ఆ అధికారికి ఎయిడ్స్‌ బాధితులంటే వివక్ష!

7 Jun, 2018 12:15 IST|Sakshi

ఎయిడ్స్‌ నియంత్రణాధికారిపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

విచారణ చేసిన డీఎంహెచ్‌ఓ

కర్నూలు(హాస్పిటల్‌): హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ బాధితుల పట్ల జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణాధికారి డాక్టర్‌ దేవసాగర్‌ వివక్ష చూపుతున్నారని మానవ హక్కుల కమిషన్, ప్రిన్సిపల్‌ సెక్రటరీలకు నేస్తం పాజిటివ్‌ నెట్‌వర్క్‌ అధ్యక్షురాలు బి. సుధారాణి గత నెలలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మానవ హక్కుల కమిషన్‌ నుంచి వచ్చిన నోటీసుల మేరకు బుధవారం డాక్టర్‌ దేవసాగర్, సుధారాణిలను డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ జేవీవీఆర్‌కే ప్రసాద్‌ విచారణ చేశారు. 

గత నెల 10వ తేదీన  ‘ఇంటర్నేషనల్‌ క్యాండిల్‌ మెమోరియల్‌ డే’ కార్యక్రమానికి డాక్టర్‌ దేవసాగర్‌ను ఆహ్వానించడానికి వెళితే  ‘టీబీతో కూడిన హెచ్‌ఐవీ బాధితులను కాకుండా హెచ్‌ఐవీ ఉన్న వారిని మాత్రమే పిలవాలి.  వారిని కూడా తనకు దూరంగా ఉంచాలని’ దేవసాగర్‌ చెప్పారని సుధారాణి ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కూడా ఆయన కార్యాలయంలోకి రానిచ్చేవారు కాదని, దూరంగా ఉండి మాట్లాడాలని చెప్పేవారని ఆరోపించారు. జాతీయ స్థాయిలో వివక్ష ఉండకూడదని అనేక కార్యక్రమాలు తమ సంస్థ చేస్తుంటే జిల్లా అధికారే ఇలా వ్యవహరించడం బాధ కలిగించిందని ఆమె లేఖలో పేర్కొన్నారు.

ఈ విషయమై డాక్టర్‌ దేవసాగర్‌ వివరణ ఇస్తూ తాను ఏనాడూ హెచ్‌ఐవీ బాధితుల పట్ల వివక్ష చూపలేదని, క్యాండిల్‌ లైట్‌ ప్రోగ్రామ్‌కు కూడా ఓపెన్‌ ప్లేస్‌లో నిర్వహించాలని చెప్పాను తప్ప దూరంగా ఉంచాలని అనలేదని వివరణ ఇచ్చుకున్నారు. దీనిపై  డీఎంహెచ్‌ఓ  మాట్లాడుతూ  ఇలాంటి వివక్ష మళ్లీ పునరావృతం కాకూడదని, ఇకపై ఇద్దరూ కలిసి పనిచేసుకోవాలని చెప్పి పంపించారు. 

మరిన్ని వార్తలు