సీఎం జగన్‌ వ్యవసాయానికి పెద్దపీట వేశారు

13 Jul, 2019 12:27 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఏపీ బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్దపీట వేశారని వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయానికి 12.66 శాతం కేటాయించారని, ఉచిత విద్యుత్‌కు చేసిన ఖర్చుతో కలిపి వ్యవసాయానికి 13.5 శాతం కేటాయింపులు దాటుతాయని తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ రైతుల పంటలకు గిట్టుబాటు ధర కోసం రూ. 3 వేల కోట్లు కేటాయించారు. గత చంద్రబాబు ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారు. చంద్రబాబులాగా వైఎస్‌ జగన్‌ మాట తప్పే వ్యక్తి కాదు. దేశంలో ఎక్కడా లేని విధంగా పంటలకు భీమా కడతామని ప్రకటించారు. టీడీపీ అధికారంలో ఉండగా చనిపోయిన రైతులకు పరిహారం అడిగితే.. ‘రైతులకు పరిహారం ఇస్తే  మరింత మంది పరిహారం కోసం చనిపోతా’రని చంద్రబాబు మాట్లాడారు.

చంద్రబాబు హయాంలో చనిపోయిన రైతులకు వైఎస్‌ జగన్‌ పరిహారం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది నుంచి ఇవ్వాల్సిన రైతు భరోసాను ఈ ఏడాది నుంచే ఇస్తున్నారు. రైతులకు లక్ష వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. రైతులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మేలు చేసినట్లే వైఎస్‌ జగన్‌ కూడా మేలు చేస్తున్నారు. రైతులకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అండగా ఉంటుంది. వ్యవసాయానికి పగటి పూట విద్యుత్ ఇవ్వడానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. గత ప్రభుత్వం విత్తన కంపెనీలకు నిధులను ఎగ్గొట్టింద’’ని వెల్లడించారు.

మరిన్ని వార్తలు