వేధిస్తున్నారంటూ సోషల్‌మీడియాలో పోస్ట్‌

19 Aug, 2019 08:47 IST|Sakshi

ఆదోని తాలూకా పోలీస్టేషన్‌ ఏఎస్‌ఐ నాగరాజు ఆవేదన

సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియో 

ఏఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు  

సాక్షి, ఆదోని : పోలీస్‌ శాఖలో కొందరు అధికారులు తనను అవమానిస్తూ, అగౌరవ పరుస్తూ మానసికంగా వేధిస్తున్నారని ఆదోని తాలూకా పోలీసు స్టేషన్‌ ఏఎస్‌ఐ నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులు తాళలేక ఉద్యోగానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడిన ఓ వీడియో ఆదివారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ అయింది. వీడియోను సోషల్‌ మీడియాలో స్వయంగా ఆయనే అప్‌లోడ్‌ చేశారో, ఎవరైనా ఆయన ఆవేదనను రికార్డు చేసి పెట్టారో తెలియాల్సి ఉంది.

అనారోగ్యంతో, ఆందోళనతో ఉన్న తనను ఓ అధికారి మానసికంగా వేధిస్తున్నారని,  దీంతో ఉద్యోగం చేయలేక పోతున్నానని వీడియోలో పేర్కొన్నారు. తనకు జరుగుతున్న అన్యాయం పోలీసు శాఖలో ఏ ఒక్కరికీ రాకూడదన్న ఉద్దేశంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణమాస ఉత్సవాల విధులలో ఉన్నానని, విధులు ముగియగానే జిల్లా ఎస్పీని కలిసి తనను ఎలా వేధించారో వివరించి రాజీనామా పత్రాన్ని సమర్పిస్తానని చెప్పారు. ఈ విషయమై డీఎస్పీ రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ.. విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే పై అధికారులకు చెప్పుకోవాలి కాని ఇలా సోషల్‌ మీడియాలో వీడియోల ద్వారా వైరల్‌ చేయడం మంచి పద్ధతి కాదన్నారు.    

సస్పెన్షన్‌ వేటు 
విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతోపాటు సోషల్‌ మీడియాలో ఉన్నతాధికారుల పట్ల అనుచితంగా మాట్లాడిన ఏఎస్‌ఐ నాగరాజుపై  జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప సస్పెన్షన్‌ వేటు వేశారు. ఏఎస్సై నాగరాజుకు రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలపై ఫిర్యాదులు వచ్చాయి. పని కన్నా ఇతరత్రా విషయాలకు ప్రాధాన్యం ఇస్తూ గతంలోనూ సస్పెండ్‌ అయ్యారు. అయినా పనితీరులో మార్పు రాలేదు. వెల్దుర్తిలో పనిచేస్తూ ఆదోనికి అటాచ్‌మెంట్‌ విధులు అప్పగించారు. సోషల్‌ మీడియాలో ఉన్నతాధికారులపై వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయడంతో జిల్లా పోలీసు శాఖ తీవ్రంగా స్పందించింది.  పోలీసు కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ కింద జిల్లా ఎస్పీ అతనిపై చర్యలు తీసుకుంటూ సస్పెన్షన్‌ వేటు వేశారు. 

మరిన్ని వార్తలు