వర్షం.. హర్షం..

13 Jul, 2015 03:29 IST|Sakshi
వర్షం.. హర్షం..

- విశాఖలో 4.4 సెం.మీల వర్షపాతం
- జిల్లాలోనూ పలుచోట్ల వాన
సాక్షి, విశాఖపట్నం :
చాన్నాళ్ల తర్వాత వరుణుడు కరుణించాడు. అనుకోని అతిథిలా వచ్చి వర్షం కురిపించాడు. కొన్నాళ్లుగా ఎండలతో అల్లాడిపోతున్న జనానికి ఊరటనిచ్చాడు. అటు అన్నదాతల్లోనూ ఆనందాన్ని పంచాడు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన మూడు రోజుల క్రితం నుంచి వాతావరణంలో కాస్త మార్పు వచ్చింది. అయితే ఆకాశం మేఘావృతమై చల్లదనం పంచిందే తప్ప చెప్పుకోదగినట్టుగా వాన కురవలేదు. శనివారం ఉదయం మాత్రం విశాఖలోనూ, మరికొన్ని ప్రాంతాల్లోనూ తేలికపాటి వర్షం కురిసింది. అయితే ఆదివారం సాయంత్రం అనూహ్యంగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడ్డాయి.

ఇటు విశాఖనగరంతో పాటు మధురవాడ, భీమిలి, గాజువాక, అటు జిల్లాలోని పాయకరావుపేట, నక్కపల్లి, అనకాపల్లి, చోడవరం, మాడుగుల తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. విశాఖ విమానాశ్రయంలో 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. వర్షంతో పాటు కొన్నిచోట్ల గాలులు కూడా వీచాయి. కొద్దిరోజులుగా మండే ఎండలతో వేగిపోతున్న జనానికి ఈ వాన కొండంత ఊరటనిచ్చింది. అలాగే రైతుల్లోన్లూ ఆశలు చిగురింపజేసింది. పగటి పూట ఎండలు కాసినా సాయంత్రమయ్యే సరికి అప్పుడప్పుడు క్యుములోనింబస్ మేఘాలేర్పడి ఇలాంటి వర్షాలను కురిపిస్తాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు