ఇవేం... పా'పాలు'!

5 Mar, 2019 12:08 IST|Sakshi
చాగలమర్రి మండలం శెట్టివీడు గ్రామంలో పాడైన పాలపాకెట్లను వంకలో పడేసిన దృశ్యం

అంగన్‌వాడీ కేంద్రాలకు పాడైపోయిన పాలు సరఫరా  

అమ్మల ఆరోగ్యానికి శాపంగా ‘అన్న’ అమృత హస్తం  

90 రోజుల నిల్వ ఒట్టిమాటే!  

కేంద్రాలకు చేరేలోపే దుర్గంధం వెదజల్లుతున్న వైనం  

తాగలేక పారబోస్తున్న గర్భిణులు, బాలింతలు,చిన్నారులు

అన్న అమృత హస్తం పథకం    అభాసుపాలవుతోంది. పౌష్టికాహారంలో భాగంగా నిరుపేదలైన గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్‌వాడీల ద్వారా పాలు అందజేస్తున్నారు. అయితే విషతుల్యమైన పాలు సరఫరా అవుతుండటం వారి పాలిట శాపంగా మారుతోంది. పాలు తొంభై రోజులు నిల్వ ఉంటాయనే ప్రభుత్వ ప్రకటన ఒట్టిదేనని తేలింది. కనీసం అంగన్‌వాడీ కేంద్రాలకు చేరే వరకు కూడా నిల్వ ఉండటం లేదు. కేంద్రాలకు వచ్చే సరికి ప్యాకెట్లు ఉబ్బిపోయి, దుర్గంధం వెదజల్లుతున్నాయి. దీంతో లబ్ధిదారులు తాగకుండా పారబోస్తున్నారు. ఇంత జరుగుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

కర్నూలు,ఆళ్లగడ్డ: నిరుపేద గర్భిణి, బాలింతలకు అన్న అమృత హస్తం పథకం కింద ఒక పూట సంపూర్ణ భోజనాన్ని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్నారు. భోజనంతో పాటు కోడిగుడ్డు, 200 మి.లీ పాలు ఇస్తున్నారు. 2013 జనవరిలో ఇందిరమ్మ అమృత హస్తం పేరుతో ప్రారంభించగా.. టీడీపీ  అన్న అమృత అహస్తంగా పేరు మార్చింది.  

కాసులు కురిపిస్తున్న టెండర్లు ..
పాలకుల ధనదాహం..అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్లకు కాసుల వర్షం కురుస్తోంది. పథకానికి వంటనూనె, బియ్యం, కందిపప్పు చౌక దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నారు. గుడ్లు, పాలు మాత్రం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్ల ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. కాంట్రాక్టర్‌ అధికార పార్టీకి చెందిన వారు కావడం, నాయకులకు, స్థాయి వారీగా ఉన్నతాధికారుల వరకు నెల మామూళ్లు ఇవ్వాల్సి రావడంతో నాసిరకం వస్తువులు సరఫరా చేస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. తమకు ముట్టేది ముడుతుండటంతో పాలకులు, అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.  

వంకల్లో పారబోత..
పాలు పాడై పోతున్నాయని చెబితే అధికారుల నుంచి బెదిరింపులు వస్తుండటంతో కార్యకర్తలు కాంట్రాక్టర్ల నుంచి తీసుకుని పెట్టె విప్పి చూసి పాడై ఉంటే పడేస్తున్నారు. చాలా గ్రామాల్లో రోడ్ల వెంట కుప్పకుప్పలుగా పాల ప్యాకెట్లు పడి ఉంటున్నాయి.

ఎవరికి ఫిర్యాదు చేయాలి..
జిల్లాలో ప్రస్తుతం నెలకు 3,74,674 లీటర్ల పాలు కొనుగోలు చేస్తున్నారు.ఇందుకు శిశు సంక్షేమ శాఖ నెలకు రూ.1.50 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లిస్తోంది. నెలకు సరిపడా నిల్వలను ఒకేసారి అంగన్‌వాడీ కేంద్రాలకు చేరుస్తున్నారు. పాడైపోయిన పాల ప్యాకెట్‌పై ముద్రించిన నంబర్‌కు ఫోన్‌ చేస్తే స్పందన రావడం లేదు. సూపర్‌వైజర్లు, సీడీపీఓలకు కార్యకర్తలు సమాచారమిస్తున్నా వారు కూడా ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కావడం లేదు.   

పాలు..విషతుల్యం..
జిల్లాలోని 16 ప్రాజెక్టుల్లోని 3,549 అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో మొత్తం 74,834 మంది  లబ్ధిదారులున్నారు. పాల సరఫరా భాధ్యతను తొలుత మహిళా సంఘాలకు అప్పగించారు. ఐసీడీఎస్, ఐకేపీ మధ్య సమన్వయం లోపించడంతో అంగన్‌వాడీ కార్యకర్తలే సమకూర్చుకోవాలని సూచించారు. స్థానికంగా అవకతవకలు జరుగుతున్నాయనే ఉద్దేశ్యంతో పాల సరఫరాను సమగ్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ తీసుకుంది. రెండేళ్లుగా ప్రభుత్వం విజయ వజ్రా బ్రాండ్‌ పేరుతో టెట్రా ప్యాకెట్లు అందజేస్తున్నారు. వీటి కాల వ్యవధి తొంబై రోజులుగా ప్యాకెట్లపై ముద్రించారు. అయితే సరఫరా చేసిన రెండు రోజులు గడవక ముందే పాకెట్లు ఉబ్బిపోయి, దుర్వాసన వెదజల్లుతున్నాయి.

మరిన్ని వార్తలు