జవాను వాట్సాప్‌ వీడియో; కంగుతిన్న అధికారులు!

22 Aug, 2019 20:35 IST|Sakshi

హైదరాబాద్‌ : అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు చాలా మంది సోషల్‌ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్ల సహాయంతో తమ గోడును అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. అయితే వీటిలో నిజానిజాలు తెలుసుకోవడం అధికారులకు కష్టతరంగా మారింది. దీంతో నిజమైన బాధితులు ఎవరో తెలియక తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు బ్లాకుకు చెందిన అధికారులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. వివరాలు... చిత్తూరు జిల్లాకు చెందిన టి. చంద్రబాబు భారత ఆర్మీలో హవల్‌దార్‌గా పనిచేస్తున్నారు. స్వస్థలం ఎల్లపల్లిలో ఆయనకు భూమి ఉంది. 

ఈ క్రమంలో తన భూమిని పక్కింటి వాళ్లు ఆక్రమించారంటూ వాట్సాప్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ఇందులో భాగంగా..‘ నేను, నా సోదరుడు ఆర్మీలో పనిచేస్తున్నాం. మా ఊరిలో మాకు 3.60 ఎకరాల భూమి ఉంది. శోభన్‌బాబు, సాంబశివ నాయుడు అనే వ్యక్తులు ఈ భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా వృద్ధురాలైన మా అమ్మను చంపుతామని బెదిరిస్తున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లేదాకా ఈ వీడియోను షేర్‌ చేయండి’ అని తన గోడు వెళ్లబోసుకున్నారు. ఈ క్రమంలో వీడియో వైరల్‌గా మారడంతో గంగాధర నెల్లూరు బ్లాక్‌ రెవెన్యూ అధికారులు హుటాహుటిన ఎల్లపల్లికి చేరుకున్నారు.

చంద్రబాబు చెప్పిన దానికి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి ఏమాత్రం సంబంధంలేదనే నిర్ధారణకు వచ్చారు. ఈ విషయం గురించి తహసీల్దార్‌ భవాని ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ..‘ ఎల్లపల్లిలో వారిద్దరి పేరిట ఆరు ఎకరాలకు పట్టా ఉంది. అయితే కొలిచి చూడగా 3.60 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నట్లుగా తేలింది. నిజానికి ఇంటిస్థలం విషయంలో పొరుగువారితో వారికి విభేదాలు ఉన్నాయి. వాటిని మేము పరిష్కరించాము’ అని తెలిపారు. ఇక ఈ విషయం గురించి చంద్రబాబును సంప్రదించగా భూవివాదం పరిష్కారమైందని.. అయితే దాని గురించి మాట్లాడదలచుకోలేదని చెప్పినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.

మరిన్ని వార్తలు