‘ఆ అర్హత చంద్రబాబుకి లేదు’

24 Apr, 2020 15:46 IST|Sakshi

సాక్షి,తాడేపల్లి: కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటింటికి సర్వే చేయిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కరోనా కట్టడిలో అధికారులకు జగన్‌పూర్తి స్వేచ్ఛను ఇచ్చారన్నారు. గుజరాత్‌ నుంచి మత్స్యకారులను తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా టెస్ట్‌లు చేయడంలో దేశం ప్రధమస్థానంలో ఉందని ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.కరోనా వైరస్‌ కంటే చంద్రబాబు ప్రమాదకరమని విమర్శించారు.  తన ప్రచారం ద్వారా చంద్రబాబు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని, హైదరాబాద్‌లో కూర్చొని లేఖలు రాయడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబు ఇంకా తానే సీఎంని అనే భ్రమలో ఉన్నారని, ఆయన పైత్యం పరాకాష్టకి చేరిందని విమర్శించారు.

అఖిల పక్ష సమావేశం పెట్టమని అడిగే అర్హత చంద్రబాబుకి లేదని, కరోనా పది రాజకీయపార్టీలు సమావేశం పెట్టి చర్చించే అంశం కాదన్నారు. చంద్రబాబు ఎప్పుడైనా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారా  అని ప్రశ్నించారు. చంద్రబాబు సలహాలు ప్రభుత్వానికి అవసరం లేదన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 1400 కోట్లు వడ్డీ లేని రుణాల కోసం సీఎం జగన్‌ కేటాయించారని, దీనిని స్వాగతించాల్సిన టీడీపీ నేతలు విమర్మలు చేయడం దరురృష్టకరమన్నారు. టీడీపీ నేతలకు రాజకీయాల్లో  ఉండే అర్హతే లేదన్నారు. జగన్‌ మోహన్‌రెడ్డి ప్రజల్లోకి వెళ్లలేదు అని విమర్శిస్తున్నారు, ఒక వేళ ఇప్పుడు జగన్‌ ప్రజల్లోకి వెళితే వారు ఆగుతారా అని ప్రశ్నించారు. చంద్రబాబువన్నీ పనికిమాలిన విమర్శలు అని టీడీపీపై సజ్జల ఫైర్‌ అయ్యారు.   
 

మరిన్ని వార్తలు