అమ్మానాన్నలు దొరికారోచ్‌..

23 Jan, 2019 08:03 IST|Sakshi
అరుణ అనే చిన్నారిని దత్తత తీసుకుంటున్న యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా జాషువా ఓబోల్జ్, ఎమి ఓబోల్జ్‌ దంపతులు

శిశు గృహ చిన్నారుల దత్తత స్వీకరణ

చిన్నారులను యూఎస్, చెన్నై దంపతులకు అప్పగించిన కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా..

కన్నవారు పేగు బంధాన్నితెంచుకుంటే.. మనసున్న వారు ఆ బంధాన్ని అపురూపంగా అందుకున్నారు.కర్కశంగా వదిలి వెళ్లిన ఆ చిన్నారులకు అన్నీ తామవుతామని ముందుకు వచ్చారు. వారు అనాథలు కాదని ఇక నుంచి అందరూ ఉన్న వారంటూ ఆప్యాయంగా వారిని ఒడిలో చేర్చుకున్నారు. ఇప్పటి వరకు శిశుగృహ సంరక్షణలో ఉన్న వారికి నేడు ‘అమ్మానాన్నలు దొరికారు’.

తూర్పుగోదావరి , కాకినాడ సిటీ: కాకినాడ శిశుగృహ సంరక్షణలో ఉన్న ఆడ శిశువులను కారా నిబంధనలకనుగుణంగా దత్తత స్వీకరణకు దరఖాస్తు చేసుకున్న దంపతులకు మంగళవారం కలెక్టరేట్‌ కోర్టు హాలులో కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అప్పగించారు. 2017 జూన్‌ 12న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎన్‌ఐసీయూలో వదిలివెళ్లిన ఆడశిశువును చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఆదేశాల మేరకు కాకినాడలోని శిశు గృహం సంరక్షణలో చేర్పించారు. ఈ శిశువు కోసం బయోలాజికల్‌ తల్లిదండ్రులు తగిన ధ్రువీకరణలతో క్లెయిమ్‌ చేయాలని పత్రికా ముఖంగా ప్రకటన జారీ చేయగా ఎవరి నుంచి క్లెయిమ్‌ దాఖలు కాకపోవడంతో చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఈ బాలికకు అరుణ పేరున నామకరణం చేసి 2017 సెప్టెంబర్‌ 1న చట్టప్రకారం దత్తత అప్పగించేందుకు బాలిక వివరాలను కారా వెబ్‌సైట్‌లో ప్రకటించారు. యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా, గ్రాండ్‌ ఫోర్క్స్‌ ఏఎఫ్‌బీ నార్త్‌ డకోటా నివాసులైన జాషువా ఓబోల్జ్, ఎమి ఓబోల్జ్‌ దంపతులు అరుణను దత్తత స్వీకరించేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అర్హతలను పరిశీలించి న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఒక సంవత్సరం 9 నెలలు వయస్సు కలిగిన బాలిక అరుణను చట్టప్రకారం మంగళవారం ఓబోల్జ్‌ దంపతులకు దత్తత అప్పగించారు. దత్తత తల్లిదండ్రులు తమ బిడ్డకు లిడియా అరుణ ఓబోల్జ్‌గా పేరు పెట్టుకున్నారు.

చెన్నై నివాసులకు..
2018 సెప్టెంబర్‌ 30న ముమ్మిడివరం ప్రకాష్‌ కాంప్లెక్స్‌ సమీపంలోని విష్ణాలయం వద్ద 15 రోజుల వయస్సు కలిగిన ఆడశిశువును గుర్తు తెలియని వ్యక్తులు విడిచి వెళ్లారు. సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు ఈ శిశువుకు సంజన అని నామకరణం చేసి కాకినాడ శిశుగృహం సంరక్షణలో ఉంచారు. బయోలాజికల్‌ తల్లిదండ్రులు తగిన ధ్రువీకరణలతో క్లెయిమ్‌ చేయాలని పత్రికా ముఖంగా కోరినా ఎవరూ రాలేదు. దీంతో డిసెంబర్‌ 7, 2018న చట్టబద్ధమైన దత్తత అప్పగించేందుకు కారా వెబ్‌సైట్‌లో సంజన వివరాలు ప్రకటించారు. దీంతో దత్తత స్వీకరణకు చట్టపరమైన అన్ని అర్హతలు పూర్తి చేసి తమిళనాడు, చెన్నై నివాసులు జి నటరాజు, విష్ణుప్రియ దంపతులకు సంజనను దత్తత అప్పగించారు. ఈ బిడ్డలను దత్తత చేపట్టిన దంపతులను కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అభినందించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌–2 సీహెచ్‌ సత్తిబాబు, ఐసీడీఎస్‌ పీడీ సుఖజీవన్‌బాబు, ఏపీడీ పి.మణెమ్మ, చైల్డ్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ సిహెచ్‌ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు