ఏబీసీడీ

22 May, 2014 04:28 IST|Sakshi
ఏబీసీడీ

 - నట్టింట్లో పాఠాలు ఆదరణ చూరగొంటున్న ఈ- లర్నింగ్
 -  సీడీల ద్వారా ఇంట్లోనే
 - విద్యాబోధనఆసక్తి  చూపుతున్న విద్యార్థులు

 
న్యూస్‌లైన్, కర్నూలు(విద్య), ఆధునిక టెక్నాలజీ పుణ్యమా అని నట్టింట్లోకి పాఠాలు వచ్చేశాయి. రెండు దశాబ్దాల క్రితం బొమ్మరిల్లు, చందమామ, జాబిల్లి, బాలమిత్ర వంటి పుస్తకాల ద్వారా నీతి కథలను చదివే బాలలు నేడు ఆడియో, వీడియో రూపంలో వచ్చే సీడీ(కాంపాక్ట్ డిస్క్) ద్వారా తెలుసుకుంటున్నారు. ఈ సీడీల ద్వారా సినిమా రూపంలో పిల్లలకు తల్లిదండ్రులు నైతికవిలువలు, మానవత్వ విలువలు తెలియజేస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలు విడిపోవడం, చిన్న కుటుంబాలు ఏర్పడుతున్న ఈ కాలంలో చిన్నపిల్లలకు సీడీల్లో లభ్యమయ్యే నీతికథలు సమాజంలో ఎలా బతకాలో నేర్పిస్తున్నాయి. వారిలో మానసిక స్థైర్యాన్ని అందించి ధైర్యానికి ఆజ్యం పోస్తున్నాయి. కేవలం నీతి కథలే గాకుండా ఎడ్యుకేషన్ సీడీలు సైతం విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

 పిల్లలకు తల్లిదండ్రులతో పాటు, కుటుంబసభ్యులు, పెద్దలు  ఇలాంటి సీడీలను బహుమతులుగా అందజేసి విజ్ఞానాన్ని పంచుతున్నారు. జిల్లాలో డిపార్ట్‌మెంట్ స్టోర్లతో పాటు పలు పుస్తక, సీడీల విక్రయ కేంద్రాల్లో ఇలాంటి సీడీలు అమ్మకాలు జరుగుతున్నాయి. సీడీల్లో పురాణకథలు: ఒకప్పుడు పురాణకథల గురించి తెలుసుకోవాలంటే చిన్నారులకు బాలమిత్ర, బొమ్మరిల్లు, చందమామ, జాబిల్లి వంటి పుస్తకాలు చదివేవారు. పుస్తకాలను చదివే ఓపిక, తీరిక నేటి చిన్నారులకు లేకపోవడం, ఆ స్థానం టెలివిజన్‌లు ఆక్రమించాయి. ఇదే సమయంలో సీడీల ద్వారా నీతికథలను అందించేందుకు ఆయా కంపెనీలు ముందుకు వచ్చాయి.

దృశ్య, శ్రవణ రూపంలో చిన్నారులకు అర్థమయ్యే రీతిలో రూపొందించిన కథలు చిన్నారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రామాయణ, మహాభారత కథలు చిన్నారులకు అర్థమయ్యే విధంగా ఉండటంతో వీటి డిమాండ్ బాగా పెరిగింది. పిల్లలకు కథలు చెప్పే ఓపిక, తీరిక లేని తల్లిదండ్రులు, పెద్దలు విజ్ఞాన, వినోదాలను అందించేందుకు ఇలాంటి సీడీలను కొని ఇస్తున్నారు.
 టీవీ, కంప్యూటర్‌లలో ఈ లర్నింగ్: ఆధునిక టెక్నాలజీ పుణ్యమా అని ప్రతి ఇంట్లో నేడు టెలివిజన్‌తో పాటు డీవీడీలు అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు కంప్యూటర్‌లూ కొనుగోలు చేస్తున్నారు.

 పురాణకథలు, కామిక్, ఎడ్యుకేషన్‌కు సంబంధించిన సీడీలను చిన్నారులు డీవీడీలు, కంప్యూటర్‌ల ద్వారా ప్లే చేస్తున్నారు. స్టేట్, సీబీఎస్‌ఈ సిలబస్ తరహాలో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఎడ్యుకేషన్ సీడీలు మార్కెట్‌లో విరివిగా లభిస్తున్నాయి. అవసరమైన పాఠ్యాంశాలను నేరుగా ఉపాధ్యాయుడు బోధించినట్లు ఈ-లర్నింగ్ ఉపయోగపడుతోంది. ఎడ్యుకేషన్‌తో పాటు యోగా, ధ్యానం, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం వంటి అంశాల సీడీలను సైతం పిల్లలకు తల్లిదండ్రులు కొనిస్తున్నారు.
 
తరగతి గదిలో పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయుడు ముందురోజు ఇంటి వద్ద పుస్తకాలు తిరగేసి సిద్ధమై వస్తాడు. వాటిని తరగతి గదిలో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చెప్పేందుకు ప్రయత్నిస్తాడు. ఇదే సమయంలో ప్రశ్న పూర్తి కాకముందే విద్యార్థి ఠకీమని సమాధానం చెప్పేస్తాడు. దీంతో అవాక్కవడం ఉపాధ్యాయుని వంతవుతోంది. ఇది మార్కెట్‌లలో లభించే ఎడ్యుకేషన్ సీడీల పుణ్యమేనని తెలుసుకుని, టెక్నాలజీకి అనుగుణంగా ఉపాధ్యాయులు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
 

పాఠ్యాంశాలు బాగా అర్థమవుతున్నాయి
ఎడ్యుకేషన్ సీడీలతో తరగతి గదిలో చెప్పిన పాఠాలు బాగా అర్థమవుతున్నాయి. సైన్స్, మ్యాథ్స్, గ్రామర్ సీడీలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. వీటితో పాటు కామిక్స్, స్పోకెన్ ఇంగ్లీష్, చిత్రలేఖనం వంటి సీడీలు తెచ్చుకున్నాను. తీరిక వేళల్లో వీడియోగేమ్ సీడీలు నాకు ఎంతో ఉత్సాహాన్నిస్తున్నాయి.
 -ఎం. శ్రీనివాస్, చాణిక్యపురికాలని, కర్నూలు

 
యానిమేషన్ మూవీలంటే ఇష్టం
నాకు యానిమేషన్ మూవీలంటే ఇష్టం. ఇటీవల బాలకృష్ణుడు, ఆంజనేయుడు, వినాయకుడు వంటి దేవతలపై రూపొందించిన సీడీలు బాగా చూస్తాను. వీటితో పాటు అమ్మానాన్నలు మాకు చదువుకునేందుకు అవసరమైన సీడీలు సైతం కొనిస్తున్నారు. ఇవి సైతం నాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
 -అఖిల, కర్నూలు

మరిన్ని వార్తలు