మల్లీ.. ఎప్పుడొస్తావ్!

24 Apr, 2015 02:00 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మల్లి మస్తానయ్య.. సుబ్బమ్మల ఐదుగురు సంతానంలో మస్తాన్‌బాబు చివరివాడు. చివరివాడే అయినా.. ఆ అమ్మకు ముద్దుల కొడుకు. ఐదుగురు కలిసి ఓ రోజు మాలో ఎవరంటే నీకిష్టం అని తల్లి సుబ్బమ్మను అడిగారు. తడుముకోకుండా ‘చిన్నోడు  మస్తాన్‌బాబు అంటే నాకు ఇష్టం’ అని ఆ తల్లి తేల్చిచెప్పింది. అదేవిధంగా తల్లి సుబ్బమ్మ అన్నా.. మస్తాన్‌బాబుకు ఎనలేని ప్రేమ. అమ్మకు ఆరోగ్యం సరిగా లేదని తెలిస్తే.. మస్తాన్‌బాబు ఎక్కడున్నా రెక్కలు కట్టుకువచ్చి అమ్మ ముందు వాలిపోతాడు. ముద్దులకొడుకు కంటికి కనిపిస్తే సుబ్మమ్మ రోగం గీగం మాయమవుతుంది. అంతగా ఇష్టపడే కొడుకు నెలరోజులుగా కంటికి కనిపించలేదు.
 
  సజీవంగా వస్తాడన్నా.. ఇక రాలేడు. అయినా ఆ మాతృహృదయం ముద్దుల మల్లి మృతదేహం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. చివరివాడే అయినా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన కన్నకొడుకు మల్లి మస్తాన్‌బాబు మృతదేహం కోసం సుబ్బమ్మ 30 రోజులుగా నిద్రాహారాలు మాని ఎదురుచూడటం చూస్తే.. బహుశా ప్రపంచంలో ఏ తల్లికీ ఇంతటి కష్టం వచ్చి ఉండదేమో. పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు కనిపించకుండా పోయి నేటి సరిగ్గా నెలరోజులు. గతనెల 25న మస్తాన్‌బాబు కనిపించలేదని వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి పర్వతాల్లో మస్తాన్‌బాబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఈనెల 4న మస్తాన్‌బాబు మృతిచెందారని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మస్తాన్‌బాబు కనిపించలేదని తెలిసే తల్లి సుబ్బమ్మ తల్లడిల్లిపోయింది. కన్నకొడుకు మరణించాడని తెలిసి అమె గుండెలవిసేలా విలపించింది. ఇప్పటికీ విలపిస్తూనే ఉంది.
 
 సుబ్బమ్మతోనే... గాంధీజనసంఘం
 కన్నతల్లికే కాదు.. కన్న ఊరికీ పేరుతెచ్చిపెట్టాడు మల్లి మస్తాన్‌బాబు. అందుకే జన్మనిచ్చిన ఊరు గాంధీజనసంఘం కూడా మౌనంగా రోదిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో పర్వతారోహకుడిగా గుర్తింపు పొందిన మస్తాన్‌బాబు మరణం కన్నతల్లిని.. జన్మనిచ్చిన ఊరిని శోకలోయల్లోకి తోసేసింది. మస్తాన్‌బాబుకి ప్రకృతి అంటే అంత ప్రేమ.
 
 అందుకే గ్రామంలో ఉంటే ఎక్కువగా పొలాల్లో తిరుగుతూ గడిపేవాడని స్నేహితులు చెబుతున్నారు. జిల్లా పేరును అంతర్జాతీయస్థాయిలో నిలిపిన వ్యక్తి మల్లి మస్తాన్‌బాబు మృతదేహం నేటి రాత్రికి గాంధీజనసంఘం చేరుకోనుంది. అందుకు జిల్లావాసులు అనేక మంది మస్తాన్‌బాబు మృతదేహానికి ఘనంగా కన్నీటి వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యారు. జిల్లా నలుమూలల నుంచి మస్తాన్‌బాబు పార్థీవదేహాన్ని చూసేందుకు పెద్దఎత్తున తరలిరానున్నారు.
 

మరిన్ని వార్తలు