వ్యాధుల ముసురు

6 Jun, 2014 23:10 IST|Sakshi
వ్యాధుల ముసురు
  • మన్యంపై ముప్పేట దాడి
  •  ఇంటింటా రోగులు
  •  ఆస్పత్రుల్లో చాలని వసతులు
  •  ఇంటిల్లిపాదికీ ఒకే బెడ్‌పై వైద్య సేవలు
  • మన్యం మంచమెక్కింది.. ముసురుకున్న వ్యాధులతో సతమతమవుతోంది. ఒక్కసారిగా వ్యాధులు విజృంభించడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మునుపటి కథ పునరావృతమవుతోంది. వాతావరణ మార్పులు, మంచినీటికైనా దిక్కులేని పరిస్థితులు, గిరిజనుల్లో కొరవడ్డ జాగ్రత్తలు.. ఇలా అనేకానేక కారణాలు సమస్యను జటిలం చేస్తున్నాయి. మన్యవాసులను భయపెడుతున్నాయి. ఇంటింటా వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో వైద్యం కష్టమవుతోంది. వైద్యుల సంఖ్య తక్కువగా ఉన్న ఆస్పత్రుల్లో పరిస్థితి సీరియస్‌గా ఉంది. ఒకే బెడ్‌పై కుటుంబం అంతటికీ చికిత్స చేస్తున్న ఉదంతాలు కనిపిస్తున్నాయంటే పరిస్థితి అర్ధమవుతుంది.
     
    పాడేరురూరల్, న్యూస్‌లైన్: మళ్లీ మన్యంలో ఆందోళనకర వాతావరణం కనిపిస్తోంది. వ్యాధుల విజృంభణతో నానాటికీ పరిస్థితి దిగజారుతోంది. వాతావరణ మార్పులకు ఇతర సమస్యలు తోడు కావడంతో ఏజెన్సీ వ్యాధుల సుడిగుండంలో విలవిలలాడుతోంది.

    ప్రతి గ్రామంలో వ్యాధిగ్రస్తుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతూ ఉండడంతో పాడేరులోని ప్రాంతీయ ఆస్పత్రిలో వార్డులన్నీ రోగులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దీనికి తోడు హుకుంపేట మండలంలోని రవ్వలమామిడి, గొల్లమామిడి, గిడ్డివలస గ్రామాల నుంచి డయేరియా బారిన పడి ఒకే సారి సుమారు 50 మందికి పైగా బాధితులు గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం స్థానిక ప్రాంతీయ ఆస్పత్రికి రావటంతో రద్దీ మరిత పెరిగింది.

    స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో 60 మంచాలు మాత్రమే ఉన్నాయి. వైద్య చికిత్సలు పొందుతున్న రోగుల సంఖ్య 150 మందికి పై మాటే. దీంతో మంచాలు సర్దలేక వైద్య సిబ్బంది సతమతమవుతున్నారు. ఇంటిల్లిపాదినీ ఒకే మంచంపై పడుకోబెట్టి వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. ఆస్పత్రిలో సౌకర్యాలు పెంచాలని రోగులు కోరుతున్నారు.
     
    పెరుగుతున్న జ్వరాలు
     
    తమ గ్రామంలో జ్వరాల తీవ్రత నానాటికీ ఎక్కువవుతోందని, వైద్య శాఖ అధికారులు స్పందించి తక్షణమే వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కించూరు పంచాయతీ సర్పంచ్ అడపా పురుషోత్తంనాయుడు కోరారు. గ్రామానికి చెందిన కనీసం 20 మంది విష జ్వరాలు, ఇతర వ్యాధుల బారిన పడి వైద్య సేవల కోసం ఎదురుచూస్తున్నారని, వెంటనే తమ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కోరారు.  
     
    గన్నేరుపుట్టును వీడని డయేరియా

     
    హుకుంపేట: మండలంలోని గన్నేరుపుట్టు పంచాయతీని డయేరియా వీడడం లేదు. ఈ వ్యాధి లక్షణాలతో పంచాయతీ పరిధిలోని గవ్వలమామిడి, శంపంగిపుట్టు, పొర్లు గ్రామాల్లో 46 మంది గురువారం అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. ఇదే పంచాయతీలోని గడ్డివలస గ్రామంలో మరో 36 మంది ఇదే లక్షణాలతో నీరసించిపోవడాన్ని శుక్రవారం అధికారులు గుర్తించారు.

    108లో పాడేరు సీహెచ్‌సీకి ఎకాయెకిన తరలించారు. వరుసగా ఒక్కో గ్రామంలో డయేరియా ప్రబలడంతో గ్రామాల్లోని గిరిజనులు హడలెత్తిపోతున్నారు. విషయం తెలుసుకున్న ఐటీడీఏ ఏపీవో నాయుడు, ఏడీఎంహెచ్‌వో లీలాప్రసాద్, ఎస్పీహెచ్‌వోలు గ్రామాలకు వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీవో నాయుడు మాట్లాడుతూ విషాహరమే ఇందుకు కారణంగా అనుమానిస్తున్నామన్నారు.
     

మరిన్ని వార్తలు