అవని ఒడి.. కన్నీటి తడి

8 Apr, 2016 03:11 IST|Sakshi

 అడుగంటుతున్న భూగర్భ జలాలు
అందని ఎన్టీఆర్ సుజల, కుళాయిల నీరు చెలమలే దిక్కు


వేసవి తరుముకొచ్చింది. గుక్కెడు నీళ్ల కోసం గొంతు తడారిపోతోంది.. చెరువులన్నీ నీళ్లు లేక రోదిస్తున్నారుు.. బోర్లు అడుగంటి బోరుమంటున్నారుు.. మూడు కాళ్ల ముసలమ్మ నుంచి ఇంటి పెద్దదిక్కు వరకూ బిందెనెత్తికెత్తి.. కావడి కట్టి మైళ్ల దూరం.. మండే ఎండలో జల పోరాటం చేస్తున్నారు.. ఎడారిలో ఒయూసిస్సులా అక్కడక్కడా చెలమలు.. పేదల ఎక్కిళ్లకు అవే మహా ప్రసాదం.. బిందె నిండితే మహాదానందం.. ఇదీ వీరులపాడు మండలం దొడ్డదేవరపాడు వాసుల నిత్యం జల పోరాటం.

 

వీరులపాడు : మండలంలోని దొడ్డదేవరపాడు ప్రజలు మంచినీటి కోసం నరకయాతన అనుభవిస్తున్నారు. గ్రామంలో 2,300 మంది జనాభాకు గానూ రెండు ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయి. వీటిలో ఒకదానికి వి.అన్నవరం వద్ద రక్షిత చెరువు నుంచి, మరో ట్యాంకుకు దొడ్డదేవరపాడు వద్ద ఏటిలో మోటార్ ద్వారా నీటిని అందిస్తున్నారు. అయితే, ఈ నీరు చాలడం లేదు.

 
పదిరోజులకోసారి నీటి సరఫరా

గ్రామంలో బావులు, బోర్లతోపాటు వైరా, కట్టలేరు పూర్తిగా ఎండిపోయాయి. పంచాయతీ సరఫరాచేసే నీరు పదిరోజులకోసారి కూడా రావడం లేదు. అప్పుడైనా కనీసం గంటసేపు నీరు సరఫరా కావట్లేదు. ఆర్థిక              స్తోమత ఉన్నవారు రూ.15 వెచ్చించి మినరల్ వాటర్ కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన వారు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లి వైరా, కట్టలేరుల్లో చెలమలు తీసుకుని బిందెలతో నీరు తెచ్చుకుంటున్నారు. వృద్ధులకు సైతం ఈ తిప్పలు తప్పడంలేదు.

 
‘ఎన్టీఆర్ సుజల’ హామీకే పరిమితం

టీడీపీ అధికారం చేపట్టగానే ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా ఇంటింటికీ రూ.2కే మినరల్ వాటర్‌ను అందిస్తామన్న చంద్రబాబు హామీ అమలు కావట్లేదు. తాగునీటి సమస్యపై ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ రామారావును వివరణ కోరగా, మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్త పథకాలు ఏర్పాటు ఆలోచనలేదని తేల్చి చెప్పారు. ఉన్నవాటిని బాగుచేయిస్తామని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు