రైతు భరోసా: కౌలు రైతులకై గడువు పెంపు

6 Nov, 2019 14:38 IST|Sakshi

సాక్షి, అమరావతి : ప్రభుత్వం ప్రతిష్టా‍త్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకం ద్వారా ఇప్పటి వరకు 40 లక్షల 84 వేల మందికి లబ్ది చేకూరిందని వ్యవసాయ కమిషనర్‌ అరుణ్‌ కుమార్‌ తెలిపారు. పథకం అమలులో భాగంగా బుధవారం లక్షా ఏడు వేల రైతు కుటుంబాలకు 97 కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. అదే విధంగా ప్రతీ బుధవారం పథకం కొత్త లబ్దిదారులకు రైతు భరోసా కింద సహాయం అందజేస్తామని పేర్కొన్నారు. నవంబర్ 15 నాటికి అర్హులైన రైతులందరి ఖాతాల్లో నగదు జమ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్లు తెలిపారు. అదే విధంగా ఈనెల 9న రైతు భరోసా కోసం ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రతీ మండలంలో తహశీల్దార్‌, వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో అర్హులైన రైతుల అర్జీలు పరిష్కరిస్తామని తెలిపారు. కౌలు రైతులకు కూడా డిసెంబర్ 15 వరకు రైతు భరోసా గడువు పెంచినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు