కోర్సు ఏదైనా.. విజ్ఞానం అనంతం

7 Oct, 2014 01:20 IST|Sakshi
కోర్సు ఏదైనా.. విజ్ఞానం అనంతం

మచిలీపట్నం (ఈడేపల్లి) :  విద్యార్థి లోకానికి ఇ- లైబ్రరీలు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తున్నాయి. సమయాన్ని, డబ్బును  ఆదా చేస్తున్నాయి. బంగారు భవిష్యత్తుకోసం కలలు కనే నేటి యువతరానికి డిజిటల్ లైబ్రరీలు అండగా నిలుస్తున్నాయి. తమ కలల్ని సాకారం చేసుకునేలా ప్రోత్సాహాన్నిస్తున్నాయి. ఎంతో మంది విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న లక్షల మంది అభ్యర్థులకు ఇప్పుడు డిజిటల్ లైబ్రరీలు కల్పతరువుగా మారాయి.  జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కూడా ఈ సదుపాయం వరంగా మారుతోంది. 21వ శతాబ్దపు నవనాగరికత, అత్యాధునిక జీవనవిధానానికి  ఇంటర్నెట్ వినియోగం ప్రతీక అనడం           అతిశయోక్తి కాదు.

మారుతున్న విజ్ఞానానికి అనుగుణంగా..
జిల్లాకు సంబంధించి.. విజయవాడ, మచిలీపట్నం, మైలవరం, లంకపల్లి, పెడన, గుడ్లవల్లేరు ప్రాంతాల్లో పలు ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో వేలాదిమంది విద్యార్థులు చదువుతున్నారు.  వీరంతా తమ పాఠ్యాంశాలకు సంబంధించిన అన్ని పుస్తకాలు కొనుగోలు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒక వేళ కొందామన్నా.. కావాల్సిన పుస్తకాలు లభ్యమవుతాయని ఖచ్చితంగా చెప్పలేం. అందుకే ఈ కోవకు చెందిన విద్యార్థులంతా ఎక్కువ శాతం ఇంటర్నెట్‌పై ఆధారపడుతున్నారు. చదువుల్లో దూసుకుపోతున్నారు. అలాగే ప్రాజెక్టువర్క్ సమయంలో  వివిధ అంశాలకు సంబంధించిన తాజా సమాచారం తెలుసుకోవడానికి  డిజిటల్ లైబ్రరీలు సౌలభ్యంగా ఉంటున్నాయి.  మారుతున్న బోధన పద్ధతులు, విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆయా కళాశాలల యాజమాన్యాలు కూడా డిజిటల్ గ్రంథాలయాలను ఏర్పాటు చేయడంలో శ్రద్ధ చూపుతున్నాయి.

పోటీపరీక్షలకు..
పోటీ పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొనేందుకు విద్యార్థులు డిజిటల్ లైబ్రరీలను ఆశ్రయిస్తున్నారు. ఒకప్పుడు పోటీ పరీక్షలకు సంబంధించిన సమగ్ర సమాచారం మెటీరియల్ రూపంలో దొరకడం చాలా కష్టం.  ప్రస్తుతం ఆ భయం లేదు. యూపీఎస్సీ పరీక్షలు మొదలుకొని గ్రూప్-1, గ్రూప్-2   ఇలా అన్ని  పోటీపరీక్షలకు సంబంధించిన పాత ప్రశ్నపత్రాలు, సాధన పత్రాలు, మోడల్ పేపర్సు.. ఇలా కావాల్సిన వన్నీ సబ్జెక్టుల వారీగా క్షణాల్లో ఇంటర్నెట్ ద్వారా లభ్యమవుతున్నాయి. వీటితో పాటుగా వివిధ పత్రికలు ప్రతిరోజూ ప్రచురించే సాధన పత్రాలు కూడా అందుబాటులో ఉండడంతో అభ్యర్థుల కెంతో సమయం ఆదా అవడంతో పాటు ప్రయోజనం చేకూరుతోంది.   
 
కోర్సు ఏదైనా.. విజ్ఞానం అనంతం
పాఠ్యాంశాలను కూలంకషంగా అధ్యయనం చేసేందుకు, వైజ్ఞానిక అంశాలను క్రోడీకరించుకుని సొంతంగా నోట్సు తయారుచేసుకునేందుకు ఇంటర్నెట్ బాగా ఉపయోగపడుతుందని విద్యార్థులు పేర్కొంటున్నారు. కేవలం వృత్తి విద్యాకోర్సులు చదివే వారికి మాత్రమే కాక ఇంటర్, డిగ్రీ చదివే వారు కూడా ఇ-లైబ్రరీలపై ఆధారపడి తమ జ్ఞానాన్ని మెరుగుపర్చుకుంటున్నారు. లాసెట్, డైట్‌సెట్, ఎంమ్‌సెట్, ఎడ్‌సెట్ ఇలా పలు ఎంట్రన్స్ పరీక్షలకు హాజరయ్యేవారు మోడల్ ప్రశ్నపత్రాలకోసం ఇంటర్నెట్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇంటర్నెట్ నుంచి  పాఠశాల స్థాయి విద్యార్థులు కూడా అవసరమైన సమాచారం పొందవచ్చు.
 
శేషు సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నాడు. మధ్యతరగ తి కుటుంబం కావడంతో అధునాతన మెటీరియల్స్, మోడల్ పేపర్స్  సంపాదించడం కష్టం. కానీ ఇంటర్నెట్ ద్వారా అవసరమైన పుస్తకాలు, ఇతరత్రా సమాచారం అందిపుచుకో గలుగుతున్నాడు.

మనోజ్ సాహిత్యాభిమాని. ఆంగ్ల రచయిత షేక్‌స్పియర్,  ప్రముఖ హిందీ కవి సుమిత్రానంద్ పంత్ రచనలంటే వల్లమాలిన అభిమానం. వీరి ప్రఖ్యాత రచనలు కొన్ని పుస్తకాలు బుక్‌షాపుల్లో ఎంత  వెతికినా దొరకలేదు. అంతర్జాలం ద్వారా ఒకే ఒక్క క్లిక్‌తో కావాల్సిన పుస్తకాలు కళ్లముందు తళుక్కుమన్నాయి. వాటిని సీడీల్లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఆనందించాడు.

రమేష్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. పాఠ్యాంశాలకు సంబంధించిన పుస్తకాలన్నీ కొనుగోలు చేయాలంటే  ఎంతో ఆర్థిక భారం. అందుకే ఇంటర్నెట్‌ను వినియోగించుకుని కావాల్సిన పుస్తకాలను చదివి, పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపాడు.
 
కృష్ణావర్సిటీ పరిధిలోడిజిటల్  లైబ్రరీలు
ఎలక్ట్రానిక్ డిజిటల్ లెర్నింగ్ రిసోర్సెస్ పాత్ర నేటి విద్యావిధానంలో కీలకంగా మారింది. త్వరలో యూనివర్సిటీ పరిధిలోని కళాశాల్లో  కూడా డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించాం. పాఠ్యాంశాలకు అవసరమైన డిజిటల్ గ్రంథాలయాల వివరాల్ని ఎప్పటికప్పుడు విద్యార్థులకు తెలియజేస్తున్నాం. 2002లోనే యూనిసెఫ్ ‘ఓపెన్ ఎడ్యుకేషన్’ మూవ్‌మెంట్  ప్రారంభించింది.www.oc.w,www.open education.com వెబ్‌సైట్‌లలో ఆ వివరాలు ఉన్నాయి. www.mit.ebu.com సైట్‌లోనే రెండు వేల కోర్సులకు సంబంధించిన గ్రంథాలు నిక్షిప్తమై ఉన్నాయి.
- వి.వెంకయ్య, కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి
 

మరిన్ని వార్తలు