మిస్టరీగా ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి మరణం

29 Jun, 2016 01:08 IST|Sakshi

సూరత్ నుంచి విశాఖకు మృతదేహం
దర్యాప్తులో కారణాలు తెలుస్తాయంటున్న అధికారులు
రోదిస్తున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు

 

గోపాలపట్నం : సెలవులు పూర్తి చేసుకుని తిరిగి విధులకు హాజరవుతున్న తరుణంలో ఏం జరిగిందో ఏమో... ఆ ఉద్యోగి రైలు ప్రమాద సంఘటనలో మరణించాడు. చిన్నవయసులోనే  కుటుంబానికి పెద్దదిక్కుగా మారిన ఆ యువకుడు ఇప్పుడు అందని లోకాలకు వెళ్లిపోయి అందరినీ శోకసంద్రంలో ముంచేశాడు. గోపాలపట్నం చంద్రనగర్‌కి చెందిన వీర్ల విశ్వనాథ్(28) ఇండియన్ ఎయిర్‌ఫోర్సులో నాన్ కమిషన్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు.

 
జూన్2న తల్లిదండ్రులను చూడడానికి  సెలవుపై చంద్రనగర్ వచ్చాడు. తిరిగి గత శనివారం ఇంటి నుంచి సూరత్ బయల్దేరి వెళ్లాడు. ఆదివారం సాయంత్రం సూరత్‌కి 20 కిలోమీటర్ల దూరం ఉందనగా ఏం జరిగిందో ఏమో... విశ్వనాథ్ మరణించాడన్న చేదు కబురు ఇంటికి చేరింది. మంగళవారం విశ్వనాథ్ మృతదేహాన్ని సూరత్ నుంచి ఎయిర్‌ఫోర్సు అధికారులు విశాఖ విమానాశ్రయానికి తీసుకు వచ్చారు. వారెంట్ అధికారి ఆర్.సింగ్‌తో సహా అధికారులు గౌరవ వందనం చేశారు. విమానాశ్రయం నుంచి చంద్రనగర్‌కి మృతదేహాన్ని వ్యానులో ఊరేగింపుగా తీసుకొచ్చారు.

 
పెద్ద దిక్కయి... పరలోకాలకు...

చంద్రనగర్‌కు చెందిన చక్రరావు, వెంకటలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక్క కొడుకు విశ్వనాథ్. చక్రరావు చాలాకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ తరుణంలో విశ్వనాథ్ ఇంటికి పెద్దదిక్కయ్యాడు. పంతొమ్మిదో ఏటే ఇండియన్ ఎయిర్‌ఫోర్సులో ఉద్యోగం సంపాదించాడు. అక్క స్వాతి పెళ్లి జరిపించాడు. ఇంటి బాధ్యతలు భుజానికెత్తుకున్న తరుణంలో విశ్వనాథ్ మరణించాడన్న నిజాన్ని తల్లిదండ్రలు జీర్ణించుకోలేక గుండెలు బాదుకుని విలపిస్తున్నారు. తల్లి వెంకటలక్ష్మి, అక్క స్వాతి, చెల్లి శ్రావణి రాజ్యలక్ష్మి విలపిస్తున్న తీరు చూపరులను కలచివేస్తోంది. ఇక్కడి చంద్రనగర్ శ్మశానవాటికలో  విశ్వనాథ్ భౌతికకాయానికి తండ్రి చక్రరావు అంత్యక్రియలు జరిపారు. స్థానికులతోపాటు పరిసర గ్రామాల ప్రజలు తరలివచ్చి నివాళులర్పించారు.

 
మిస్టరీగా విశ్వనాథ్ మరణం

విశ్వనాథ్ ఎలా మరణించాడో ఎయిర్‌ఫోర్సు అధికారులు తెలియజేయడం లేదు. రైలు ప్రమాదంలో మరణించినట్లు సమాచారం ఉందని... ఇది ఎలా జరిగిందో దర్యాప్తు జరగాల్సి ఉందని మృతదేహాన్ని తీసుకొచ్చిన అధికారులు తల్లిదండ్రులకు తెలియజేశారు. చివరి నిమిషంలో తల్లిదండ్రుల కోరిక పై విశ్వనాథ్ ముఖాన్ని అధికారులు చూపించినా ఫొటోలు తీసేందుకు అనుమతించలేదు. దీన్నో మిస్టరీగా బంధుమిత్రులు, స్థానికులు చర్చించుకుంటున్నారు.

 

 

మరిన్ని వార్తలు