క్షణకాల కాంక్ష.. పిల్లలకు జీవితశిక్ష

1 Sep, 2018 11:16 IST|Sakshi
మదనపల్లె ప్రభుత్వాస్పత్రిలోని ఏఆర్‌టీ కార్యాలయం

అనాథలవుతున్న ‘నయంకాని వ్యాధి’ బాధితుల పిల్లలు

బంధువుల ఆదరణా కరువు

పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లి వ్యాధి బారిన పడుతున్న వారే ఎక్కువ!

పునరావాస చర్యలు చేపట్టని ప్రభుత్వం

తంబళ్లపల్లెకు చెందిన ఓ మహిళ తిరుపతిలో కూలి పనులు చేసుకొంటున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. కొన్ని రోజులకే భార్యాభర్తలిద్దరూ స్వగ్రామం వచ్చేశారు. ఈ క్రమంలోనే ఉపాధి కోసం భర్త కోరిక మేరకు ఆమె కువైట్‌ వెళ్లి వచ్చింది. తిరిగొచ్చిన అనంతరం మళ్లీ కేరళకు భర్తతో కలిసి కూలి పనులకు వెళ్లింది. నాలుగు నెలల కిత్రం నయంకాని వ్యాధితో మంచానికే పరిమితమైంది. భర్త ఆమెను వదిలేసి తిరుపతి వెళ్లిపోయాడు. ఎముకల గూడుగా మారిన ఆ మహిళను రెండు నెలల క్రితం రాత్రిపూట ఆటోలో తీసుకొచ్చి బంధువులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయారు. ఇరవై రోజులు మృత్యువుతో పోరాడి మహిళ కన్నుమూసింది. ఈమెకు ఒక కుమార్తె.

మదనపల్లె కొత్త ఇండ్లకు చెందిన ఓ మహిళ ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లింది. కొన్ని సంవత్సరాల అనంతరం స్వగ్రామానికి తిరిగి వ చ్చింది. ఈ నేపథ్యంలో నెల్లూరు నుంచి గ్రామానికి వచ్చి మేస్త్రి పని చేసుకొంటున్న ఓ వ్యక్తితో స్థానికులు ఆదర్శ వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రభుత్వం మంజూరు చేసిన పక్కాగృహాన్ని నిర్మించుకొన్నారు. ఇంతలో నయం కాని వ్యాధి ఇద్దరినీ కబళించింది. తల్లిదండ్రులు చనిపోవడంతో ఆ పిల్లలు అనాథలయ్యారు. ప్రస్తుతం వారు ఏమయ్యారో కూడా చెప్పేవారు లేరు.

వాల్మీకిపురంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ భర్త వదిలేయడంతో ఉపాధి కోసం పూణే వెళ్లింది. ఆమెకు ఓ కుమారుడు. పూణె నుంచి స్వగ్రామానికి తరచూ వస్తూ బిడ్డను చూసుకునేది. ఈ క్రమంలోనే నయంకాని వ్యాధిబారిన పడడంతో మహిళ కన్నుమూసింది. కుమారునికీ వ్యాధి సోకడంతో తండ్రి పట్టించుకోలేదు. నానమ్మ సహకారంతో ప్రస్తుతం ఆ బాలుడు ఇంటర్‌ చదువుతున్నాడు. ఆమె కూడా ప్రస్తుతం నడవలేని స్థితికి చేరింది. దీంతో చదువు అర్ధంతరంగా ఆగిపోతుందని, దాతలు ఆదుకుని ఆర్థిక సాయం అందించాలని ఆ విద్యార్థి వేడుకుంటున్నాడు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు వందల సంఖ్యలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు దుర్భర జీవితాలను వెళ్లదీస్తున్నారు. తల్లిదండ్రులు తెలిసో తెలియకో చేసిన తప్పులకు జీవితాంతం శిక్షకు గురవుతున్నారు.

చిత్తూరు ,మదనపల్లె టౌన్‌: కరువు కోరల్లో చిక్కుకుని కొందరు, విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఇంకొందరు, ఉపాధి లేక మరికొందరు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాని నిరుద్యోగ యువతులు, మహిళలు అధికంగా వేశ్య వృత్తిని ఎంచుకుని వ్యభిచార ఊబిలో కూరుకుపోతున్నారు. డబ్బుమీద వ్యామోహంతో రెడ్‌లైట్‌ ఏరియాలైన ముంబయి, పూణె, ఢిల్లీ, కలకత్తా, బెంగళూర్, సింగపూర్‌ తదితర ప్రాంతాలకు వెళ్లి హెచ్‌ఐవీ బారిన పడి జీవితాలను నరకప్రాయం చేసుకుని రక్త సంబంధీకులకు దూరమవుతున్నారు. పబ్బులు, వేశ్య గృహాలకు వెళ్లి నయంకాని వ్యాధిబారిన పడుతున్నారని కొన్ని సంస్థల సర్వేలు చెబుతున్నాయి. అలా వ్యాధుల బారిన పడుతున్న వారు అధికంగా మదనపల్లెతో పాటు, పడమట మండలాలైన పీటీఎం, బి. కొత్తకోట, ములకలచెరువు, తంబళ్లపల్లె, పెద్దమండ్యంలలో గత ఐదేళ్లలో 23 వేల మందికి పైగా బాధితులు ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య ఏడు వేలకుపైనే ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి.

అనాథలవుతున్న పిల్లలు..
అలా చనిపోయిన వారి అయినవారి ఆదరణకు దూరమై అనాథలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు తెలిసో తెలియకో చేసిన తప్పులకు వీరికి జీవిత కాల శిక్ష పడుతోంది. రక్తసంబంధీకులు కూడా అక్కున చేర్చుకోవడానికి నిరాకరిస్తున్నారు. 

కానరాని ప్రభుత్వ చర్యలు..
గతంలో ప్రభుత్వాలు డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఉపాధికోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే మహిళలు, యువతులను గుర్తించి పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంది. అప్పట్లో ఒక్కొక్కరికీ రూ. 1000 కూడా అందించేవారు. దీంతో ఎంతో కొంత వారికి భరోసా లభించేది. ప్రస్తుత ప్రభుత్వం ఇలాంటి చర్యలేవీ చేపట్టడం లేదు. పునరావాస చర్యలు తీసుకుంటే కొంతైనా తగ్గించ వచ్చని పలువురు చెబుతున్నారు.

ఆదరించని కుటుంబసభ్యులు..
వ్యాధి నిరోధక శక్తిని కోల్పోయి బాధపడుతున్న మహిళలు, పురుషులు కుటుంబసభ్యుల నిరాదరణకు గురవుతున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువై మంచం పట్టిన బాధితులను  పట్టిం చుకోవడం లేదు. పైగా వారే అర్ధరాత్రి సమయాల్లో తీసుకొచ్చి మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో వదలి వెళుతున్నారు. వారిని సిబ్బంది క్రానిక్‌ వార్డులో చేర్చి చికిత్సలు అందిం చినా ఫలితం లేక చేరిన నెల రోజుల్లోపే చనిపోతున్నారు. చనిపోయిన మృతదేహాన్ని కూడా కుటుంబసభ్యులు తీసుకెళ్లని పరిస్థితి. దీంతో కుళ్లి దుర్వాసన వస్తున్న మృతదేహాలను ఆస్పత్రి సిబ్బంది పోలీసుల సహకారంతో మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు అప్పగిస్తున్నారు. వారు ఆ మృతదేహాలను పట్టణానికి దూరంగా తీసుకెళ్లి వాగుల్లో పాతిపెట్టి వస్తున్నారు.

మరిన్ని వార్తలు