అగ్రిగోల్డ్‌ దెబ్బ

18 Nov, 2018 04:43 IST|Sakshi
వినుకొండలో వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన యువకులు.. వారికి నచ్చజెబుతున్న వైఎస్సార్‌ సీపీ నేత బొల్లా, సుబ్రమణ్యం (ఫైల్‌)

హాయ్‌ల్యాండ్‌ ఆస్తులతో తమకు సంబంధం లేదన్న అగ్రిగోల్డ్‌

ఆందోళనలో ఏజెంట్లు, డిపాజిటర్లు

చిత్తూరు జిల్లాలో ఓ ఏజెంట్‌ గుండె పోటుతో మృతి

గుంటూరు జిల్లాలో మరో ఆరుగురి ఆత్మహత్యాయత్నం

బుచ్చినాయుడుకండ్రిగ/వినుకొండ: తమ ఏజెంట్లు, డిపాజిటర్లకు అగ్రిగోల్డ్‌ యాజమాన్యం పెద్ద షాక్‌ ఇచ్చింది. హాయ్‌ల్యాండ్‌ ఆస్తులతో తమకు సంబంధం లేదని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్‌ ఏజెంట్లు, డిపాజిటర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. శనివారం చిత్తూరు జిల్లాలో ఓ ఏజెంట్‌ గుండెపోటుకు గురై మృతి చెందగా.. గుంటూరు జిల్లాలో ఆరుగురు బాధితులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాలు.. చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని కారణికి చెందిన సుబ్రమణ్యం (55) స్థానిక సోలార్‌ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. సోలారు ఫ్యాక్టరీ కొన్ని కారణాలతో మూతపడడంతో 2008లో కుటుంబ పోషణ నిమిత్తం అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌గా చేరాడు. దాదాపు 40 మంది దగ్గర అగ్రిగోల్డ్‌ రోజువారి కలెక్షన్లతో పాటు డిపాజిట్ల రూపంలో సుమారు రూ.15 లక్షలను సేకరించాడు. అగ్రిగోల్డ్‌ మూతపడడంతో సుబ్రమణ్యంకు డిపాజిటర్ల నుంచి ఒత్తిడి ప్రారంభమయ్యింది. శుక్రవారం హాయ్‌ల్యాండ్‌తో తమకు సంబంధం లేదని అగ్రిగోల్డ్‌ యాజమాన్యం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో సుబ్రమణ్యం తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. గుండెలో నొప్పిగా ఉందని తెలపడంతో భార్య, కుమారుడు శ్రీకాళహస్తిలోని ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.  

వినుకొండలో మిన్నంటిన నిరసనలు
అగ్రిగోల్డ్‌ బాధితుల నిరసనలతో గుంటూరు జిల్లా వినుకొండ  అట్టుడికింది. సీపీఐ ఆధ్వర్యంలో బాధితులు పట్టణంలో భారీ నిరసనలకు దిగారు. శివయ్య స్థూపం సెంటర్‌కు చేరుకున్న బాధితుల ర్యాలీని ఉద్దేశించి సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఆఖరి రూపాయి చివరి ఏజెంట్‌కు చేరేవరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదని హెచ్చరించారు. అగ్రిగోల్డ్‌ బాధితుల ర్యాలీ శివయ్య స్థూపం సెంటర్‌కు చేరుకోగానే మండలంలోని భారతాపురానికి చెందిన రాజారపు మునెయ్య ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. పోలీసులు, సీపీఐ నాయకులు రాజారపు మునెయ్యను అడ్డుకున్నారు. ఇంతలోనే  పెదకంచర్లకు చెందిన మంచికంటి అప్పారావు, ఏటి సత్యం, విఠంరాజుపల్లికి చెందిన కె.సురేష్, పిట్టంబండకు చెందిన శివాసింగ్, నూజెండ్లకు చెందిన అరిగెల నాగేశ్వరరావు వాటర్‌ ట్యాంకు ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు ఐదుగురు యువకులను క్షేమంగా కిందకు దించి ప్రథమ చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. 

బొల్లా పరామర్శ.. 
అంతకుముందు వైఎస్సార్‌సీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు వెంటనే ట్యాంక్‌ వద్దకు చేరుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేవరకు వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. బాధితుల ఆత్మహత్యాయత్నం సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుపై బాధితులు దుమ్మెత్తి పోశారు. ప్రభుత్వ తీరుతోనే తమకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. బాధితులు వైఎస్సార్‌సీపీ వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా రాగానే ఆయన్ని కలసి తమ సమస్యలు వినిపిస్తుండగా..ఆ సమయంలో అక్కడే ఉన్న సీపీఐ నేత ముప్పాళ్ల బాధితులనుద్దేశించి ‘పోరాటం చేయాలంటే వైఎస్సార్‌సీపీతో పొండి.. న్యాయం జరగాలంటే మాతో ఉండండి’ అని అనడంతో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. ముప్పాళ్ల తీరుపై ఆగ్రహంతో ఊగిపోయిన బొల్లా బ్రహ్మనాయుడు ‘జెండా కాదు ముఖ్యం అజెండా’ అని చెప్పడంతో ముప్పాళ్ల సర్దుకుని ‘అలా అనలేదు’ అంటూ మాటమార్చారు.

మరిన్ని వార్తలు