దాచుకున్న సొమ్ము చేతికందకుండానే..

3 Apr, 2018 11:47 IST|Sakshi
మృతి చెందిన ఓబులమ్మ

మానసిక వేదనతో అగ్రిగోల్డ్‌ బాధితురాలి మృతి

కొలిమిగుండ్ల:  కూలీకి వెళ్తే కానీ ఇంట్లో పొయ్యి వెలగని పరిస్థితి ఆమెది. అలాంటి దీనస్థితిలో కూడా బిడ్డ పెళ్లి కోసం తినీ తినక నెలకింత అగ్రిగోల్డ్‌ సంస్థలో దాచుకుంది. అవసరానికి ఆ డబ్బు చేతికందలేదు. అప్పు చేసి కార్యం పూర్తి చేసింది. రోజులు గడిచాయి.. అయినా దాచుకున్న సొమ్ము తిరిగి వస్తోందో లేదో తెలియని అయోమయం నెలకొంది. దీంతో మానసికంగా కుంగిపోయి చివరకు ప్రాణం వదిలింది. కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామంలో అగ్రిగోల్డ్‌ బాధితురాలు ఓబులమ్మ(50) సోమవారం మృతి చెందింది.

స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన ఆమెకు ఓ కుమార్తె ఉంది. 15 ఏళ్ల క్రితమే భర్త ఏసుదాసు ఆమెను వదిలి వెళ్లాడు. అప్పటి నుంచి కూలీకి వెళ్తూ బిడ్డను పోషించుకుంది. బిడ్డతోపాటు ఒంటరిగా ఉన్న ఆమె తల్లి మార్తమ్మను కూడా చెంతకు చేర్చుకుంది. కష్టపడి సంపాదించిన సొమ్ములో రూ. 50 వేలు అగ్రిగోల్డ్‌ సంస్థలో డిపాజిట్‌ చేసింది. బిడ్డ పెళ్లికి కూడా డబ్బు చేతికి అందక పోవడంతో అప్పు చేసింది. ఈ క్రమంలో సంస్థ బోర్డు తిప్పేయడంతో మానసికంగా కుంగిపోయింది. అనారోగ్యంతో మంచం పట్టి.. దాచుకున్న సొమ్ము చేతికందకుండానే మృత్యుఒడికి చేరింది. ఓబులమ్మ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నాయకులు అనిల్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు