ఇటుక వెనుక కిటుకు

2 Jun, 2018 11:02 IST|Sakshi
తహసీల్దార్‌ ఆదేశించిన తర్వాత కూడా ఇటుకలు కాల్చుతున్న బట్టీలు

కాలుష్యం వెదజల్లుతున్నఇటుక బట్టీ

కాపాడాలని వేడుకుంటున్న పెరుమాళ్లపల్లి వాసులు

ల్యాండ్‌ కన్వర్షన్‌ చేయకుండానే నడుపుతున్న వైనం

కాసుల మత్తులో రెవెన్యూ అధికారులు

మండల మేజిస్ట్రేట్‌ హోదాలో విచారించిన తహసీల్దార్‌

అయినా చర్యలు శూన్యం

అది అనుమతి లేని బట్టీ: పంచాయతీ కార్యదర్శి

తిరుపతి రూరల్‌ మండలం రెవెన్యూ అధికారులు కోట్ల విలువైన ప్రభుత్వ భూములు, వాగులు, వంకలను అక్రమార్కులకు దోచిపెట్టడంలోనే కాదు...అక్రమార్కులతో బలమైన ఇటుక బంధం సైతం ఏర్పాటు చేసుకుంటున్నారా? ఇళ్ల పక్కనే కాలుష్యం వెదజల్లుతున్న ఇటుక బట్టీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా? అనుమతి లేని బట్టీపై చర్యలకు వెనకడుగు వేస్తున్నారా? కాసుల మత్తులో జోగుతున్న అధికారులు, జిల్లా స్థాయి అధికారుల ఆదేశాలను సైతం తుంగలో తొక్కుతున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు తిరుపతి రూరల్‌ మండల ప్రజలు. అక్రమ ఇటుక బట్టీపై ప్రేమ చూపుతున్న అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు.

తిరుపతి రూరల్‌: తిరుపతి రూరల్‌ మండలం పెరుమాళ్లపల్లి పంచాయతీలో ఏఆర్‌బీ పేరుతో అధికార పార్టీకి చెందిన స్థానిక చోట నాయకుడు ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీ నిర్వహిస్తున్నాడు. బట్టీ ఏర్పాటులో నిబంధనలకు పాతర వేశాడు. ల్యాండ్‌ కన్వర్షన్‌ చేయకుండా వ్యవసాయ భూమిలో ఇటుక బట్టీ నిర్వహించకూడదు. అదీ ఇళ్ల పక్కనే లక్షల సంఖ్యలో ఇటుకలను తయారు చేస్తున్నారు. పెద్ద ఎత్తున బొగ్గు, వరి పొట్టును డంపింగ్‌ చేశారు. ఇళ్ల పక్కనే బట్టీ ఉండకూడదని జీవోలు చెపుతున్నా అధికార అండతో సదరు బట్టీ నిర్వాహకులు చెలరెగిపోతున్నారు.

ఫిర్యాదు చేసిన గ్రామస్తులు..
ఏఆర్‌బీ ఇటుక బట్టీ కోసం భారీ ఎత్తున డంపింగ్‌ చేసిన బొగ్గు, వరి పొట్టు, బట్టీని కాల్చడం వల్ల వచ్చే కాలుష్యంతో తీవ్ర శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయని పలుమార్లు ఎస్వీనగర్‌ వాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు. జనచైతన్య లేఅవుట్‌లో ఉండేవారు అయితే జన్మభూమి సభల్లోనూ తహసీల్దార్‌తో పాటు అధికారులను నిలదీశారు. కాలుష్యం నుంచి మమ్మల్ని కాపాడాలని వేడుకున్నారు. రెండేళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. పట్టిం చుకోవాల్సిన తహసీల్దార్‌ రాజగోపాల్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కలెక్టర్‌ను కలిసి ఆయనపైన కూడా గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.

కలెక్టర్‌ ఆదేశాలతో కదలిక...
అనుమతి లేకుండా, అక్రమంగా నిర్వహిస్తున్న ఇటుక బట్టీ వల్ల ఇబ్బందులు ఉన్నాయని స్థానికులు ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందిం చడం లేదని కలెక్టర్‌ ప్రద్యుమ్న తహసీల్దార్‌ను నిలదీశారు. దీంతో బట్టీని సందర్శించి, ఇళ్ల పక్కనే ఉన్నట్లు నిర్ధారించారు. ల్యాండ్‌ కన్వర్షన్‌ జరగకుండా దొంగదారిలో బట్టీని కాల్చుతున్నారని నివేదికను సిద్ధం చేశారు. నిబంధనల ప్రకారం లేని బట్టీని ఎందుకు సీజ్‌ చేయకూడదో వివరణ ఇవ్వాలని మండల మెజిస్ట్రేట్‌ హోదాలో నోటీసులు జారీ చేశారు. నాలుగు రోజుల క్రితం ఇరువర్గాలను విచారించారు. అనంతరం బట్టీని క్లోజ్‌ చేయాలని ఆదేశించారు. ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడంతో అక్రమార్కులు విర్రవీగుతున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికా రం మాది....మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు... అంటూ జబ్బలు చరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యం వెదజల్లుతున్న బట్టీని మూసివేయాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు