మంగళగిరి ఎయిమ్స్‌కి గ్రీన్‌సిగ్నల్

8 Oct, 2015 01:58 IST|Sakshi
మంగళగిరి ఎయిమ్స్‌కి గ్రీన్‌సిగ్నల్

విజయవాడ బ్యూరో : మంగళగిరి ఎయిమ్స్‌కు సంబంధించి మరో ముందడుగు పడింది. ఎయిమ్స్ నిర్మాణ పనులకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని నాగ్‌పూర్, కల్యాణి ప్రాంతాలతో పాటు మన రాష్ట్రంలోని మంగళగిరిలో నిర్మించే ఎయిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం 2015-16 వార్షిక బడ్జెట్‌లో రూ.1618 కోట్లు కేటాయించే వీలుందని సూత్రప్రాయంగా తెలిపింది.

 ఫలించిన ఎదురుచూపులు...
 రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ సమయంలో కేంద్రం ఇచ్చిన హామీల్లో భాగంగా మంగళగిరిలోని పాత టీబీ శానిటోరియం స్థలంలో అన్ని సదుపాయాలతో కూడిన ఎయిమ్స్‌ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు తయారుచేసి కేంద్రానికి పంపింది. కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ 2014 డిసెంబర్‌లో గుంటూరు జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి టీబీ శానిటోరియం స్థలాన్ని పరిశీలించింది. ప్రభుత్వం కేటాయించిన 193 ఎకరాల విస్తీర్ణంలో 960 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, మెడి కల్ కళాశాల, పరిపాలనా భవనాలను నిర్మించాలని ప్రతిపాదనలు రూపొందించింది. మే 14న పనులు ప్రారంభించేందుకు శంకుస్థాపన ముహూర్తం కూడా ఖరారైంది. అయితే చివరి క్షణంలో శంకుస్థాపన వాయిదా పడింది.

ఇక్కడున్న స్థలం సరిపోదన్న వాదనలు బయటకు రావడంతో పక్కనే ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌ఐడీ సంస్థలకు కేటాయించిన మరో 50 ఎకరాలను కూడా ఎయిమ్స్‌కు కేటాయించారు. ఆ తరువాత కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి. ఇటీవల కాలంలో కేంద్ర మంత్రి సుజనాచౌదరి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రివర్గం నుంచి ఆమోదం లభించగానే ఎయిమ్స్ పనులు ప్రారంభమవుతాయన్నారు. బుధవారం ఈ మేరకు కేబినెట్ నుంచి ఆమోదం లభించింది. అన్నీ సవ్యంగా జరిగితే నవంబరు 14 లోపే నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగవచ్చని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
 
 

మరిన్ని వార్తలు