అమరావతి నుంచి.. అహ్మద్‌ పటేల్‌కు!

20 Feb, 2020 04:12 IST|Sakshi

చంద్రబాబు మాజీ పీఎస్‌ ఇంట్లో లభ్యమైన డాక్యుమెంట్లలో కాంగ్రెస్‌ అగ్రనేత పేరు

సోనియా ఆంతరంగికుడికి రూ.400 కోట్లకుపైగా సమకూర్చినట్లు గుర్తించిన ఐటీ శాఖ

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇంధనం అదే

14న విచారణకు అహ్మద్‌ పటేల్‌ గైర్హాజరు.. 18న మరోసారి ఐటీ నోటీసులు జారీ

సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు ఖజానాను కాంట్రాక్టర్లకు దోచిపెట్టి వసూలు చేసిన కమీషన్లలో కొంత భాగాన్ని ఇతర రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధిష్టానానికి ఇం‘ధనం’గా సమకూర్చారని ‘సాక్షి’ గతంలో వెల్లడించిన అంశాలు అక్షర సత్యమని ఆదాయపు పన్నుశాఖ తాజాగా నిర్వహించిన దాడుల్లో వెల్లడైంది. చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో లభ్యమైన డాక్యుమెంట్లలో వెల్లడైన అంశాల ఆధారంగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఆంతరంగికుడు అహ్మద్‌ పటేల్‌కు రూ.400 కోట్లకుపైగా నల్లధనాన్ని హవాలా మార్గంలో చేరవేసినట్లు ఐటీ శాఖ గుర్తించింది.

దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఈనెల 11న అహ్మద్‌ పటేల్‌కు నోటీసులు జారీ చేసిన ఐటీ అధికారులు 14వతేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే తన ఆరోగ్యం బాగాలేదని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానంటూ విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్నారు. దీంతో అహ్మద్‌పటేల్‌కు ఈనెల 18న ఐటీ శాఖ మరోసారి నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లోగా తమ ఎదుట విచారణకు హాజరై రూ.400 కోట్లకు లెక్కలు చెప్పాలంటూ స్పష్టం చేయడం సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంపై ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌), ఎస్‌ఎఫ్‌ఐవో(సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌) రంగంలోకి దిగాయి. 

పారని పథకం..
చంద్రబాబు అధికారంలో ఉండగా సాగునీటి ప్రాజెక్టుల నుంచి పేదల ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల వరకు అన్నిట్లో అంచనా వ్యయాలను పెంచేసి కమీషన్లు చెల్లించే కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. ఎన్నికల్లో ఓటమిని పసిగట్టిన చంద్రబాబు అక్రమాల నుంచి రక్షణ పొందేందుకు కాంగ్రెస్‌ పంచన చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల శాసన సభలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఎన్నికల నిధులు సమకూర్చారు. అయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ కనుమరుగు కావడం, రాష్ట్రంలో టీడీపీ ఘోర పరాజయంతో చంద్రబాబు ఎత్తులు చిత్తయ్యాయి.

హవాలా రాకెట్‌కు బాబే నేతృత్వం!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్రాలుగా పనిచేస్తున్న కొన్ని కాంట్రాక్టు సంస్థల లావాదేవీలపై డేగ కన్ను వేసిన ఐటీ శాఖ చంద్రబాబు హవాలా రాకెట్‌కు నేతృత్వం వహిస్తున్నట్లు అనుమానించింది. గతేడాది నవంబర్‌ మొదటి వారంలో ఢిల్లీ, ముంబై, ఈరోడ్, పుణే, ఆగ్రా, గోవాలలో భారీ మౌలిక సదుపాయాల సంస్థల (కాంట్రాక్టు సంస్థలు) కార్యాలయాల్లో 42 చోట్ల ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. బోగస్‌ బిల్లుల ద్వారా రూ.3,300 కోట్లకుపైగా కమీషన్లు  చేతులు మారినట్లు గుర్తించింది. ఓ కాంట్రాక్టు సంస్థ నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రముఖుడికి రూ.150 కోట్లకుపైగా ముడుపులు ముట్టాయనేందుకు పక్కాగా ఆధారాలు సేకరించినట్లు గత నవంబర్‌ 11న కేంద్ర ప్రత్యక్ష పెట్టుబడుల మండలి(సీబీడీటీ) అధికార ప్రతినిధి సురభి అహ్లూవాలియా ప్రకటించారు. 

అధిక ధరలకు ప్రతిఫలంగానే!
తాత్కాలిక సచివాలయం, పట్టణ పేదల గృహ నిర్మాణం, భూగర్భ డ్రైనేజీ పనులను నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు షాపూర్‌జీ పల్లోంజీకి కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా ‘ఆంధ్ర ప్రముఖుడు’ రూ.150 కోట్లకుపైగా ముడుపులు అందుకున్నట్లు నిర్థారణకు వచ్చిన ఐటీ శాఖ చంద్రబాబు కమీషన్ల బాగోతంలో ఇది మచ్చుకు మాత్రమేనని తేల్చింది. షాపూర్‌జీ పల్లోంజీ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఈనెల 6 నుంచి 10 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో మూడు కాంట్రాక్టు సంస్థల్లో ఐటీ శాఖ సోదాలు జరిపింది. చంద్రబాబు కమీషన్ల బాగోతంలో స్వల్ప భాగం రూ.రెండు వేల కోట్లకుపైగా అవినీతి వ్యవహారాలను బట్టబయలు చేసింది. చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి చెందిన ఆర్కే ఇన్‌ఫ్రా, లోకేశ్‌ సన్నిహితులు కిలారు రాజేష్, నరేన్‌ చౌదరి(డీఎన్‌సీ ఇన్‌ఫ్రా), మాజీ మంత్రి ప్రత్తిపాటి తనయుడు శరత్‌(అవెక్సా ఇన్‌ఫ్రా) నివాసాలు, కార్యాలయాల్లో వేలాది డాక్యుమెంట్లు, 16కిపైగా బ్యాంకు లాకర్లను స్వాధీనం చేసుకుంది.

తీవ్ర ఆర్థిక నేరంగా పరిగణన..
చంద్రబాబు నిర్వహించిన హవాలా రాకెట్‌ను తీవ్ర ఆర్థిక నేరంగా పరిగణిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐవో దీనిపై సమగ్ర దర్యాప్తునకు సిద్ధమైంది. ఐటీకి సమాంతరంగా విచారించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐవో డైరెక్టర్‌ అమర్‌దీప్‌సింగ్‌ భాటియా నిర్ణయించారు. ఈ బృందాలు రెండు రోజుల్లో రంగంలోకి దిగే అవకాశం ఉందని సమాచారం. నల్లధనాన్ని హవాలా మార్గంలో విదేశీలకు చేరవేసి అక్కడి నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో కాంట్రాక్టు సంస్థల్లోకి రప్పించి దారి మళ్లించడాన్ని బట్టి మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చిన ఈడీ విభాగం అధికారులు ఐటీ శాఖ నుంచి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించారు. వీటి ఆధారంగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలని నిర్ణయించారు.  

మాజీ పీఎస్‌ నుంచి కీలక ఆధారాలు..
చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ వద్ద స్వాధీనం చేసుకున్న వేలాది డాక్యుమెంట్లు, డైరీలు, వ్యక్తిగత పుస్తకంలో భారీ అక్రమ నగదు లావాదేవీలను ఐటీ శాఖ గుర్తించింది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌కు రూ.400 కోట్లకుపైగా ఓ కాంట్రాక్టర్‌ సాయంతో హవాలా మార్గంలో చేర్చారనేందుకు కీలక ఆధారాలు లభ్యమైనట్లు ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. వీటి ఆధారంగానే అహ్మద్‌ పటేల్‌కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. శ్రీనివాస్‌ నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లలోనే రూ.వేల కోట్ల నల్లధనాన్ని హవాలా మార్గంలో చంద్రబాబు తరలించినట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఇక చంద్రబాబు మిగతా సన్నిహితుల నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల పరిశీలన పూర్తయితే పెద్ద ఎత్తున నల్లధనం వెలుగుచూసే అవకాశం ఉందని, ఇందులో అధిక శాతం కాంగ్రెస్‌ అధిష్టానానికి చేరి ఉంటుందని ఐటీ శాఖ అనుమానిస్తోంది. ఆ దిశగా విచారణను వేగవంతం చేసింది.

మరిన్ని వార్తలు