మళ్లీ మెరిసిన అమ్మాయిలు

3 Jul, 2017 07:52 IST|Sakshi
మళ్లీ మెరిసిన అమ్మాయిలు
నీట్‌–2017 రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లోనూ ప్రతిభ... ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల భర్తీ కోసం ఏపీ ర్యాంకులు విడుదల
 
సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల భర్తీ కోసం 2017 మే 7న నీట్‌ ప్రవేశ పరీక్ష జరిగినప్పటి నుంచి రాష్ట్ర స్థాయి ర్యాంకుల కోసం ఎదురు చూసిన ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థుల ఉత్కంఠకు తెరపడింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఆదివారం ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీలో వైస్‌చాన్స్‌లర్‌ టి.రవిరాజు, రిజిస్ట్రార్‌ డా.అప్పలనాయుడుతో కలసి రాష్ట్ర స్థాయి ర్యాంకులు విడుదల చేశారు. 2017–18 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి మొత్తం 65 వేల మంది పైచిలుకు అభ్యర్థులు నీట్‌ ప్రవేశ పరీక్ష రాయగా, 32,292 మంది అర్హత సాధించారు. అంటే 50 శాతం మంది అర్హత సాధించినట్టు స్పష్టమైంది.

జాతీయ స్థాయిలో 14వ ర్యాంకు సాధించిన వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన నర్రెడ్డి మన్వితకు రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు దక్కింది. మన్విత నీట్‌లో 685 మార్కులు (99.99844 పర్సెంటైల్‌) సాధించింది. 678 మార్కులతో జాతీయ స్థాయిలో 36వ ర్యాంకు సాధించిన పావులూరి సాయి శ్వేత రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకును సొంతం చేసుకుంది. 675 మార్కులు సాధించిన బాలాంత్రపు ఫణిశ్రీ లాస్యకు మూడవ ర్యాంకు దక్కింది. టాప్‌ టెన్‌లో కూడా ఐదుగురు అమ్మాయిలు ర్యాంకులు దక్కించుకోవడం గమనార్హం. 
 
నేడు దరఖాస్తులకు నోటిఫికేషన్‌
నేడు (సోమవారం) ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీ ప్రక్రియకు సంబంధించి దరఖాస్తుల ఆహ్వానానికి నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్టు ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ వీసీ డా.రవిరాజు, రిజిస్ట్రార్‌ అప్పలనాయుడు విలేకరుల సమావేశంలో తెలిపారు. నోటిఫికేషన్‌ను బట్టి ఆన్‌లైన్‌ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత వెబ్‌ ఆప్షన్లకు తారీఖులు ఇస్తామని, జూలై 4వ వారంలో మొదటి విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో తొలివిడత కౌన్సెలింగ్‌ జులై 30తో పూర్తి చేసి ఆగస్ట్‌ 1 నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు. అనంతరం కౌన్సెలింగ్‌ ప్రక్రియ సైతం ఆగస్ట్‌ 30లోగా పూర్తి చేసి సెప్టెంబర్‌ 1నుంచి తరగతులు ఉంటాయని, ఆ తర్వాత అడ్మిషన్లు జరగవని స్పష్టం చేశారు.
 
ర్యాంకుల్లో స్వల్ప మార్పులు జరగొచ్చు
తాజాగా విడుదల చేసిన రాష్ట్ర స్థాయి ర్యాంకులే తుది ర్యాంకులు కావని, కొద్దిగా మార్పులు జరిగే అవకాశమున్నట్టు ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ అధికారులు చెప్పారు. ప్రస్తుతానికి ఏపీ నుంచి పరీక్ష రాసిన అభ్యర్థుల వివరాలు మాత్రమే తీసి మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. ఇదిలా ఉండగా నాన్‌లో కల్‌ కోటా కింద తెలంగాణ అభ్యర్థులెవరికైనా ఇంతకంటే మంచి మార్కులు వచ్చి, ఇక్కడ చేరాలనుకుంటే తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో కొద్దిగా మార్పులు చోటుచేసుకుంటాయి. కాబట్టి కచ్చితమైన ర్యాంకులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ తర్వాతే తెలిసే అవకాశమున్నట్టు చెప్పారు. కాగా, తెలంగాణలో సుమారు 44 వేల మందికి పైగా నీట్‌ ప్రవేశ పరీక్ష రాయగా, 27,075 మంది అర్హత సాధించినట్టు అధికారులు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి ర్యాంకుల జాబితాను ఆ రాష్ట్రానికి సీడీలో పంపినట్లు ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ అధికారులు చెప్పారు. నేడు ర్యాంకులు ప్రకటించే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు