్యా బోధన జరుగుతోంది. సాంఘిక సంక్షేమ శాఖలో 648 హాస్టళ్లను రద్దు చేసిన టీడీపీ వాటి స్థానంలో కొత్త గురుకుల స్కూళ్లను మాత్రం ఏర్పాటు చేయకుండా అలక్ష్యం ప్రదర్శించింది. ప్రస్తుతం ఉన్న స్కూళ్లలోనే వీటిని విలీనం చేయడంతో అరకొర వసతి, తరగతి గదులు చాలక విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. విద్యాసంస్థల మరమ్మతులకు వెచ్చించాల్సిన నిధులు పచ్చ చొక్కాల జేబుల్లోకి చేరిపోయాయి. పైపైన రంగులు వేసి నిధులు దోచేశారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిధుల వ్యయం జరుగుతోంది. టీడీపీ పాలనలో రాష్ట్ర స్థాయిలో పనులన్నీ ఒకే కాంట్రాక్టర్‌కు ఇవ్వడంతో సప్‌లై, నాణ్యతలో లోపాలు తలెత్తాయి. 

గతేడాది బకాయిలు రూ.8 వేల కోట్లు 
విద్యా సంస్థలకు పైసా కూడా బకాయిలు లేకుండా సంక్షేమ విద్యను అందించడం వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ద్వారానే సాధ్యం అవుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఒక్క ఏడాది కూడా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పూర్తి స్థాయిలో చెల్లించలేదు. గత విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికీ ఇంకా రూ.8 వేల కోట్ల బకాయిలు కాలేజీలకు విడుదల కాకుండా పెండింగ్‌లోనే ఉన్నాయి.  

గిరిజన సంక్షేమ విద్యలో పూర్తి స్థాయి మార్పులు 
గిరిజన సంక్షేమ విద్యలో పూర్తి స్థాయి మార్పులు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గురుకుల విద్య, ప్రాథమిక విద్య, సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి గిరిజన సంక్షేమ శాఖ ఇప్పటికే ఓ నివేదిక తయారు చేసింది. నూతన ముఖ్యమంత్రి దీన్ని ఆమోదించిన తరువాత అమలు చేయాలనే ఆలోచనలో ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉన్నారు. గత ప్రభుత్వం గిరిజన సంక్షేమ హాస్టళ్లను పూర్తిగా రద్దు చేసింది. దీంతో అటు గురుకుల విద్య అందక, సంక్షేమ హాస్టళ్లు లేక విద్యార్థులు అల్లాడుతున్నారు. రద్దు చేసిన కొన్ని హాస్టళ్లనైనా తిరిగి పునరుద్ధరించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఆశ్రమ పాఠశాలలను పూర్తి స్థాయిలో గురుకులాలుగా మారిస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన కూడా ఉంది. ఈ అంశాలపై అధికారులు నూతన ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.  

సబ్సిడీ రుణ పథకాలను నీరుగార్చిన చంద్రబాబు 
పేదల జీవన ప్రమాణ స్థాయిని పెంచేందుకు ఉద్దేశించిన సబ్సిడీ రుణాల పథకాల కింద ఏటా ఐదు లక్షల మందికి కార్పొరేషన్‌ల ద్వారా రుణాలు ఇప్పించాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వం సంవత్సరానికి కనీసం 50 వేల మందికి కూడా పూర్తి స్థాయిలో సబ్సిడీ రుణాలను ఇవ్వలేకపోయింది. సంక్షేమ రంగాన్ని చంద్రబాబు పూర్తిగా విస్మరించారనేందుకు ఇది నిదర్శనం. గిరిజనులు, ఎంబీసీల గృహాలకు 100 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వాల్సిన విద్యుత్‌ హామీ కూడా సక్రమంగా అమలు కాలేదు. ఎంబీసీలకు ఒక్కరికి కూడా ఉచిత విద్యుత్‌ అందలేదు. జీవో అమలు చేయాల్సిందిగా ప్రభుత్వం నుంచి తమకు మార్గదర్శకాలు లేవని విద్యుత్‌ శాఖ చెబుతోంది. గత ప్రభుత్వం కేవలం జీవోలకే పరిమితమైంది. ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేసిన  దాఖలాలు లేవు. 

ఏఎస్‌డబ్లు్యవో కార్యాలయాల పరిధి మార్పు 
అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ కార్యాలయాల పరిధిలో మార్పులు తెచ్చేందుకు సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్‌ కార్యాలయం నివేదిక తయారు చేసింది. ప్రతి నాలుగైదు మండలాలకు ఒక ఏఎస్‌డబ్ల్యూవో ఉంటే బాగుంటుందనే యోచనలో డైరెక్టర్‌ ఉన్నారు. గుంటూరు లాంటి పెద్ద జిల్లాలకు ఇద్దరు అధికారులను నియమించాలని భావిస్తున్నారు. ఒక డిప్యూటీ డైరెక్టర్‌ జిల్లా కేంద్రంలో ఉంటున్నందున మరో ప్రధాన కేంద్రం నుంచి కూడా పర్యవేక్షించడం ద్వారా పనులు వేగంగా జరుగుతాయని పేర్కొంటున్నారు. ఈమేరకు నివేదిక రూపొందించి త్వరలో అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తం 90 మంది ఏఎస్‌డబ్లు్యవోలను సర్దుబాటు చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించాలని భావిస్తున్నారు. స్టడీ సర్కిళ్లకు జేడీలను ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తే నాణ్యమైన విద్యా బోధన జరుగుతుందని అధికారులు యోచిస్తున్నారు. 

మరిన్ని వార్తలు