అన్నదాత బెంగ

20 Feb, 2015 03:15 IST|Sakshi

గతేడాది ఓ మోస్తరు వర్షం కురవడం వల్ల బోర్లలో నీరు వస్తుండటంతో రైతులు సంబరపడ్డారు. ఆ నీటిని నమ్ముకుని హడావిడిగా పంటలు సాగు చేశారు. వారి ఆశలు కొద్ది రోజులు కూడా నిలవలేదు. మోటారు స్విచ్ ఆన్ చేయగానే పైపు నిండా నీరు వచ్చి... ఉన్నట్టుండి ఆగిపోతుండటంతో రైతు గుండె వేగం పెరిగింది. మోటారు కాలిపోతుందేమోనని స్విచ్ ఆఫ్ చేసి.. కాసేపాగి మళ్లీ ఆన్ చేయడం.. ఇలా ఐదారు మార్లు చేసే సరికి కరెంట్ కట్.. కొద్ది రోజులుగా ఆ కాసిన్ని నీళ్లు కూడా రాకపోవడంతో పచ్చని పండ్ల చెట్లు నిట్టనిలువునా ఎండిపోయాయి.  
 
 అనంతపురం అగ్రికల్చర్ /గుమ్మఘట్ట: ప్రమాద ఘంటికలు మోగిస్తున్న పాతాళ గంగ ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన ‘అనంత’ అన్నదాతకు దుఃఖాన్ని తెచ్చిపెడుతోంది. ఈ ఏడాది అనుకున్న రీతిలో వర్షాలు కురవక పోవడంతో భూగర్భ జలాలు క్రమంగా అడుగంటిపోతున్నాయి. ఫలితంగా బోరుబావుల నుంచి నీరు రావడం గగనంగా మారింది.
 
  చాలా ప్రాంతాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. పంటను కాపాడుకునేందుకు అప్పులు చేసి కొత్తగా బోర్లు వేయిస్తూ భగీరథ ప్రయత్నాలు చేస్తున్నా పది శాతం కూడా ఫలితం ఇవ్వని దుస్థితి నెలకొంది. బోరుబావుల నుంచి పౌడరు తప్ప గుక్కెడు నీరు పడటంలేదు. గతంలో 200-300 అడుగుల లోతులో బోర్లు వేయించే వారు ఇపుడు 800 నుంచి 1,000 అడుగులు వేయించడం మామూలైపోయింది.   అయినా అన్నదాత ఆశలు ఫలించక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. దీంతో లక్షలాది హెక్టార్లలో విస్తరించిన ఉద్యాన, వ్యవసాయ పంటలు, మల్బరీ తోటలను ఎలా కాపాడుకోవాలో అర్థం కాక ఆందోళన వ్యక్తమవుతోంది.  
 
 46 శాతం తక్కువగా వర్షాలు
 జిల్లా వార్షిక వర్షపాతం 522 మిల్లీమీటర్లు కాగా వరుణుడు మొహం చాటేయడంతో ఇప్పటి వరకు 274 మి.మీ వర్షం కురిసింది. అంటే కురవాల్సిన వర్షం కన్నా 46 శాతం తక్కువగా నమోదైంది. ఒక్క మండలంలో కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కాలేదంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అనంతపురం, రాప్తాడు, బుక్కరాయసముద్రం, తనకల్లు, తలుపుల, సోమందేపల్లి, శింగనమల, రొద్దం, కనగానపల్లి, పెనుకొండ, పుట్టపర్తి, బుక్కపట్టణం, కొత్తచెరువు, బత్తలపల్లి, ముదిగుబ్బ, పుట్లూరు, పెద్దపప్పూరు, పామిడి, ఓడీసీ, ధర్మవరం, చిలమత్తూరు తదితర మండలాల్లో 50 నుంచి 80 శాతం తక్కువగా వర్షపాతం నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం నాలుగైదు మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. ఇలాంటి పరిస్థితి ఏర్పడటంతో భూగర్భ జల మట్టం క్రమంగా క్షీణిస్తోంది.
 
 సగటు నీటి మట్టం 21.08 మీటర్లు
 భూగర్భ జల శాఖ (గ్రౌండ్ వాటర్) తాజాగా సేకరించిన వివరాల ప్రకారం జిల్లాలో సగటు భూగర్భ నీటి మట్టం 21.08 మీటర్లుగా నమోదైంది. జిల్లాలో బోరు బావులకు అనుసంధానం చేసిన 192 గ్రామాల్లో ఫీజో మీటర్ల నుంచి సేకరించిన వివరాలు పరిశీలిస్తే చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి.
 
  గత డిసెంబర్‌లో 19.53 మీటర్లు, జనవరిలో 20.41 మీటర్లలో ఉండగా తాజాగ 21.08 మీటర్లకు చేరుకున్నాయి.  మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది ఇదే సమయానికి 17 మీటర్లు ఉండింది. అంటే దాదాపు 5 మీటర్లకు పైబడి లోతుకు పడిపోవడం ప్రమాదానికి సంకేతమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. జిల్లా సగటు నీటి మట్టం 21.08 మీటర్లుగా నమోదైనా... కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. గాండ్లపెంటలో ఏకంగా 72.90 మీటర్ల లోతుకు వెళ్లాయి.
 
 అగళి మండలం మధూడిలో 71.06 మీటర్లు, తలుపులలో 65.01 మీటర్లు, అమడగూరు మండలం మహమ్మదాబాద్‌లో 63.87 మీటర్లు, మడకశిర మండలం ఆర్.అనంతపురంలో 58.58 మీటర్లు, లేపాక్షి మండలం కొండూరులో 54.87 మీటర్లు, తాడిమర్రి మండలం పిన్నదరిలో 51.47 మీటర్లు, సోమందేపల్లి మండలం చాలకూరులో 53.87 మీటర్లు, గోరంట్ల మండలం పులగూర్లపల్లిలో 54.89 మీటర్లు, పుట్లూరులో 45.56 మీటర్లు, రాప్తాడు మండలం మరూరులో 40.38 మీటర్లు, బత్తలపల్లి మండలం కట్టకిందపల్లిలో 44.07 మీటర్లు, గుమ్మగట్ట మండలం తాళ్లకెరెలో 42 మీటర్లు... ఇలా చాలా ప్రాంతాల్లో 40 మీటర్లకు పైబడి ఉండగా మరో 100 గ్రామాల్లో 30 నుంచి 40 మీటర్ల లోతులోకి వెళ్లాయి. భూగర్భ జల శాఖ వివరాలను బట్టి జిల్లాలో 12 నుంచి 15 మండలాల్లో మాత్రమే పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది.  
 
 కళ్లెదుటే పంట పాయె..
 పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు పడరాని కష్టాలు పడుతున్నారు. పండ్ల తోటలతో పాటు రబీ రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. మూడు ఇంచుల నీరు వచ్చే బోర్లలో సైతం ఒక్కసారిగా అర్ధ ఇంచుకు పడిపోతున్నాయంటే భూగర్భ జలాలు ఏమేరకు తగ్గిపోయాయో ప్రత్యేకించి చెప్పక్కరలేదు.
 
 రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మఘట్ట మండలంలో గంగ జాడ కరువైంది. కలుగోడు, బేలోడు, రంగచేడు, జే వెంకటంపల్లి, నేత్రపల్లి, భూపసముద్రం, తదితర గ్రామాల్లో పాతాళగంగను బయటకు తీసుకొచ్చేందుకు అన్నదాతలు చేస్తున్న ప్రయత్నం ఫలించడం లేదు. బోర్లెన్ని తవ్వించినా దుమ్ము తప్ప తేమ జాడ కనిపించడం లేదు. ఒక్క సారైనా ఆ దేవుడు కరుణించక పోతాడా అన్న ఆశతో రూ. లక్షలు అప్పు చేసి బోర్లను తవ్విస్తూ మరింత సంక్షోభంలో కూరుకుపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు తోడు ఐదేళ్లుగా వర్షాభావ పరిస్థితులు వెంటాడటంతో బోర్లే కాదు చెరువులు, కుంటల్లోనూ చుక్కనీరు లేని పరిస్థితి. అడవి జంతువులు, పక్షులు, మేత కెళ్లిన పశువులు ఊరి సమీపానికొచ్చి దాహం తీర్చుకుంటున్నాయి.
 
  పరిస్థితి ఇలాగే కొనసాగితే గుక్కెడు తాగునీరు కూడా దొరకడం కష్టసాధ్యమైపోతుందని పలు గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం ఉన్న బోర్లలో సైతం నీరు అడుగంటి పోతుండడంతో వ్యవసాయం ఎలా చేయాలిరా దేవుడా అంటూ రైతులు తల పట్టుకుంటున్నారు. గుమ్మఘట్ట మండలంలో ఒక్కో రైతు 10 - 15 బోర్లు తవ్విస్తూ పండ్ల తోటలను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మండల వ్యాప్తంగా నీరు లేక 500 హెక్టార్లలో పండ్ల తోటలు ఎండిపోయాయి. వాటిని చూసి తట్టుకోలేక రైతన్నలు తల్లడిల్లిపోతున్నారు. ప్రభుత్వం స్పందించి బోర్ల వల్ల అప్పుల పాలైన ప్రతి రైతుకు తగిన పరిహారం అందజేయాలని కోరుతున్నారు.
 
 అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచడం లేదు
 నాలుగు ఎకరాల పొలంలో నడుస్తున్న బోరు నిలిచిపోయింది. అందరిలాగే పంట పెట్టుకోవాలనే ఆశతో రూ.4.68 లక్షలు ఖర్చుచేసి 9 బోర్లు తవ్వించాను. చుక్క నీరు పడలేదు. బోర్ల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచడం లేదు. రుణ ఒత్తిళ్లు అధికం కావడంతో కుమారులతో కలసి బెంగళూరుకు వలస వెళ్తున్నాం.         
 - వెంకటేశులు, కలుగోడు, గుమ్మఘట్ట మండలం
 
 హగరిలో తవ్వినా చుక్క నీరు లేదు
 భూమి తల్లిని నమ్మి బాగుపడాలనే ఆశతో 0.45 సెంట్లలోనే రూ. 1.50 లక్షలు ఖర్చు చేసి 6 బోర్లు తవ్వించాను. హగరి పక్కనే పొలం ఉన్నా వట్టి దుమ్ము తప్ప తేమ జాడే లేదు. అప్పులు తీర్చేందుకు పిల్లలతో కలిసి వలస వెళుతున్నాం.
 - ఎరుకుల వెంకటేశులు, కలుగోడు, గుమ్మఘట్ట మండలం
 
 గట్టెక్కడం కష్టమే
 16 ఎకరాల్లో పండ్ల తోట సాగు చేశాను. మొక్కలు ఏపుగా పెరిగే సరికి బోర్లలో నీరు ఒట్టిపోయాయి. ఏడాది పాటు ట్యాంకర్ల ద్వారా నీరు తోలుకొచ్చి పోశాను. అలా తీసుకురావడం నా వల్ల కాక వదిలేశాను. చాలా చెట్లు ఎండిపోయాయి. నష్టాల నుంచి ఎలా గట్టెక్కాలో దిక్కు తోచడం లేదు. ప్రభుత్వం తగిన పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.  
 - బీఎన్‌టీ తిప్పేస్వామి, రాయదుర్గం
 
 హెక్టారుకు రూ.2 లక్షల పరిహారం ఇవ్వాలి
 పండ్ల తోటలు సాగు చేసి తీవ్రంగా నష్టపోయిన ప్రతి రైతుకు హెక్టారుకు రూ. 2 లక్షల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయాలి.  చాలా మంది రైతులు వలసలు వెళ్లిపోతుండటం బాధ వేస్తోంది. నియోజకవర్గం వ్యాప్తంగా ఇలా నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తాం. తక్షణ పరిహారానికి చర్యలు తీసుకోవాలి. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి బీటీప్రాజెక్ట్‌కు నీటిని మళ్లించి ఈ ప్రాంత రైతులను గట్టెక్కించాలి.  
 - కాపు రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాయదుర్గం.
 
 విరివిగా తోడేస్తున్నారు
 వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో జలాలు అడుగంటిపోతున్నాయి. వ్యవసాయ, ఉద్యాన పంటల విస్తీర్ణం ఎక్కువగా ఉండటంతో అందుబాటులో ఉన్న నీటి వనరులను చాలా చోట్ల 100 శాతం తోడేస్తున్నారు. వర్షాలు, కాలువల ద్వారా జిల్లాలో సంవత్సరానికి 50.87 టీఎంసీల నీరు లభ్యమవుతుండగా అందులో తాగునీరు, పంటలకు 40.29 టీఎంసీలు వాడేస్తున్నారు. 10.57 టీఎంసీలు మిగులు ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోనే ఉన్నా చాలా మండలాల్లో మాత్రం ఇబ్బందిగా మారింది. ఏప్రిల్-మే నెలల్లో భూగర్భ జలాలు కనిష్ట స్థాయికి పడిపోయే ప్రమాదం ఉంది.
 - పి.పురుషోత్తమ రెడ్డి, జిల్లా భూగర్భ జల శాఖ డీడీ
 

>
మరిన్ని వార్తలు