మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయం

11 Jul, 2014 02:44 IST|Sakshi
మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయం

 సర్వజనాస్పత్రిలో రోగుల సంరక్షకులకు అటెండర్ పాస్‌లు అందజేసిన వైద్యులు
 అనంతపురం అర్బన్: రోగులకు మెరుగైన వైద్య సేవలందించడమే తమ ధ్యేయమని, అందులో భాగంగానే పాస్‌లు అందజేస్తున్నామని స్థానిక జిల్లా ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావు, ఆర్‌ఎంఓ డాక్టర్ కన్నేగంటి భాస్కర్ స్పష్టం చేశారు. ఆస్పత్రిలో ప్రయోగాత్మకంగా లేబర్, ఎమర్జెన్సీ వార్డుల్లో అటెండర్ పాస్‌లు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా లేబర్ వార్డులో గురువారం రోగుల సంరక్షకులైన బంధువులకు పాస్‌లను అందజేశారు.
 
 ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వార్డులలో ఎవరూ ఇష్టారాజ్యంగా ప్రవేశించరాదన్నారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం, రోగులకు ఇన్‌ఫెక్షన్ సోకకుండా, దొంగతనాలకు ఆస్కారం లేకుండా అటెండర్ పాస్‌లను ప్రవేశ పెట్టామన్నారు. వార్డులలోకి గుంపులుగా జనం రావడం వల్ల రోగులు ఇన్‌ఫెక్షన్స్‌కు గురయ్యే పరిస్థితి ఉందన్నారు. తద్వారా రోగి త్వరగా కోలుకునేందుకు వీల్లేకుండా పోతుందన్నారు. వార్డుల్లో చిన్న పిల్లలు అపహరణకు, ఆస్పత్రిలోని వస్తువులు చోరీకి గురికాకుండా ఉండేందుకు, ఇతర వ్యక్తులు లోపలకు రాకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు పాస్‌లు ఉపయోగపడతాయన్నారు. ఆస్పత్రిలోని సెక్యూరిటీ సిబ్బందికి  జిల్లా ప్రజలు సహకరించాలని వారు కోరారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు రోగులకు టిఫిన్ కోసం, మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు భోజనం, సాయంత్ర 4 నుంచి 5 వరకు విజిటింగ్ అవర్స్ ఉంటాయన్నారు. ఈ సమయాల్లోనే రోగుల బంధువుల వార్డులలోకి రావాలన్నారు. నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు