10 రోజుల పసికందుకు ఒళ్లంతా వాతలు

6 Feb, 2019 07:20 IST|Sakshi

గిరిసీమల్లో కొనసాగుతున్న మూఢ నమ్మకాలు

వరుస సంఘటనలతో మన్యంలో మరణాలు

ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్న చిన్నారులు

తాజాగా ఓ చిన్నారికి వాతలు పెట్టిన గిరిజనులు

శాస్త్ర సాంకేతికంగా పురోగమిస్తున్నాం... రోదసిలో ప్రయాణిస్తున్నాం... రోబోలను సృష్టించి అపర మేథాసంపత్తిని రుజువు చేసుకుంటున్నాం. కానీ ఇంకా మూఢనమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. తరచూ మన్యంలో అనేక సంఘటనలు తార్కాణాలుగా నిలుస్తున్నాయి. తాజాగా రోజుల బిడ్డకు అనారోగ్యం సోకిందని వాతలు పెట్టిన సంఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.

విజయనగరం, సాలూరు రూరల్‌: మన్యంలో ఇంకా మూఢ నమ్మకాలను వీడటం లేదు. వీరిని చైతన్యపరచడంలో అధికారులు కూడా పూర్తిగా విజయం సాధించడం లేదు. తర చూ ఏదో ఓ చోట ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పాచిపెంట మండలంలో కేసలి పంచాయతీ గిరిశిఖర ఊబిగుడ్డి గ్రామానికి చెం దిన పాడి నర్సమ్మ ఈ ఏడాది జనవరి 25న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. జనవరి 30న బిడ్డకు ఊపిరాడక అస్వస్థతకు లోనవడం, పచ్చకామెర్లు లక్షణాలు కన్పించడంతో స్థానిక మంత్రసానిని ఆశ్రయించారు. ఆమె సూచనలతో చిన్నారి కడుపు చుట్టూ, చెవి, నుదురు, చేయిపై   కాల్చిన సూదులతో వాతలు పెట్టారు. బిడ్డ పరిస్థితి విషమంగా మా రడంతో సాలూరు సీహెచ్‌సీలో వైద్యులు బిడ్డకు ప్రస్తుత చికిత్సను అందిస్తున్నారు. ఇనుప చువ్వల  కారణంగా బిడ్డకు ఇన్‌ఫెక్షన్‌ సోకిందని వైద్యులు చెబుతున్నారు. ఆక్సిజన్‌ తీస్తే బిడ్డ ఊపిరి తీసుకోవడానికి బ్బంది పడుతుండడంతో వైద్యాధికారులు బిడ్డ ఆరోగ్యంపై నేటికీ స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.

సాలూరు మండలం కరాసవలసలో 2018లో ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో వరుస మరణాలతో రాష్ట్రాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. వారి మరణాలకు కారణం భూతమేనని గ్రామస్తులు భూత వైద్యులతో పూజలు చేయించారు. కొందరైతే తాత్కాలికంగా ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇళ్లకు రక్షలు కట్టించారు. ఆ గ్రామంలో రేషన్‌ సరుకులు తీసుకునేందుకు పక్క గ్రామాలవారు సైతం రావడం మానుకున్నారు.

పార్వతీపురం మండలంలోని డోకిశీల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పాచిపెంట మండలం గుమ్మిడిగుడ్డివలస పంచాయతీ అడారువలస గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి జన్ని తమ్మయ్య మృతికి మూఢనమ్మకమే ప్రధానకారణమని అధికారులు తెలిపారు. అపెండిసైటిస్‌ లక్షణాలతో బాధపడిన ఈ విద్యార్థి తనకు చేతబడి చేశారని భూతవైద్యుని వద్దకు తీసుకువెళ్లమని కుటుంబీకులకు తెలపడం తరువాత చోటుచేసుకున్న పలు పరిణామాల వల్ల ఆ విద్యార్థి 2017 సెప్టెంబర్‌ 13న మృత్యుఒడికి చేరాడు.

2016 సెప్టెంబరు నెలలో సాలూరు మండలంలోని తోణాం పంచాయతీ బింగుడువలస గ్రామంలో జరిగిన చోడిపల్లి సీతమ్మ, శంబు దంపతుల హత్యకు ఈ మూఢనమ్మకమే ప్రధాన కారణం. తల్లిదండ్రులు చనిపోవడంతో వారి కుమార్తె కుమారి అనాథగా మారింది.  గ్రామాల్లో దెయ్యాలు తిరుగుతున్నాయంటూ సాలూరు మండలంలోని కొదమ, గంజాయిభద్ర పంచాయతీల్లోని పలు గిరిజన గ్రామాల్లో ప్రజలు తెలిపిన సంఘటనలూ ఉన్నాయి.

కానరాని చైతన్య కార్యక్రమాలు
గిరిజనుల్లో ఎక్కువగా మూఢ నమ్మకాలు ఉంటున్నాయి. అలాంటివారిని చైతన్యపరిచేందుకు అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. కానీ ఆ చర్యలు అంతగా కనిపించడం లేదు. వరుస సంఘటనలు జరుగుతున్నా వారు ఆ దిశలో ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

అవగాహన కల్పిస్తాం
మూఢ నమ్మకాలు విడనాడాలని తెలుపుతూ అవగాహన  కార్యక్రమాలు నిర్వహిస్తాం. ముందుగా ఆరోగ్య విషయంలో   మూఢనమ్మకాలు విడనాడాలని విస్తృతంగా తెలియజేస్తాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.
– రవికుమార్‌ రెడ్డి, ఐటీడీఏ ఇన్‌చార్జ్‌ డిప్యూటీ డీఎమ్‌అండ్‌హెచ్‌ఓ

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు