ఎయిడెడ్‌

19 Jan, 2019 08:20 IST|Sakshi
పట్టణంలోని ఆర్‌సీఎం స్కూల్‌

జిల్లాలో 78 స్కూళ్లలో 6,940 మంది చదువులు గాలికి

నిధుల కేటాయింపుల్లో ఈ ఏడాదికి ఇవ్వలేదు...: పీవో 

ఎయిడెడ్‌ పాఠశాలలపై ప్రభుత్వం కత్తి కట్టిందా...! అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏటా ఈ పాఠశాలలకు విడుదల చేసే గ్రాంట్స్‌ విషయంలో ఈ ఏడాది కేటాయింపుల్లో వీటికి మొండి చేయి చూపింది. ఫలితంగా అందులో పని చేస్తున్న ఉపాధ్యాయులే ఏం కావాలన్నా ఖర్చు చేయాల్సి ఉంది. ఇప్పటికే జిల్లాలో వీటి సంఖ్య 104 నుంచి 78కి పడిపోయింది. ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తే భవిష్యత్‌లో మరిన్ని పాఠశాలలు మూతపడడం ఖాయమని ఉపాధ్యాయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

విజయనగరం అర్బన్‌: ప్రతిష్టాత్మక విద్యా బోధనలు అందించిన చరిత్ర గల ద్రవ్య సహాయ పాఠశాల (ఎయిడెడ్‌)పై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కొనసాగిస్తుంది. ఇప్పటికే ఉపాధ్యాయుల కొరత, మౌలిక సదుపాయాల లేమి తదితర సమస్యలతో అవసాన దశలో ఉన్న ఎయిడెడ్‌ స్కూళ్లపై ఆర్థికంగా దెబ్బతీసే చర్యలు తాజాగా చేపడుతుంది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఇతర యాజమాన్యాల పాఠశాలలతో పాటు ఎయిడెడ్‌ పాఠశాలలకు స్కూల్‌ గ్రాంట్స్, టీచర్‌ గ్రాంట్స్‌ పేరుతో బోధన తరగతులకు ప్రతి ఏడాది నిధులు మంజూరు చేసేవారు. తాజాగా నడుస్తున్న విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌లో ఈ స్కూళ్లకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. దీంతో ఎయిడెడ్‌ పాఠశాలలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది.  నిరక్షరాస్యత నిర్మూలన, విద్యాభివృద్ధి పేరుతో కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తున్నా వీటి మనుగడకు మాత్రం కేటాయించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

జిల్లాలో ఎయిడెడ్‌ పాఠశాలలు గత ఏడాది వరకు 104 ఉండేవి. 2003లో ఉపాధ్యాయ నియామకాల నిషేధం విధించిన తరువాత ఏర్పడిన ఉపాధ్యాయుల కొరత కారణంగా పలు పాఠశాలలను మూసేసారు. దీంతో తాజాగా 78 స్కూళ్లు మాత్రమే జిల్లాలో ఉన్నాయి. ఆయా స్కూళ్లలో 6,940 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వీటికి  ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల మాదిరిగానే చాక్‌పీసులకు, రిజస్టర్ల్‌ మేనేజ్‌ చేయడానికి, విద్యా బోధనల ఎయిడ్స్‌ తదితర అవసరాల కోసం స్కూల్‌ గ్రాంట్స్, టీచర్‌ గ్రాంట్స్‌ పేరుతో  ప్రాథమిక పాఠశాలకు రూ.5 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.7 వేలు, ఉన్నత పాఠశాలలకు రూ.10 వేలు వంతున ప్రతి ఏడాది ఆయా స్కూళ్లకు నిధులను సర్వశిక్షాభియాన్‌ నేరుగా వేసేవాళ్లు.  ఈ ఏడాది తాజాగా విడుదల చేసిన వార్షిక బడ్జెట్‌ నిధులలో  ఎయిడెడ్‌ స్కూళ్లకు కేటాయించలేదు. దీంతో ఆయా పాఠశాలల్లో బోధన సామగ్రికి యాజమాన్యాలుగాని, ఉపాధ్యాయులుగాని వెచ్చించుకోవాల్సి ఉంది. యాజమాన్యాలకు ప్రతి ఏడాది ఇవ్వాల్సిన స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ గ్రాంట్స్‌ కూడా  సకాలంలో ఇవ్వడం లేదని యాజమాన్యాలు వాపోతున్నాయి. స్కూళ్లల్లో ఉన్న ఉపాధ్యాయుల సంఖ్య ఆధారంగా ఆ నిధులు మంజూరు చేస్తారు. అయితే 15 ఏళ్లగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల అన్ని స్కూళ్లలోనూ ఉపాధ్యాయ పోస్టులు భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం పని చేస్తున్న ఉపాధ్యాయుల వేతనంలోని కొంత శాతం మాత్రమే స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ గ్రాంట్స్‌ వస్తాయి. ఉపాధ్యాయుల తక్కువున్న నేపథ్యంలో ఆ నిధులు ఏ ఒక్క పాఠశాలకు సరిపోవడం లేదు.  æ దీంతో ఎయిడెడ్‌ స్కూళ్ల పరిస్థితి దయనీయంగా ఉంది.  

ఈ ఏడాదికి నిధులివ్వలేదు...
ఎయిడెడ్‌ పాఠశాలలకు ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ పాఠశాల మాదిరిగానే  స్కూల్‌ గ్రాంట్స్‌ ప్రతి ఏడాది వస్తాయి. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన సమగ్ర సర్వశిక్షాభియాన్‌ పథకం ద్వారా నిధుల కేటాయింపులు జరిగాయి.  ఈ కేటాయింపుల్లో ఎయిడెడ్‌ కేటగిరి పాఠశాలలు లేవు. దీంతో వాటికి నిధులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.–డాక్టర్‌ బి.శ్రీనివాసరావు, పీ.ఓ, ఎస్‌ఎస్‌ఏ    

నాణ్యమైన బోధనలు సాధ్యం కాదు
పాఠశాలలో ఐదు తరగతులలో 45 మంది విద్యార్థులున్నారు. ఒక్కడినే ఉపాధ్యాయుడుని. ఇప్పటికే ఉపాధ్యాయుని కొరత వల్ల అన్ని తరగతులకు బోధనలు అందించడం కష్టంగా ఉంది.  స్కూల్‌ గ్రాంట్స్‌ ఇవ్వకపోతే  పాఠశాలల్లో నాణ్యమైన బోధన అందించడం సాధ్యం కాదు. బోధనా సామగ్రి తప్పనిసరి. కనీసం చాక్‌పీసులు, విద్యుత్‌ బిల్లులు తదితర  సౌకర్యాల కోసం నిధులు అవసరం ఉంది. ఇప్పటికే ఉపాధ్యాయుల కొరత కారణంగా బోధనలు సంపూర్ణంగా ఇవ్వలేకపోతున్నాం. నిధులు ఇవ్వకపోతే బోధనలు భారంగా మారుతాయి.–ఎస్‌.వీ.సత్యం, æసింగిల్‌ టీచర్, ఆర్‌సీఎం ఎయిడెడ్‌ ప్రాధమిక పాఠశాల, కొత్తవలస, సాలూరు మండలం

మరిన్ని వార్తలు