27న మరోసారి ‘మండలి’ కమిటీ భేటీ

20 Jan, 2016 04:30 IST|Sakshi
27న మరోసారి ‘మండలి’ కమిటీ భేటీ

♦ డిసెంబర్ 22వ తేదీ జీరో అవర్
♦ వీడియో క్లిప్పింగ్‌లను వీక్షించిన కమిటీ
♦  రోజా, అనిత వాదనలు  వినే అవకాశం

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గత నెల 22న జీరో అవర్‌లో సభ్యులు ప్రస్తావించిన అంశాలపై విచారణ జరిపి నివేదిక ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలోని కమిటీ సమావేశం మంగళవారం అసెంబ్లీ ఆవరణలో జరిగింది. ఈ నెల 27వ తేదీన మరోసారి కమిటీ సమావేశం కావాలని నిర్ణయించింది.
 
 కమిటీ సమావేశంలో సభ్యులు గడికోట శ్రీకాంతరెడ్డి, పి. విష్ణుకుమార్‌రాజు, తెనాలి శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు. 22వ తేదీన సభ జీరో అవర్‌లో విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి  అనిత తనకు అన్యాయం జరిగిందని న్యాయం చేయాలని కోరారు. ఇదే అంశంపై పలువురు సభ్యులు మాట్లాడారు. వీరి ప్రసంగాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లను కమిటీ  సుమారు మూడు గంటలపాటు వీక్షించింది.
 
 శాసనసభ నుంచి ఏడాదిపాటు సస్పెన్షన్‌కు గురైన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజాతో పాటు, ఆమెపై ఫిర్యాదు చేసిన టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనితలను కూడా పిలిపించి వారి వాదనలను వినాలని బీజేపీ ఎమ్మెల్యే, కమిటీ సభ్యుడు పి.విష్ణుకుమార్ రాజు సూచించినట్లు సమాచారం. ఈనెల 27వ తేదీన జరిగే కమిటీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమావేశంలో పాల్గొన్న వైస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంతరెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యే రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేయటాన్ని గట్టిగా  ప్రశ్నించినట్లు తెలిసింది.
 
  340వ నిబంధన ప్రకారం ప్రస్తుత సమావేశాల వరకే సభ్యురాలిని సస్పెండ్ చేయాల్సి ఉన్నా మెజారిటీ సభ్యుల అభిప్రాయం పేరుతో ఏడాదిపాటు సస్పెండ్ చేయటం సరికాద న్నట్లు సమాచారం. శాసనసభ లోపల జరిగిన అంశాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో ప్రసారం  కావటాన్ని కూడా ఆయన ప్రస్తావించి అందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయటంతో పాటు చర్య తీసుకోవాలని సమావేశంలో అన్నట్లు తెలిసింది.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా