పోలవరం ప్రాజెక్టు వద్ద మరోసారి కుంగిన భూమి

27 Apr, 2019 12:44 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: పోలవరం ప్రాజెక్టు వద్ద మరోమారు భూమి కుంగిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రాజెక్టు వద్ద 902 ఏరియాలో భూమి బీటలు వారుతుంది. గతంలో కూడా ఇదే ప్రాంతానికి సమీపంలో భూమి 20 అడుగులు పైకి ఎగదన్ని నెర్రెలు బారి.. ముక్కలు ముక్కలుగా కుంగిపోయిన విషయం తెలిసిందే. ఆ తరువాత కొద్ది రోజులకే స్పిల్‌వే రెస్టారెంట్‌ వద్ద భూమి కంపించి పగుళ్లు సంభవించాయి. పోలవరం ప్రాజెక్ట్ సమీపంలో ఉన్న రెస్టారెంట్ లోపల సైతం భయంకరంగా పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో రెస్టారెంట్‌ సిబ్బంది భయకంపితులై బయటకు పరుగులు తీశారు.



నాలుగు నెలల వ్యవధిలో ప్రాజెక్టు పరిసరాల్లో మూడు సార్లు భూమి కుంగినప్పటికీ.. దీనికి గల కారణాలను అధికారులు పరిశోధించలేదు. జాతీయ ప్రాజెక్టు వద్ద ఈ విధంగా జరుగుతున్నప్పటికీ.. అధికారుల నిర్లక్ష్య ధోరణి కనబరచడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరుస ఘటనలతో ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు.. పోలవరం కాంట్రాక్టు సంస్థలు ఏమీ లేదంటూ బాధ్యతా రహిత్యంగా ప్రకటన జారీ చేశాయి.

మరిన్ని వార్తలు