ఓటు మరింత దూరం

10 Apr, 2019 13:27 IST|Sakshi
ఇంజరి పోలింగ్‌ కేంద్రానికి నడిచి వస్తున్న ఓటర్లు (ఫైల్‌)

పోలింగ్‌ కేంద్రాల విలీనంతో ఆదివాసీలకు అవస్థలు

మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలంటూ కలిపేసిన అధికారులు

20 నుంచి 30 కిలోమీటర్లు  నడిచి వెళ్లి ఓటేయాల్సిన దుస్థితి

పెదబయలు (అరకు): ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటేయడమంటేనే కష్టం. అటువంటిది మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలంటూ అరకు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 14 పోలింగ్‌ కేంద్రాలను రోడ్డుకు ఆనుకుని ఉన్న వాటిలో విలీనంతో ఓటేయడానికి ఆదివాసీలకు అవస్థలు తప్పవన్న వాదన వ్యక్తమవుతోంది. అధికారుల చర్యలపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఓటర్లను ఇబ్బంది పెట్టడమేనని మారుమూల ప్రాంత ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెదబయలు మండలం ఇంజరిలోని 71, 72 నంబర్ల పోలింగ్‌ బూత్‌లను ఇదే పంచాయతీలోని చీకుపసనలో విలీనం చేశారు. అలాగే గిన్నెలకోట పంచాయతీకి చెందిన 58, 59 పోలింగ్‌ కేంద్రాలను 25 కిలో మీటర్లు దూరంలో ఉన్న 55వ నంబరు పోలింగ్‌  కేంద్రం కొరవంగిలో కలిపేశారు. జామిగుడ, గుంజివాడ 56, 57 పోలింగ్‌ బూత్‌ల పరిధిలోని వారు  20 కిలో మీటర్లు దూరం నడిచి వెళ్లి ముంచంగిపుట్టు మండలం మద్దిలబందలో ఇప్పుడు ఓటేయాలి.

ఇంజరి పోలింగ్‌ బూత్‌ పరిధిలో 1101 మంది ఓటర్లు, గిన్నెలకోట 58, 59 పోలింగ్‌ బూత్‌ల్లో వరుసగా 805, 626 మంది ఓటర్లు, 56, 57 కేంద్రాల్లో 981, 1033 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో 4552 మంది 20  నుంచి 30 కిలో మీటర్లు నడిచి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది.  ఇప్పుడు ఇంత దూరం   వచ్చి ఓటు వేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముంచంగిపుట్టు మండలం బుంగాపుట్టు, కుసంపుట్టు పోలింగ్‌ కేంద్రాలను బాబుసాల పంచాయతీ మచ్చపురానికి, భూసిపుట్టు, సరియాపల్లి, కెందుగుడ  కేంద్రాలను మద్దుల బందలో విలీనంతో  ఆయా ప్రాంతాల ఓటర్లు కూడ 25 నుంచి 30 కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంది. ఎన్నడూ లేని విధంగా పోలింగ్‌ కేంద్రాల విలీనం దారుణమని, వృద్ధులు, పెన్షన్‌దారులు  ఓటు వినియోగం కష్టమవుతుందని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటు హక్కు వినియోగానికి  ఎన్నికల అధికారులు కనీసం వాహన సదుపాయం  కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు