కర్నూలులో హైకోర్టు ‘సీమ’వాసుల ఆకాంక్ష

30 Jan, 2020 11:55 IST|Sakshi
వికేంద్రీకరణకు మద్దతుగా కర్నూలులో సత్యాగ్రహ దీక్ష చేస్తున్న న్యాయవాదులు

సాక్షి, కర్నూలు: కర్నూలులో హైకోర్టు ఏర్పాటనేది ‘సీమ’వాసుల ఆకాంక్ష. దశాబ్దాల తరబడి పాలకులు ఈ విషయంలో కర్నూలుకు న్యాయం చేయలేకపోయారు. రాయలసీమ అభివృద్ధి, ప్రయోజనాల నేపథ్యంలో పుట్టుకొచ్చిన సంఘాలు కూడా హైకోర్టు ఏర్పాటు చేయాలని, శ్రీబాగ్‌ ఒడంబడికను అమలు చేయాలని వాణి విన్పిస్తూనే ఉన్నాయి. రాష్ట్రవిభజన సమయంలో, ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా అమరావతి పేరును ప్రకటించే సమయంలో కూడా కర్నూలును రాజధానిగా ప్రకటించాలని గళం విప్పారు. అమరావతి పేరు ప్రకటించిన తర్వాత చివరకు హైకోర్టు అయినా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

అదీ నెరవేరకపోగా..తుదకు హైకోర్టు బెంచ్‌ను కొన్ని పక్షాలు కోరాయి. అయితే.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అన్నివిధాలా వెనుకబడిన రాయలసీమకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో పాలనా వికేంద్రీకరణలో భాగంగా కర్నూలులో హైకోర్టుతో కూడిన న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఆ మేరకు అసెంబ్లీలో బిల్లు ఆమోదించి.. శాసనమండలికి పంపించారు. కానీ మండలిలో బిల్లు ఆమోదం పొందకుండా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్సీలు పథకం ప్రకారం అడ్డుకున్నారు. పాలనా వికేంద్రీకరణ విషయంలో నెల రోజులుగా టీడీపీ జిల్లా ప్రయోజనాలకు విరుద్ధంగానే వ్యవహరిస్తోంది. 
అభివృద్ధిని విస్మరించి.. 

రాజకీయాలే పరమావధిగా.. 
ప్రాంతాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నేతలు ఇంతకుముందు రాజకీయాలు చేసేవారు. తమ ప్రాంతానికి నష్టం జరిగేలా, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఏవైనా చర్యలు తీసుకుంటే పదవులు, పార్టీలకు రాజీనామాలు చేసేవారు. ఇప్పుడు హైకోర్టు కర్నూలుకు రాకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నా.. జిల్లాలో అధికార పార్టీ నేతలు మినహా తక్కిన రాజకీయపక్షాల నాయకులు నోరుమెదపడం లేదు. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించినప్పుడు టీడీపీ అధిష్టానానికి విరుద్ధంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. కానీ కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటును టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో పాటు మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, ఇతర టీడీపీ నేతలు స్వాగతించలేకపోయారు.

పైగా అమరావతికి మద్దతుగా ర్యాలీలు చేస్తున్నారు. జిల్లావాసి అయిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా టీడీపీ బాటలోనే నడుస్తున్నారు. ఆయన తీరును స్వయాన సీపీఐ జిల్లా నాయకులు తప్పుబట్టినా, ఆయన మాత్రం చంద్రబాబును వీడడం లేదు. వీరితో పాటు కాంగ్రెస్, బీజేపీ, జనసేన, సీపీఎం కూడా “హైకోర్టు’ విషయంలో మాట్లాడకపోవడంపై పరిశీలకులు పెదవివిరుస్తున్నారు. జిల్లాకు మేలు జరిగే అంశంలో అన్ని పక్షాలు ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని పిలుపునిస్తున్నారు.  

హైకోర్టుకు మద్దతుగా అలుపెరగని పోరు 
హైకోర్టుకు మద్దతుగా న్యాయవాదులు మోహన్‌రెడ్డి, గోపాలకృష్ణతో పాటు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 100 రోజుల రిలేదీక్షలు చేపట్టారు. మండలిలో టీడీపీ వ్యవహారం తర్వాత ఆ పార్టీ తీరుకు నిరసనగా, ప్రభుత్వానికి మద్దతుగా ర్యాలీలు చేపట్టారు. వైఎస్సార్‌సీపీ కర్నూలు, నంద్యాల పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు బీవై రామయ్య, శిల్పా చక్రపాణిరెడ్డితో పాటు అన్ని నియోజకవర్గాల్లో నాయకులు, పార్టీ శ్రేణులు హైకోర్టుకు మద్దతుగా ర్యాలీలు చేశారు. రాయలసీమ విద్యార్థి, యువజన విభాగాలు జేఏసీగా ఏర్పడి.. పోరాటం చేస్తున్నాయి. రాయలసీమ ప్రజాసంఘాలు సైతం జేఏసీగా ఏర్పడి... శేషఫణి, సత్తెన్న ఆధ్వర్యంలో ఉద్యమిస్తున్నాయి. పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్, రాయలసీమ విశ్వవిద్యాలయం విద్యార్థులతో పాటు ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజా, కులసంఘాల నాయకులు పోరాడుతున్నారు.

అయితే వీరికి అధికారపక్షం మినహా ఇతర రాజకీయపార్టీల నుంచి మద్దతు లభించడం లేదు. ‘నోటిదాకా వచ్చిన కూడును దూరం చేసినట్టు’ జిల్లా వరకూ వచ్చిన హైకోర్టును దూరం చేసేలా టీడీపీ వ్యవహరిస్తుంటే.. జిల్లా ప్రయోజనాలకు అనువుగా ఇతర పార్టీలు గళం విప్పకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ పరిణామాన్ని మేధావులు, విశ్లేషకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కంటే ప్రాంత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. హైకోర్టుకు మద్దతుగా కడప, అనంతపురం, తిరుపతిలో రోజూ ఉద్యమాలు చేస్తుంటే..కర్నూలులో అంతా మౌనంగా ఉండటం మంచిదికాదని, ఇది ‘మనకు మనం అన్యాయం చేసుకోవడమే’ అని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అందరూ హైకోర్టుకు మద్దతుగా వాణి విన్పించాలని సూచిస్తున్నారు.  

  • ‘శ్రీబాగ్‌ ఒడంబడికను అమలు చేయాలి. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి. రాయలసీమ అభివృద్ధిపై ఇన్నాళ్లూ పాలకులు శీతకన్ను వేశారు. హైకోర్టు ఏర్పాటు చేసేదాకా ఉద్యమం ఆగదు.’ కొన్నేళ్లుగా రాయలసీమ వాదుల ప్రకటనలు ఇవీ.. 
  • ‘పాలన ఒకేచోట కేంద్రీకృతమైతే అభివృద్ధి కూడా కేంద్రీకృతమవుతుంది. పాలన, అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుంది. అందుకే కర్నూలును న్యాయరాజధానిగా చేస్తూ హైకోర్టును ఏర్పాటు చేస్తున్నాం.’ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లులో రాష్ట్ర ప్రభుత్వం 
  • ‘ఒకే రాజధాని ఉండాలి. అందులోనే చట్టసభలు, హైకోర్టు, సచివాలయం ఉండాలి. అభివృద్ధి, పాలన వికేంద్రీకరణకు మేం వ్యతిరేకం’ – జిల్లా వాసులైన సీపీఐ రామకృష్ణ, టీడీపీ నేత సోమిశెట్టి మాట ఇదీ.. 

స్వార్థంతో ఆలోచన చేస్తున్నారు
జిల్లాలోని టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, జనసేన నాయకులు వారి పార్టీలు చెప్పిన విధంగా నడుచుకుంటున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు  వైఎస్‌ఆర్‌సీపీ తప్పా అందరూ వ్యతిరేకమే. ఇన్నాళ్లూ సీపీఎం, సీపీఐ, బీజేపీ నాయకులు రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. చివరకు హైకోర్టు వచ్చే సమయంలో మిన్నకుండిపోయారు. ప్రజల అభిప్రాయంతో పని లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. 
 – టి.చంద్రప్ప, టీఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు 

సీమకు న్యాయం చేయాలన్నదే సీఎం ఆలోచన
2014లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకపక్షంగా అమరావతిలో రాజధాని ప్రకటించారు. ఆనాడు అన్ని పార్టీలు కర్నూలులో హైకోర్టు లేదా రాజధాని ఏర్పాటు చేయాలని కోరాయి. అయినా పట్టించుకోలేదు. కర్నూలుకు 1956లో ఒకసారి, 2014లో మరోసారి తీవ్ర అన్యాయం జరిగింది. దీన్ని సరిదిద్దాలన్నదే సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచన. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అన్ని పార్టీలు మద్దతుగా నిలవాలి. 
– ఇందిరాశాంతి, లెక్చరర్, కేవీఆర్‌ కళాశాల, కర్నూలు 
 
టీడీపీ ఎమ్మెల్సీల తీరు బాగోలేదు
అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీలు కేఈ ప్రభాకర్, బీటీనాయుడు, ఫరూక్‌ మద్దతు తెలపకపోవడం అన్యాయం. కర్నూలుకు న్యాయం చేసుకునే అవకాశాన్ని చేజేతులా జారవిడుస్తున్నారు. వీరిని చరిత్ర క్షమించదు.  
– రోషన్‌ అలీ, రిటైర్డ్‌ తహసీల్దార్‌ 

గళం విప్పాలి 
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కావాలి. ఇందుకు ప్రభుత్వం ముందుకొచ్చినా.. ఇతర పార్టీలు స్వాగతించకపోవడం తగదు. ప్రజల ఆకాంక్షల మేరకు నడుచుకోవాలి.
– అంబన్న, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు 

మరిన్ని వార్తలు