మంటల్లో చేతులు పెడుతున్నారు

2 Mar, 2015 02:44 IST|Sakshi
మంటల్లో చేతులు పెడుతున్నారు

8 నెలలకే ఆశ, అహంకారం పెరిగితే ఎలా?
ప్రజామోదం లేని ఏ పనీ లక్ష్యం చేరదు
అదే జరిగితే జాతీయస్థాయి ఉద్యమం
రైతులకు ఇష్టం లేకుండా భూ సేకరణ సాధ్యం కాదు
సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్ స్పష్టీకరణ

సాక్షి, విజయవాడ బ్యూరో: ‘ఏపీ సీఎం చంద్రబాబు.. మంటల్లో చేతులు పెడుతున్నాడు.

ఇలాగైతే భవిష్యత్తు రాజకీయం ఉండదు. 8 నెలలకే ఇంత ఆశ, అహంకారమైతే ఎలా? ప్రజామోదం లేకుండా చేపట్టే ఏ పనీ లక్ష్యం చేరదు. దీన్ని గుర్తిస్తే సరి, లేదంటే పతనమే. రాజధాని రైతులకు ఇష్టం లేకుండా భూ సేకరణ సాధ్యంకాదు. అలా జరిపితే విజయవాడ కేంద్రంగా మహోద్యమాన్ని మొదలు పెడతాం’ అని జాతీయ స్థాయి ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్ హెచ్చరించారు.

కేంద్రం అమల్లోకి తెచ్చిన భూ సేకరణ ఆర్డినెన్స్‌పై పార్లమెంటులో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆర్డినెన్స్‌ను చూసి భయపడుతున్న ఏపీ రాజధాని ప్రాంత రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడేందుకు అగ్నివేశ్ విజయవాడ వచ్చారు. వెట్టిచాకిరీ, బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థపై దశాబ్దకాలంగా ప్రజా ఉద్యమాలు చేస్తున్న ఆయన రాకతో రాజధాని రైతుల్లో స్థైర్యం పెరిగింది. ఈ సందర్భంగా అగ్నివేశ్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. ఇలా..
 
సాక్షి: భూ సమీకరణ నిర్ణయం సమర్థనీయమేనా?
అగ్నివేశ్: ముమ్మూటికీ కానేకాదు. మట్టిని నమ్ముకుని బతికే శ్రమజీవులకు అన్యాయం చేసేలా పెద్ద ఎత్తున భూ సమీకరణ చేయడం సబబు కాదు. చండీగఢ్, రాయపూర్ రాజధానులకు 5 వేల ఎకరాలు మాత్రమే సేకరించగా, ఇక్కడ మాత్రం 30 నుంచి లక్ష ఎకరాలు ఎందుకో అర్థం కావడం లేదు.
 
సాక్షి: ప్రజాభిప్రాయం ఎలా ఉంది?
అగ్నివేశ్: సారవంతమైన భూములున్న ఎర్రబాలెం, పెనుమాక గ్రామాలకు వెళ్లాను. పొలాలు చేజారి పోతున్నాయన్న ఆందోళన అక్కడి వారిలో కనిపించింది. నేను ప్రశ్నించే లోగా.. ‘ప్రాణాలైనా ఇస్తాం గానీ పొలాలు మాత్రం ఇవ్వలే’మన్నారు. నేలతల్లితో వారికున్న అనుబంధం అలాంటిది. అప్పుడే అనుకున్నా వీరికి అండగా నిలబడాలని. ఎంతటి ఉద్యమానికైనా సిద్ధం కావాలని.
 
సాక్షి: రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని సీఎం అంటున్నారు ?
అగ్నివేశ్: ఇది భారత్. భారతదేశంగానే ఉండాలి. మన సంప్రదాయాలు, ఆచారాలు, నమ్మకాలు దెబ్బతినకూడదు. సింగపూర్‌గా ఎందుకు మార్చడం?ఎవరికి ప్రయోజనం?  రియల్ వ్యాపారులు, కార్పొరేట్ సంస్థలు బాగుపడతాయంతే.
 
సాక్షి: ప్రపంచస్థాయి రాజధాని నగరం అవసరమా?
అగ్నివేశ్:
డబ్బుల్లేవంటూనే ప్రపంచస్థాయి రాజధాని ఎందుకట? సుందరమైన చిన్న రాజధాని సరిపోతుంది కదా. ఇందుకు పెట్టే ఖర్చును తగ్గించి పరిశ్రమలు, వ్యవసాయ రంగాలను వృద్ధి చేసుకుంటే ఆర్థికాభివృద్ధి పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఎంతోమందికి ఉపాధి లభిస్తుంది.
 
సాక్షి: రాష్ట్రంలో బాబు, కేంద్రంలో మోదీ ఒకే బాటలో వెళ్తున్నారా?
అగ్నివేశ్: ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. భూ సేకరణ ఆర్డినెన్సును కేంద్రంలో అన్ని పార్టీలూ వ్యతిరేకించాయి. యూపీ, పంజాబ్‌లతో పాటు రాంవిలాస్‌పాశ్వాన్, శివసేన పార్టీలు కూడా ఆర్డినెన్సును వ్యతిరేకించాయి. కానీ.. మోదీ, చంద్రబాబు మాత్రమే దీన్ని సమర్థించారు. దీన్నిబట్టి ఈ ఆర్డినెన్సును చంద్రబాబు కోసమే తెచ్చారన్నది సుస్పష్టం.
 
సాక్షి: రైతులకు మీభరోసా ?
అగ్నివేశ్: వారి కోసం నిలబడతాం. ప్రభుత్వం బలవంతంగా భూములు సేకరిస్తే ప్రతిఘటిస్తాం. జాతీయ స్థాయి నాయకులను తీసుకొస్తాం. అన్నాహజారే, మేథాపాట్కర్ వంటి ఉద్యమకారులూ వస్తారు. హర్యానా, యూపీ, ఢిల్లీల నుంచి ఎంతో మంది తరలివస్తారు. ప్రభుత్వం ఎంత మంది పోలీసులను పెట్టినా, తపాకీ గుళ్లు పేలినా వెనుకంజ వేయం. విజయవాడ కేంద్రంగా జాతీయ స్థాయి ఉద్యమం హోరెత్తేలా చేస్తాం.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు