దగాపడ్డ గిరిపుత్రులు

11 Mar, 2018 13:00 IST|Sakshi
కూలి సొమ్ము ఏజెంట్‌ నుంచి ఇప్పించాలని కోరుతున్న గిరిజన యువతీ యువకులు

పనిచేయించుకుని వేతనం ఎగ్గొట్టిన ఏజెంట్‌

రొయ్యల చెరువులో పనికోసం వెళ్లిన గిరిజన యువత

ఐదు నెలల పని చేయించుకుని మాయమైన వైనం

ఆందోళన వ్యక్తం చేస్తున్న బాధితులు

కూటికోసం... కూలికోసం... వలస వెళ్లిన గిరిపుత్రులకు ఎంత కష్టం... ఎంత నష్టం. ఐదు నెలలు ఎండనకా... వాననకా... కష్టపడిన ఆ యువతకు రిక్తహస్తమే మిగిలింది. పని ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లి వారి శ్రమ దోపిడీ చేసిన ఏజెంట్‌ తీరుపై వారంతా మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

గుమ్మలక్ష్మీపురం(కురుపాం): పొట్టకూటికోసం వలస పనుల కెళ్లిన తమచే పనిచేయించుకున్న ఏజెంట్‌ తమకు రావాల్సిన కూలి సొమ్మును ఎగ్గొట్టాడంటూ గుమ్మలక్ష్మీపురం మండలం జర్న పంచాయతీ చినవంకధార, బబ్బిడి, అచ్చబ, వాడపుట్టి గ్రామాలకు చెందిన 22 మంది గిరిజన యువతీ యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధితులు కె.సోమేష్, సోములు, సిద్ధు, జగన్, శ్రీహరి, గణేష్, భాస్కరరావు, క్రిష్ణ, కె.రోజా, కె.శాంతి, సన్యాసి, ఎన్‌.మధు తదితరులు శనివారం ఏపీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోలక అవినాష్, మండల కార్యదర్శి మండంగి శ్రీనివాస్‌లతో కలిసి ఎల్విన్‌పేటలో విలేకర్లతో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సతీష్‌ అనే ఓ వ్యక్తి(ఏజెంట్‌) రోజుకు రూ.270లు చొప్పున కూలి వచ్చేలా పని ఇప్పిస్తానని తమను ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వెలగపూడి గ్రామంలో ఉన్న సంధ్య కంపెనీ సైట్స్‌(హేచరీస్‌)కు గత ఏడాది సెప్టెంబర్‌ 6న తీసుకెళ్లాడని చెప్పారు.

అప్పటి నుంచి తమచే పగలు, రాత్రిళ్లు కూడా రొయ్యల కంపెనీలో పనులు చేయించుకున్నారని చెప్పారు. అయితే వచ్చి చాలా రోజులైనందున స్వగ్రామాలకు వెళ్లి తల్లిదండ్రులు, కుటుంబీకులను చూసి వస్తామనీ కూలి సొమ్ములు ఇవ్వాలని ఏజెంట్‌ సతీష్‌ను అడగ్గా... ఒక్కొక్కరికి కేవలం రూ.8వేలు వంతున మాత్రమే అందజేసారని తెలిపారు. తమకు ఒక్కొక్కరికి రూ.40లు పైబడి ఇవ్వాల్సి ఉండగా రూ.8వేలే ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించగా, మళ్లీ వస్తేనే మిగతా డబ్బు చెల్లిస్తానని చెప్పాడని వారంతా వాపోయారు. చేసేది లేక వారం రోజుల క్రితం ఏజెంట్, కంపెనీ ప్రతినిధులకు చెప్పకుండా స్వగ్రామాలకు వచ్చామని, తమతో పాటు పనులకు వచ్చిన కె.త్రినాథ్, శ్యాం, కిరణ్, సంజయ్‌ అనే మరో నలుగురు అక్కడే ఉండిపోయారని చెప్పారు. తమతో సుమారు ఐదు నెలల పాటు పనిచేయించుకొని కూలి సొమ్ము ఇవ్వకుండా ఏజెంట్‌ అన్యాయం చేసాడని, దీనిపై గిరిజన సంఘం నాయకులకు తెలపగా వారితో పాటు ఎల్విన్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు వచ్చామన్నారు. ఈ మేరకు వారంతా ఎల్విన్‌పేట ఎస్సై కె.కిరణ్‌ కుమార్‌ నాయుడును కలసి సమస్యను వివరించి న్యాయం చేయాలని కోరారు. స్పందించిన ఎస్సై రొయ్యల చెరువు యజమానులతో పాటు ఏజెంట్‌ సతీష్‌తో ఫోన్లో మాట్లాడి బాధితులకు మిగతా సొమ్ము తక్షణమే చెల్లించాలని, లేకుంటే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు