మద్యం 'చీప్‌'

17 Dec, 2019 11:37 IST|Sakshi

తాడిపత్రిలో ఎమ్మార్పీ కంటే రూ.30 తక్కువకు మద్యం

భారీ పోస్టర్‌తో మద్యం ప్రియులకు వల

కొంచెం తాగితే  తలకెక్కుతున్న కిక్కు

బ్రాండెండ్‌ పేరుతో నకిలీ ప్రవాహమని అనుమానం  

పట్టించుకోని ఎక్సైజ్‌ శాఖ అధికారులు

మద్యం నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వం అంచెలంచెలుగా చర్యలు తీసుకుంటుండగా.. తాడిపత్రిలోని ఓ బార్‌ యాజమాన్యం మాత్రం మద్యం ప్రియులకు ఫుల్‌గా పట్టిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మార్పీ కంటే రూ.30 తక్కువకు విక్రయిస్తోంది. బార్‌ ఎదుటే భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి మందుబాబులకు వల విసురుతోంది. బ్రాండెడ్‌ సరుకైనా సరే కాసింత తాగితేనే తలకెక్కుతుండగా.. తాగినోళ్లంతా చిత్తయిపోతున్నారు. నకిలీ లిక్కర్‌ను బ్రాండెడ్‌ సీసాల్లో పోసి మందుబాబుల జేబులు ఖాళీ చేస్తున్నట్లు ఆరోపణలున్నా.. అబ్కారీ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.

అనంతపురం: తాడిపత్రి పట్టణంలో మొత్తం మూడు బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లు ఉన్నాయి. అవన్నీ కూడా జేసీ సోదరుల అనుచరులే నిర్వహిస్తున్నారు. ఇన్నాళ్లూ ఇష్టానుసారం వేళాపాలా లేకుండా మద్యం విక్రయించి సొమ్ము చేసుకున్న వారంతా.. మద్యం నిషేధం దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఆలోచనలో పడ్డారు. దోపిడీకి కొత్తదారి వెతుక్కున్నారు. ఈక్రమంలో పోలీసు స్టేషన్‌ సమీపంలోనే ‘హిమగిరి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌’ ఏర్పాటు చేసిన జేసీ సోదరుల అనుచరుడు సంగటి ప్రసాద్‌రెడ్డి కొత్త దందాకు తెరతీశాడు.

ఎమ్మార్పీ కంటే రూ.30 తక్కువ
సాధారణంగా మద్యం షాపుల్లో కన్నా బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో మద్యం ధర అధికంగా ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడైనా ఇదే విధానం నడుస్తోంది. కానీ హిమగిరి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ యాజమాన్యం మాత్రం ఎమ్మార్పీ కంటే రూ.30 తక్కువకు మద్యం విక్రయిస్తోంది. ఇదేదో చాటుమాటుగా సాగుతున్న వ్యవహారం కూడా కాదు. ఏకంగా బార్‌ ఎదుటే భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ధరతో పాటు బార్‌లో ఇస్తున్న ధరలను ఫ్లెక్సీపై ముద్రించి మద్యం ప్రియులను ఆకర్షిస్తోంది. 

ఎన్నో అనుమానాలు
ఎవరైనా బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు చేయాలంటే లైసెన్స్‌ కోసం రూ.లక్షల్లో ప్రభుత్వానికి చెల్లిస్తారు. ఈ మేరకు సంపాదించేందుకు అవసరమైతే అదనపు ధరలతో మద్యం ప్రియుల జేబులు ఖాళీ చేస్తారు. కానీ ఇందుకు విరుద్ధంగా హిమగిరి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ యాజమాన్యం ఎమ్మార్పీ కంటే తక్కువకు మద్యం విక్రయిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తం అవు తున్నాయి. కర్ణాటక ప్రాంతం నుంచి అక్రమంగా మద్యాన్ని దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయిస్తున్నారా? లేక ఇన్ని రోజు లు నిల్వఉంచిన పాత స్టాకును ఇప్పడు తక్కువ ధరకే విక్రయిస్తున్నారా! అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

పట్టించుకోని ఎక్సైజ్‌ అధికారులు
ఎమ్మార్పీ కంటే తక్కువ ధరకు మద్యాన్ని విక్రయించినా.. ఎక్కువ ధరకు విక్రయించినా ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ పట్టణం నడిబొడ్డున హిమగిరి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ యాజమాన్యం ఏకంగా ఫ్లెక్సీ వేసి మరీ తక్కువ ధరకు మద్యం విక్రయిస్తున్నా ఎక్సైజ్‌ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. గతంలో కర్నూలు జిల్లాలో ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ యాజమాన్యం ఎమ్మార్పీ కంటే తక్కువ ధరకు మద్యం విక్రయించగా అక్కడి ఎక్సైజ్‌ అధికారులు కేసు నమోదు చేశారని, ఇక్కడ మాత్రం అలాంటి పరిస్థితి లేదని జనం చెబుతున్నారు. ఇప్పటికైనా ఈ లిక్కర్‌ దందాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

నకిలీ మద్యమా..?
హిమగిరి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో విక్రయిస్తున్న మద్యం నకిలీ మద్యమా..? అనే అనుమానాలను మద్యం ప్రియులే వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎమ్మార్పీ కంటే రూ.30 నుంచి రూ.50 వరకు అదనంగా తీసుకున్న బార్‌ నిర్వాహకులు ఇప్పుడు హఠాత్తుగా రేటు తగ్గించడం.. బ్రాండెడ్‌ మద్యం తీసుకున్నా.. కొంచెం తాగగానే కిక్కు ఎక్కుతుండటంపై పలు  అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధరకే నకిలీ మద్యాన్ని కొనుగోలు చేసి బ్రాండ్‌ లేబుళ్లు మార్చి విక్రయిస్తున్నట్లు వారంతా భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు