ఓటుకు పోటు!

4 Mar, 2019 12:16 IST|Sakshi
ఓట్లు చూసుకునేందుకు వచ్చిన ప్రజలతో కిటకిటలాడుతున్న ఆదోని తహసీల్దార్‌ కార్యాలయం

ఓట్లు తొలగించాలని మరో వెయ్యి దరఖాస్తులు

పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆదోని తహసీల్దార్‌

ఆందోళన చెందుతున్న ఓటర్లు

కర్నూలు, ఆదోని: ఓట్లు తొలగించాలని కోరుతూ ఆదోని నియోజకవర్గంలో మరో వెయ్యి దరఖాస్తులు ఆన్‌లైన్‌లో దాఖలయ్యాయి. దీంతో ఓట్ల తొలగింపు కోసం దాఖలైన దరఖాస్తుల సంఖ్య 7వేలు దాటింది. గంపగుత్తగా దరఖాస్తులు ఆన్‌లైన్‌ ద్వారా వచ్చి పడుతుండడంతో రెవెన్యూ అధికారుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో తహసీల్దార్‌ విశ్వనాథ్‌ ఆదివారం.. టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఎవరు ఎక్కడి నుంచి దాఖలు చేశారో విచారించి బాధ్యులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఐపీసీ 182, 419 అండ్‌ 66డి ఆఫ్‌ ఐటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. మీసేవా కేంద్రాలు, సెల్‌ఫోన్‌ సర్వీస్‌ సెంటర్ల నిర్వాహకులు ఫాం–7కింద ఓటరు తొలగింపుకు దరఖాస్తులు ఆన్‌లైన్‌ చేయడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అక్రమాలకు ఆస్కారం ఇస్తే చట్టపరమైన చర్యలకు గురికావాల్సి ఉంటుందని తహసీల్దార్‌ హెచ్చరించారు.

టీడీపీ వారి పనే...
తెలుగుదేశం నాయకులే ఓట్ల తొలగింపు కుట్రకు తెరతీసినట్లు  వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఇప్పటికే తహసీల్దార్‌ విశ్వనాథ్‌కు ఫిర్యాదు చేశారు. తమ ఫొటోలు, పేర్లు వినియోగంచుకొని తమ పార్టీ మద్దతు దారుల ఓట్లను తొలగించి రాజకీయ లబ్ధి పొందేందుకే టీడీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు శేషిరెడ్డి, బీమా, నర్సప్ప, చిన్న స్వామి గౌడ్‌ మరికొంత మంది ఆరోపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా..ఎన్నికల నాటికి తమ ఓట్లు ఉంటాయో, ఉండవో తెలియని అయోమయ పరిస్థితుల్లో నిర్ధారించుకోవడానికి తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ ఓటర్లు తిరుగుతున్నారు. తొలగింపునకు తమపేరుపై దరఖాస్తు దాఖలు కావడం చూసి పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు