ఇదేం స్పెషల్ డీఎస్సీ!

22 May, 2015 02:26 IST|Sakshi

సీతంపేట:ఏజెన్సీస్పెషల్ డీఎస్సీపై అభ్యర్థులు పెదవి విరుస్తున్నారు. అరకొరగా పోస్టులు కేటాయించడాన్ని తప్పుబడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా షెడ్యూల్డ్ ఏజెన్సీలో 402 పోస్టుల భర్తీకి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అనుమతినిచ్చింది. అయితే మన జిల్లాకు 26 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది. ఇంటర్, డిగ్రీ, బీఈడీ, టెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. స్కూల్ అసిస్టెంట్ హిందీ ఒకటి, ఇంగ్లిష్, సోషల్ ఒక్కొక్కటీ, హిందీ పండిట్ గ్రేడ్ టు- 4, ఆశ్రమ పాఠశాలల్లో ఎస్జీటీ-7, గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో 12 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నప్పటికీ అసలు వివిధ ఆశ్రమ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేరు. ఏజెన్సీలో 60కి పైగా టీచర్ పోస్టులు ఖాళీలున్నాయని కేవలం 26 మాత్రమే భర్తీ చేస్తున్నారని పలు ఉపాధ్యాయ సంఘాలు, గిరిజన సంఘాలు వాపోతున్నాయి. ఏ పాఠశాలలో చూసినా సబ్జెక్టు టీచర్ల పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయకపోవడంతో విద్యాసంవత్సరం ఆరంభం నుంచే విద్యార్థులకు కష్టాలు తలెత్తే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.   
 
  అప్‌గ్రేడ్ పాఠశాలల మాటేమిటీ?
 సీతంపేట ఏజెన్సీలో ఐదు వరకు పాఠశాలలను అప్‌గ్రేడ్ చేశారు.  సీతంపేటలోని గిరిజన వసతిగృహాన్ని ఆశ్రమ పాఠశాలగా మార్చారు. ఇక్కడ ఏడాది పూర్తయినా ఇంతవరకు పోస్టుల భర్తీ లేదు. అలాగే రెండేళ్ల క్రితం శంభాం, సీతంపేట, సామరెల్లి, పూతికవలస, పొల్ల తదితర పాఠశాలలన్నింటినీ అప్‌గ్రేడ్ చేసి సబ్జెక్టుటీచర్లను ఏళ్ల తరబడి నియమించలేదు. ప్రధాన సబ్జెక్టులైన ఆంగ్లం, గణితం, పీజిక్స్ వంటి సబ్జెక్టులకు కూడా టీచర్లు లేరు. తెలుగు, హిందీ పండిట్ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. ఈ విషయాన్ని  డిప్యూటీ ఈవో మల్లయ్య వద్ద ‘సాక్షి’ విలేకరి ప్రస్తావించగా వాస్తవానికి షెడ్యూల్డ్ ఏరియాకు ఇంకా 9 పోస్టులు, అప్‌గ్రేడ్ పాఠశాలకు మరో 22 పోస్టులు కేటాయించాల్సి ఉందన్నారు.
 

మరిన్ని వార్తలు