నియోజకవర్గానికో అగ్రిల్యాబ్‌

4 Aug, 2019 12:42 IST|Sakshi
దుకాణంలో పురుగుమందులు 

సాక్షి, నిడదవోలు(పశ్చిమగోదావరి) : రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీల ప్రకారం వైఎస్సార్‌ రైతు భరోసా, సున్నా వడ్డీకే రుణాలు, రూపాయికే పంట బీమా, పగటి పూట 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా వంటి విప్లవాత్మకమైన చర్యలు శ్రీకారం చుట్టారు. వీటితో పాటు కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులతో అన్నదాతలు నష్టపోకూడదని సంకల్పించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వైఎస్సార్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. వీటి ఏర్పాటుకు వ్యవసాయ బడ్జెట్‌లో రూ.109.28 కోట్లు కేటాయించారు. రైతులు వినియోగించే ఎరువులు, విత్తనాలు, క్రిమి సం హారక మందులను ముందుగానే తనిఖీ చేసి వా టిని నాణ్యతను నిర్ధారించిన తరువాతే మార్కెట్లో విడుదల చేయాలని ఆదేశించారు. దీంతో జిల్లాలోని 4.70 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.

రైతులకు విస్తృత ప్రయోజనాలు 
ఒక్కో ల్యాబ్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 లక్షల చొప్పున కేటాయించనుంది. 2 వేల చదరపు అడుగుల్లో ఏర్పాటుచేయనున్న ఈ ల్యాబ్‌లో ఒక ఏఓ, ఇద్దరు టెక్నికల్‌ అసిస్టెంట్‌లను నియమించనున్నారు. త్వరలో ఏర్పాటుకానున్న వీటితో రైతులకు విత్తనాలు, ఎరువులు, మందులు లభించే అవకాశాలు పెరుగుతాయి. నకిలీలకు అడ్డుకట్ట పడనుంది. రైతులకు విస్తృత ప్రయోజనాలు చేకూరనుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం 
చేస్తున్నారు.

నకిలీలకు చెక్‌
మట్టి నమూనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు, విత్తనాల నాణ్యతను రైతులు నేరుగా తెలుసుకునేందుకు వైఎస్సార్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్స్‌ అందుబాటులోకి రానున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, మట్టి నమూనాల పరీక్షలన్నీ ఒకేచోట ఉండేలా నియోజకవర్గానికో ల్యాబ్‌ చొప్పున ఏర్పాటుచేయనున్నారు. దీని కోసం స్థలసేకరణకు సంబంధించి వ్యవసాయాధికారులకు ఉన్నతాధికారుల నుంచి ఇప్పటికే ఆదేశాలు అందాయి. ప్రభుత్వ గోదాములు, మార్కెట్‌ యార్డు వంటి ప్రాం తాలలో వీటిని ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ల్యాబ్‌లతో మట్టి నమూనాల ద్వారా నేల స్వభావాన్ని తెలుసుకోవచ్చు.

ఇప్పటివరకు జిల్లాల్లో తాడేపల్లిగూడెంలో మాత్రమే ఈ కేంద్ర ఉంది. దీంతో ఏటా నమూనాలను మార్చిలో తక్కువగా తీసినా సరైన సమయానికి మట్టి పరీక్షలు చేయడం పూర్తికావడం లేదు. దీంతో రైతులకు సకాలంలో ఫలితాలు రాకపోవడంతో చౌడు భూములు, జింక్‌ లోపం ఉన్న పొలాల్లో సాగుచేయడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. కొత్తగా ఏర్పాటుచేసే ల్యాబ్‌ల్లో మట్టి పరీక్షలు చేసుకోవడం ద్వారా నత్రజని వంటి పోషకాలను నేలకు అందించి లోపాలను సరిచేయవచ్చు. విత్తనాల నాణ్యత విషయాన్ని రైతులు నేరుగా పరిశీలించుకోవచ్చు. ఎరువులు, పురుగుమందుల నా ణ్యతపై అనుమానం ఉంటే నేరుగా రైతులు వాటిని ఈ టెస్టింగ్‌ కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకునే అవకాశం కల్పించనున్నారు.

నకిలీలను అరికట్టవచ్చు 
రైతులకు అందుబాటులోనే టెస్టింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటైతే అనుమానం ఉన్న విత్తనాలను, ఎరువులు ముందుగానే పరీక్షలు చేయించుకునే అవకాశం ఉంటుంది. గతంలో నకిలీ విత్తనాలు వేయడంతో మొలకలు సరిగ్గా రాక నిడదవోలు మండలంలోని ఉనకరమిల్లి, తాడిమళ్ల గ్రామాల రైతులు నష్టపోయారు. కొంతమంది నాసిరకమైన విత్తనాలు, ఎరువులు విక్రయిస్తున్నారు. ఇకపై ఈ ల్యాబ్‌ల వద్దే నకిలీలను అరికట్టవచ్చు.
–పోలిరెడ్డి శివరామకృష్ణ, రైతు, ఉనకరమిల్లి 

రైతులందరికీ మేలు 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నియోజకవర్గానికి ఒక మట్టి పరీక్ష ల్యాబ్‌ను ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకోవడంతో రైతులందరికీ ఎంతో మేలు జరుగుతుంది. గోదావరి జిల్లాలంటేనే ఎక్కువ మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తారు. మట్టి పరీక్ష కేంద్రాలు స్థానికంగా ఏర్పాటుచేయడం వల్ల రైతులే స్వయంగా వెళ్లి వారి పొలంలో లోపాలను తెలుసుకునే అవకాశం ఉంది. టెస్టింగ్‌ చేయడం వల్ల లోపాలను అధిగమించి సాగుచేస్తే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది.
–కస్తూరి కోటేశ్వరరావు, రైతు, సమిశ్రగూడెం  

మరిన్ని వార్తలు