విత్తనాలు రెడీ 

13 May, 2020 04:29 IST|Sakshi

గ్రామ సచివాలయాల ద్వారా పంపిణీ

వరి విత్తనాలపై క్వింటాల్‌కు రూ.500 సబ్సిడీ

వేరుశనగపై 40 శాతం, పచ్చిరొట్ట విత్తనాలకు 50 శాతం సబ్సిడీ

జాతీయ ఆహార భద్రత మిషన్‌ కింద గుర్తించిన ఉత్తరాంధ్ర రైతులకు మరింత చౌకగా..

ఇ–క్రాప్‌ బుకింగ్‌ ఆధారంగా రైతులకు సరఫరా

సాక్షి, అమరావతి:  ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు సబ్సిడీపై ఇచ్చే విత్తన ప్రణాళికను వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. ఈ నెల 18 నుంచి విత్తనాలు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఇ–క్రాప్‌ బుకింగ్‌ ఆధారంగా విత్తనాలు సరఫరా చేస్తారు. రైతులు గ్రామ సచివాలయాల్లో డబ్బు చెల్లించి రాయితీ పొందవచ్చు. సబ్సిడీ వర్తించని వారు పూర్తి మొత్తాన్ని చెల్లించి విత్తనాలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. 5,07,599 క్వింటాళ్ల వేరుశనగ, 2,28,732 క్వింటాళ్ల వరి, 83,215 క్వింటాళ్ల జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట విత్తనాలు వ్యవసాయ శాఖ అందుబాటులో ఉంచింది. 

సబ్సిడీ ఇలా.. 
► 13 రకాల వరి వంగడాలను 9 జిల్లాలకు కేటాయించారు. ఈ విత్తనాలపై క్వింటాల్‌కు  రూ.500 సబ్సిడీ ఉంటుంది. పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో రైతులు సొంతంగా విత్తనం తయారు చేసుకుంటారు కాబట్టి ఆ జిల్లాలకు తక్కువ కేటాయించారు. 
► గ్రామ సచివాలయాల్లో రైతులు నిర్ధేశించిన సొమ్ము చెల్లించి రశీదును గ్రామ వ్యవసాయ సహాయకులకు చూపి విత్తనాల్ని పొందవచ్చు. 
► జాతీయ ఆహార భద్రత మిషన్‌ కింద గుర్తించిన జిల్లాలకు, గుర్తించని జిల్లాలకు సబ్సిడీలో తేడా ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు జాతీయ ఆహార భద్రతా మిషన్‌ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం)లో ఉన్నాయి. 
► కే–6, ఇతర రకాల వేరుశనగ విత్తనాల ధరను క్వింటాల్‌కు రూ.7,850గా నిర్ణయించారు. దీనిపై 40 శాతం పోను రైతులు క్వింటాల్‌కు రూ.4,710 చెల్లించాలి.  
► పచ్చిరొట్ట పంటలుగా సాగు చేసే జీలుగ, జనుము, పిల్లి పెసర విత్తనాలపై 50 శాతం సబ్సిడీ ఉంటుంది. 

మరిన్ని వార్తలు