జెడ్పీ పీఠంపై మరోమారు నారీమణి

26 Mar, 2014 04:08 IST|Sakshi

సాక్షి, మచిలీపట్నం :  కృష్ణా జిల్లా పరిషత్ 50 ఏళ్ల ప్రస్థానం పూర్తిచేసుకుంది. తొలి చైర్మన్‌గా చల్లపల్లి రాజా యర్లగడ్డ శివప్రసాద్ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు మాత్రమే కొనసాగారు. ఆయన తరువాత ఎస్.వి.ఆర్.జి.నరసింహారావు కేవలం 19 రోజులపాటు ఇన్‌చార్జి బాధ్యతలు చూశారు. ఆయన తరువాత మాగంటి అంకినీడు జెడ్పీ చైర్మన్ బాధ్యతలను చేపట్టి దాదాపు రెండున్నరేళ్లు పదవిలో కొనసాగారు. ఆయన తరువాత జెడ్పీ పీఠాన్ని అధిష్టించిన పిన్నమనేని కోటేశ్వరరావు దాదాపు 12ఏళ్ల పాటు పదవిలో కొనసాగారు. అనంతరం ఎన్నికలు జరగకపోవడంతో నాలుగేళ్లపాటు ఐదుగురు కలెక్టర్లు ప్రత్యేక అధికారులుగా కొనసాగారు.

1981 జూలైలో జరి గిన ఎన్నికల్లో మరోమారు పిన్నమనేని కోటేశ్వరరావు చైర్మన్‌గిరి చేపట్టి ఏడాదిన్నర కొనసాగారు. ఆయన తరువాత రెండున్నర నెలలు కె.వెంకటరత్నం ఇన్‌చార్జిగా వ్యవహరించారు. అటుతరువాత చైర్మన్ బాధ్యతలు చేపట్టిన సుంకర సత్యనారాయణ మూడేళ్లకుపైగా పదవిలో కొనసాగారు. ఏడాదిపాటు ఎన్నికలు లేకపోవడంతో ఐఏఎస్ అధికారి ఆర్.భట్టాచార్య ప్రత్యేక అధికారిగా కొనసాగారు. 1987లో జరిగిన ఎన్నికల్లో పిన్నమనేని కోటేశ్వరరావు మూడోసారి చైర్మన్ కుర్చీ ఎక్కారు.

మూడోసారి ఆయన ఐదేళ్లు పదవిలో కొనసాగారు. ఆయన తరువాత లంకా వెంకటరత్నానికి 17రోజు లపాటు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అటుతరువాత అప్పటి కలెక్టర్లు రాజీవ్ శర్మ, లక్ష్మీపార్థసారథి  భాస్కర్ దాదాపు మూడేళ్లపాటు ప్రత్యేక అధికారులుగా కొనసాగారు. 1995 మార్చిలో జరిగిన ఎన్నికల్లో కడియాల భాస్కరరావు జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికై ఐదేళ్లపాటు పదవిలో కొనసాగారు. ఆయన తరువాత మళ్లీ అప్పటి కలెక్టర్ బి.ఆర్.మీనా ఏడాదికిపైగా ప్రత్యేక అధికారిగా కొనసాగారు.

 2001లో జరిగిన ఎన్నికల్లో జెడ్పీ పీఠాన్ని అధిష్టించిన తొలి మహిళా ప్రజాప్రతినిధిగా నల్లగట్ల సుధారాణి ఐదేళ్లు పాలన కొనసాగించారు. 2006లో జరిగిన ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన డాక్టర్ కుక్కల నాగేశ్వరరావు ఐదేళ్లపాటు పదవిలో కొనసాగడమే కాకుండా జిల్లాను ప్రగతిబాట పయనించేలా కృషి చేశారు. అనేక అరుదైన రికార్డులు నెలకొల్పి అవార్డులు దక్కించుకున్నారు. 2011 నుంచి ఇప్పటి వరకు  రెండున్నరేళ్లకుపైగా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో కలెక్టర్లు ఎస్.ఎ.ఎం.రిజ్వీ, బుద్ధప్రకాష్ ఎం. జ్యోతి, ఎం.రఘునందనరావు ప్రత్యేక అధికారులుగా కొనసాగారు. తాజాగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి మహిళలకు కేటాయించారు. దీంతో రెండోసారి మహిళామణి జెడ్పీ పీఠం అధిష్టించనున్నారు.

మరిన్ని వార్తలు