గొల్లపల్లికి మళ్లీ జెల్ల సీనియర్ నేత

21 Jun, 2014 08:31 IST|Sakshi
గొల్లపల్లికి మళ్లీ జెల్ల

- ఆశలపై నీళ్లు చల్లిన చంద్రబాబు
- బుద్ధప్రసాద్ పరమైన ఉప సభాపతి పదవి

సాక్షి ప్రతినిధి, కాకినాడ : టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు చంద్రబాబు మరోసారి జెల్లకొట్టారు. మొన్నటి ఎన్నికల్లో గొల్లపల్లికే ఖాయమనుకున్న అమలాపురం ఎంపీ సీటు చివరి నిమిషంలో పండుల రవీంద్రబాబుకు కట్టబెట్టారు. కనీసం అమలాపురం అసెంబ్లీ సీటైనా వస్తుందనుకుంటే అదీ కాదని రాజోలు నుంచి పోటీ చేయించారు. అక్కడ విజయం సాధించిన గొల్లపల్లి మంత్రి పదవి ఖాయమని గంపెడాశలు పెట్టుకోగా.. చంద్రబాబు కొలువులో చోటు దక్కలేదు.

చివరకశాసనసభాపతి లేదా ఉప సభాపతి పదవి అయినా దక్కకపోదన్న ఆయన ఆశ.. సభాపతిగా కోడెల శివప్రసాద్, ఉపసభాపతిగా మండలి బుద్ధప్రసాద్‌ల నియామకంతో  అడియాసే అయింది. దీన్ని జీర్ణించుకోలేని గొల్లపల్లి వర్గం.. చంద్రబాబు కొలువులో ఎస్సీలకు ఇచ్చే ప్రాతినిధ్యం ఇదేనా అని ప్రశ్నిస్తోంది.  ఉపసభాపతికి తన పేరు ఖాయమైందనుకున్న గొల్లపల్లి శుక్రవారం అసెంబ్లీకి వెళ్లే వరకూ అదే నమ్మకంతో ఉన్నారని ఆయన వర్గీయులు అంటున్నారు.
 
మోకాలడ్డిన నేతలు..
చంద్రబాబు కోనసీమకు చెందిన నిమ్మకాయల చినరాజప్పకు ఉప ముఖ్యమంత్రి హోదాను, హోంశాఖను కట్టబెట్టారు. మెట్ట ప్రాంతం నుంచి పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడికి ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖలు ఇచ్చారు. ప్రజాబలం లేక ప్రత్యక్ష రాజకీయాలకు దూరమై, చివరికి తునిలో తన సోదరుడినీ గెలిపించుకోలేని యనమలకు కీలక పదవి నిచ్చి, ఎస్సీల్లో బలమైన తమ సామాజికవర్గం నుంచి గొల్లపల్లిని విస్మరించడాన్ని మాలలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇద్దరు కాపు ఎమ్మెల్యేల్లో రాజప్పకు ఉపముఖ్యమంత్రి హోదా, హోం మంత్రి పదవుల్నీ, అదే వర్గానికి చెందిన ఎంపీ తోట నరసింహానికి  లోక్‌సభలో పార్టీనే త హోదాను కట్టబెట్టారని, ఒక ఎంపీ, ముగు్గరు ఎమ్మెల్యేలున్న తమకు మాత్రం మొండిచేయి చూపించారని కన్నెర్ర చేస్తున్నారు.

రెండు సార్లు మంత్రి చేసి, మూడోసారి ఎమ్మెల్యే అ యిన గొల్లపల్లికి ద క్కుతుందనుకున్న ఉపసభాపతి పదవికి కాపు సామాజికవర్గం నుంచే బుద్ధప్రసాద్ రూపంలో అడ్డుపడడాన్ని జీర్ణిం చుకోలేకపోతున్నారు. పార్టీలో ఒక బలమైన సామాజికవర్గ నేతలు మోకాలడ్డటమే గొల్లపల్లి ఆశలకు గండికొట్టిందంటున్నారు. మంత్రి వర్గ విస్తరణలోనైనా గొల్లపల్లికి న్యాయం జరుగుతుందో, లేదో వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు