అగ్రి గోల్డ్ డిపాజిటర్ల ఆందోళన

9 Oct, 2014 02:39 IST|Sakshi
అగ్రి గోల్డ్ డిపాజిటర్ల ఆందోళన

రాయదుర్గంటౌన్: గడువు ముగిసినా డిపాజిట్ మొత్తాన్ని తిరిగి చెల్లించక పోవడంతో ఆగ్రహించిన గుమ్మఘట్ట మండలం కలుగోడు గ్రామానికి చెందిన డిపాజిటర్లు బుధవారం రాయదుర్గంలోని అగ్రి గోల్డ్ ప్రైవేటు ఫైనాన్స్ క ంపెనీ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. యాజమాన్యం వైఖరికి నిరసనగా ధర్నా నిర్వహించారు.

ఆపై సదరు సిబ్బందిని నిర్బంధించారు. డిపాజిట్ చెల్లించేంత వరకు కార్యాలయంలోనే ఉంటామంటూ తెగేసి చెప్పి, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన కొనసాగించారు. ఆ గ్రామానికి చెందిన దాదాపు 60 మంది ఒక్కొక్కరు రూ.20 వేలలోపు దాదాపు రూ.5 లక్షలను డిపాజిట్ చేశారని వాపోయారు. గత జూన్ 30 నాటికే మెచ్యూరిటీ గడువు ముగిసినా ఇప్పటికీ మొత్తాన్ని చెల్లించకుండా జాప్యం చేస్తున్నారన్నారు.

డిపాజిట్‌దారులు గోవిందు, అశ్వత్థమ్మ, వెంకటేశులు, హనుమంతరాయుడు, ఆంజనేయులు, లక్ష్మణ్ణ, సతీష్, రాజు మాట్లాడుతూ డబ్బులు ఇవ్వకుండా ప్రతి రోజూ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని, మేనేజర్ స్పందించక పోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఆందోళనకు దిగామని చెప్పారు. మేనేజర్ రాఘవేంద్ర గుప్త మాట్లాడుతూ విజయవాడలోని ప్రధాన కార్యాలయ అధికారులతో చర్చిస్తున్నామని, 15 రోజుల్లోగా డిపాజిట్లు చెల్లిస్తామని అన్నారు. అయితే ఇలాగే నమ్మించి తిప్పుకుంటున్నారని, తమ సొమ్ము చెల్లించే వరకు కదలబోమని డిపాజిటర్లు మేనేజర్ చాంబర్‌లో బైఠాయించారు. కూలీ, నాలీ చేసుకుంటూ చెల్లించిన డబ్బును ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడమేమిటని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు