అక్టోబరు 27 నుండి ఢిల్లీ సాయంత్రం సర్వీస్‌ పున:ప్రారంభం

18 Aug, 2019 20:53 IST|Sakshi

సాక్షి, గన్నవరం : రెండు నెలల క్రితం రద్దు అయిన ఎయిరిండియాకు చెందిన న్యూఢిల్లీ–హైదరాబాద్‌–విజయవాడ విమాన సర్వీస్‌ అక్టోబరు 27 నుండి పునఃప్రారంభం కానుంది. ఈ మేరకు ఎయిరిండియా వైబ్‌సైట్‌లో అధికారికంగా ప్రకటించడంతో పాటు ప్రయాణికుల టిక్కెట్‌ బుకింగ్‌ను కూడా ప్రారంభించింది. ఎయిరిండియా సంస్ధ 2011లో ఢిల్లీ నుండి హైదరాబాద్‌ మీదుగా ఇక్కడికి సాయంత్రం రాకపోకలు సాగించే విధంగా ఈ సర్వీస్‌ను ప్రారంభించింది. ప్రయాణికుల ఆదరణ పెరగడంతో అనంతరం ఢిల్లీ–విజయవాడ మధ్య ఉదయం, రాత్రి వేళల్లో అదనంగా రెండు డైరెక్ట్‌ విమాన సర్వీస్‌లను నడుపుతుంది. 

అయితే గత జూన్‌లో అనివార్య కారణాలు వల్ల సాయంత్రం సర్వీస్‌ను ఎయిరిండియా రద్దు చేసింది. దీనివల్ల ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రితో పాటు ఎయిరిండియా సంస్ధ దృష్టికి తీసుకెళ్లి సర్వీస్‌ను పునరుద్దరించాలని కోరారు. దీనితో స్పందించిన ఎయిరిండియా రద్దు అయిన సాయంత్రం సర్వీస్‌ను ఆక్టోబరు 27 నుండి తిరిగి ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది.
 
విమాన ప్రయాణ షెడ్యూల్
అక్టోబరు 27 నుండి ఎయిర్‌బస్‌ ఎ320 విమానం ఢిల్లీలో మధ్యాహ్నం 1.05కు బయలుదేరి సాయంత్రం 3.15కు హైదరాబాద్‌ చేరుకుని 35 నిమిషాల విరామం తర్వాత బయలుదేరి 4.55కు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. తిరిగి ఇక్కడి నుండి సాయంత్రం 5.30కు విమానం బయలుదేరి 6.25కు హైదరాబాద్‌ చేరకుని 40 నిమిషాల విరామం తర్వాత 7.05కు బయలుదేరి రాత్రి 9.25కు న్యూఢిల్లీకి చేరుకుంటుందని ఎయిరిండియా ప్రతినిధులు తెలిపారు. త్వరలో ఎయిరిండియా అనుబంధ సంస్ధ అలయెన్స్‌ ఎయిర్‌కు చెందిన వైజాగ్‌–విజయవాడ విమాన సర్వీస్‌ను కూడా పునఃప్రారంభించనున్నట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు