ఆర్థిక సంఘం నివేదిక తరువాతే..

6 Sep, 2014 02:32 IST|Sakshi
ఆర్థిక సంఘం నివేదిక తరువాతే..

ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వ యోచన!
 
{పత్యేక ప్యాకేజీలూ, పన్ను రాయితీల ప్రకటనా ఆ తరువాతే
మిగిలిన రాష్ట్రాల ఒత్తిళ్లు తప్పించుకునేందుకే ఈ మార్గం
కానీ స్పెషల్ స్టేటస్ ముందే ఇస్తే రాష్ట్రానికి మేలు    

 
న్యూఢిల్లీ: ఏపీ ప్రత్యేక హోదా ఇంకా ఎం దుకు అమలు కాలేదు? పన్ను మినహాయిం పులు ఇంకా ఎప్పుడు ప్రకటిస్తారు? ప్రత్యేక ప్యాకేజీలు ఎప్పుడు ఖరారు చేస్తారు? ఇలా అనేక ప్రశ్నలు రాష్ట్రం మదిలో మెదులుతుండగానే మరోవైపు ఏపీకి మాత్రమే ఎందుకు ఇవ్వాలి? అలా ఇస్తే పొరుగున ఉన్న మేం నష్టపోమా? అంటూ కేంద్రంపై ఒత్తిళ్లు వస్తున్నాయి. ఎన్డీఏ వ్యతిరేక కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఈ వెసులుబాట్ల కోసం డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఏపీ రెవెన్యూలోటుతో ముందుకు సాగలేని పరిస్థితి కనిపిస్తోంది. ఈనేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మనుగడకు పద్నాలుగో ఆర్థిక సంఘం సిఫారసులు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంఘం ముందు ఆంధ్రప్రదేశ్ తన పరిస్థితిని సరైన రీతిలో వివరించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను పూర్తిగా అధ్యయనం చేసి ఆయా రాష్ట్రాలకు అవసరమైన రీతిలో కేంద్ర నిధులను, ఇతర సహాయాలను ఈ కమిషన్ సిఫారసు చేస్తుంది.

12, 13 తేదీల్లో ఏపీలో పర్యటన..

2013 జనవరి 2న ఆర్‌బీఐ మాజీ గవర్నర్ డాక్టర్ వై.వి.రెడ్డి చైర్మన్‌గా, మరో నలుగురు సభ్యులుగా ఏర్పడిన ఈ 14వ ఆర్థిక సంఘం అక్టోబర్ 31లోపు అవార్డు(సిఫారసుల నివేదిక) ఇవ్వాల్సి ఉంది. ఈ అవార్డు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్ల పాటు అమలులో ఉంటుంది. పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ద్వారా రెండు రాష్ట్రాలు అవతరించాక జూన్ 2న రాష్ట్రపతి మరో నోటిఫికేషన్ జారీచేశారు. 14వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కూడా సిఫారసులు చేయాలని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 14వ ఆర్థిక సంఘం ఈ నెల 12, 13 తేదీల్లో ఏపీలో పర్యటించబోతోంది. తరువాత తెలంగాణలోనూ పర్యటించే అవకాశం ఉంది.

ఆచితూచి అడుగులు..

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2014 రాజ్యసభలో ఆమోదం పొందే వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటన చేశారు. అయితే దీనిని కేంద్ర మంత్రివర్గం మార్చి 2నే ఆమోదించి అమలుచేయాలని ప్రణాళిక సంఘాన్ని ఆదేశించినప్పటికీ.. అది అమలు కాలేదు. సాంకేతికంగా అది జాతీయ అభివృద్ధి మండలి(ఎన్డీసీ) ధ్రువీకరణ పొందాలి. ఇందులో అన్ని రాష్ట్రాలు భాగస్వాములుగా ఉన్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ ధ్రువీకరణ అంత సులువయ్యేలా కనిపించడం లేదు. మిగిలిన రాష్ట్రాల నుంచి రాజకీయ ఒత్తిళ్లు తప్పించుకునేందుకు కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఆర్థిక సంఘం అధ్యయనం తరువాత వాస్తవాలన్నీ వెలుగులోకి వచ్చాక నాటి హామీలను అమలుచేసేందుకు నైతిక బలం ఉంటుందన్న దిశగా కేంద్రం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అప్పుడే ప్రత్యేక ప్యాకేజీలు, రాయితీలు ప్రకటించాలని చూస్తోంది.
 
ముందే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రకటిస్తే...
 
వాస్తవానికి 14వ ఆర్థిక సంఘం తుది నివేదిక ప్రకటించకముందే కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక స్టేటస్ ప్రకటిస్తే మరికొన్ని లా భాలు ఉన్నాయి. 13వ ఆర్థిక సంఘం స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాష్ట్రాలపై కాస్త ఉదారత చూపినట్టు అవగతమవుతోంది. ఆ కమిషన్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాష్ట్రాలకు ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ(ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టం నిబంధన ల్లో కొంత మినహాయింపులు ఇచ్చింది. అంతేకాకుండా.. జనరల్ కేటగిరీ స్టేటస్ రాష్ట్రాలు రెవెన్యూ లోటు కలిగి ఉన్నప్పటికీ ప్రణాళికేతర రెవెన్యూలోటు గ్రాంటు(ఎన్‌పీఆర్‌డీ)ను పొందలేకపోయాయి. అంటే రెవె న్యూ లోటు భారీగా ఉన్న ఏపీ.. ప్రత్యేక హోదా పొందకపోతే ఎన్‌పీఆర్‌డీని పొందే అవకాశం కోల్పోయే ప్రమాదంలో ఉంది. అందువల్ల 14వ ఆర్థిక సంఘం అవార్డు రాకముందే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే మేలని, ఈ ఎన్‌పీఆర్‌డీ నిధులు దక్కే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు