నేడు వ్యవసాయ మిషన్‌ సమావేశం

14 Oct, 2019 03:39 IST|Sakshi

హాజరుకానున్న పాలగుమ్మి సాయినాథ్, స్వామినాథన్, రైతు సంఘాల నాయకులు

ధరల స్థిరీకరణ నిధి, రబీ పంటల సాగు కార్యాచరణపై చర్చ

నెల్లూరు జిల్లాలో ప్రారంభం కానున్న రైతు భరోసాపై చర్చించే అవకాశం

సాక్షి, అమరావతి/వెంకటాచలం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం వ్యవసాయ మిషన్‌ సమావేశం జరగనుంది. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కింద రైతులకు వ్యవసాయ పెట్టుబడి సాయం అందించడం, రబీ పంటల సాగు కార్యాచరణ, ధరల స్థిరీకరణపై సోమవారం వ్యవసాయ మిషన్‌ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. వ్యవసాయ మిషన్‌లోని నిపుణులు పాలగుమ్మి సాయినాథ్, స్వామినాథన్, రైతు సంఘాల నాయకులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారు. రైతు భరోసా పథకాన్ని ఈ నెల 15న నెల్లూరు సమీపంలోని కాకుటూరులో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. 15వ తేదీ ఉదయం 10.30 గంటలకు విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణానికి సీఎం చేరుకుంటారు.

ఆ తర్వాత కౌలు రైతులకు కార్డులు పంపిణీ చేస్తారు.  రైతులకు రైతుభరోసా కింద వ్యవసాయ పెట్టుబడి సాయంగా చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం బహిరంగసభలో సీఎం ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో రైతు భరోసా పథకానికి రూ. 5,510 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.సత్యనారాయణ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఆయా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఆ డబ్బులను బ్యాంకులు ఇతర బకాయిలకు జమ చేసుకోవడానికి వీలు ఉండదు. ఇప్పటికే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పలుసార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు, నేతలు
విక్రమసింహపురి వర్సిటీలో జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నెల్లూరు జిల్లా ఉన్నతాధికారులు ఆదివారం పరిశీలించారు. రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, డాక్టర్‌ పోలుబోయిన అనిల్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు తలశిల రఘురాం, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, వి.వరప్రసాదరావు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తదితరులు పరిశీలించారు. ఏర్పాట్లపై నెల్లూరు జిల్లా కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబుతో చర్చించి పలు సూచనలు ఇచ్చారు.

మరిన్ని వార్తలు