గళమెత్తిన అగ్రిగోల్డ్‌ బాధితులు

19 Nov, 2018 08:18 IST|Sakshi
తణుకులో అగ్రిగోల్డ్‌ చైర్మన్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బాధితులు

పశ్చిమగోదావరి, తణుకు టౌన్‌: కోర్టు, ప్రజలను తప్పుదోవపట్టిస్తున్న అగ్రిగోల్డ్‌ యాజమానులకు ఇచ్చిన బెయిల్‌ రద్దు చేసి విచారణను వేగవంతం చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్‌ చేశారు. హాయ్‌లాండ్‌ తమకు సంబంధం లేదంటూ అగ్రిగోల్డ్‌ యాజమాన్యం న్యాయస్థానంలో చెప్పడాన్ని నిరసిస్తూ ఆదివారం సీపీఐ, అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో తణుకు నరేంద్ర సెంటర్‌లో అగ్రిగోల్డ్‌ గ్రూపు కంపెనీల చైర్మన్‌ అవ్వా వెంకట రామారావు దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈసందర్భంగా భీమారావు మాట్లాడుతూ 20 లక్షల కుటుంబాల నుంచి రూ.3,800 కోట్ల మేర డిపాజిట్‌లు సేకరించి తమ స్వార్థంతో సంస్థను సంక్షోభంలోకి నెట్టేసి చోద్యం చూస్తున్న యాజమాన్యంపై కోర్టు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈవిషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని కోరారు. సీపీఐ పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, గుబ్బల వెంకటేశ్వరరావు, అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నాయకురాలు వై.నాగలక్ష్మి, తణుకు శాఖ అధ్యక్షుడు నల్లాకుల గణపతి, ఎన్‌.రామశ్రీను, జి.కొండయ్య, సాదే సామ్యూల్‌ రాజు, కె.సత్యనారాయణ, సీహెచ్‌వీ రమణ, జె.సత్యనారాయణ, పీజే దానం, జి.అనంతలక్ష్మి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు