నిరుపేద గుండెకు ఎయిర్ పోటు

28 Jun, 2015 03:07 IST|Sakshi

పచ్చని కొబ్బరితోటలతో జాతీయ రహదారికి అనుకుని ఎంతో ప్రశాంతంగా ఉండే భోగాపురం ఇప్పుడు తీవ్ర ఆందోళన, ఆవేదన, గుండెలను మెలిపెట్టే బాధతో అల్లాడిపోతోంది. మండలంలో ఎక్కువ మంది సన్నకారు రైతులే. ఎవరికీ 5 ఎకరాలకు మించి లేవు. వీరితో పాటు వృత్తి పనివారు, వ్యవసాయ రంగంపై పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న నిరుపేదలే అధికంగా ఉన్నారు. ఇంతవరకూ సాఫీగా సాగుతున్న వారి బతుకుల్లో  ఎయిర్ పోర్టు పెను తుపాను సృష్టించింది. తమ బతుకులు ఏమవుతాయోనన్న ఆలోచనతో వారంతా భీతి చెందుతున్నారు. బడాబాబులు ఎగిరే ఎయిర్‌పోర్టు కోసం తమ భూములు, ఇళ్లువాకిళ్లు కోల్పోవలసి వస్తోందన్న బాధ వారి గుండెలను బద్దలు చేస్తోంది. ఇదే బాధతో రామచంద్రపేట గ్రామానికి చెందిన ఓ నిరుపేద గుండె ఆగిపోయింది.  
 
 భోగాపురం: కులవృత్తే ఆధారంగా ఆ కుటుంబం జీవిస్తోంది. గ్రామంలో రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలతో పాటు అడపా దడపా   గృహోపకరణాలు తయారు చేస్తూ  వచ్చిన కొద్దిపాటి సొమ్ముతో బతుకుబండి సాగిస్తోంది.   అయితే ఎయిర్‌పోర్టు రూపంలో విధి ఆ కుటుంబంతో ఆడుకుంది. తీరని విషాదాన్ని నింపింది.  మండలంలోని రామచంద్రపేట గ్రామంలో ముక్కాల త్రినాథ్(43) కులవృత్తి అయిన వడ్రంగి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనిపై ఆధారపడి తండ్రి సాంబశివరావు, తల్లి ఈశ్వరమ్మ, భార్య రోహిణి, కుమార్తెలు భారతి, పావనిలతో పాటు మూగవాడైన తమ్ముడు అప్పలరాజు, అతని భార్య ఇద్దరు పిల్లలు జీవనం సాగిస్తున్నారు. ఇంటిల్లిపాదికోసం కొడుకు కష్టపడడాన్ని చూడలేక   తల్లి స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకురాలిగా పనిచేస్తూ చేదోడు వాదోడుగా ఉంటుంది.
 
 ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం మండలంలో ఎంపిక చేసిన పంచాయతీల్లో రామచంద్ర పేట పంచాయతీ కూడా ఉంది.  ఈ గ్రామాన్ని కూడా ఖాళీ చేయాల్సి ఉంటుందని అధికారులు ప్రకటించడంతో  త్రినాథ్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దీనికి తోడు అడపా దడపా సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పర్యటించడం,   సెక్షన్30 అమలు పేరుతో పోలీసులు తమ వాహనాల్లో మైక్‌లతో ప్రచారం చేస్తూ తిరుగుతుండడంతో అతను ఆందోళనకు గురయ్యాడు. ఉన్న ఒక్క ఇల్లు పోతే తన పరిస్థితి ఏంటని ఆవేదనకు గురయ్యాడు. ప్రభుత్వం ఎక్కడో దగ్గర ఇంటి స్థలం అయితే ఇస్తుందని కాని,  తనకు కులవృత్తి తప్ప మరో పనిచేతకాదు.
 
 ఎక్కడో ఇంటి స్థలం ఇస్తే తనకి అక్కడ పనిదొరుకుతుందా...? తన కుటుంబం పరిస్థితి ఏంటి? అని  వేదన పడ్డాడు. తన భార్య వద్ద పలుమార్లు ఆవేదన వ్యక్తం చేయడంతో నలుగురికీ ఎలా జరిగితే మనకీ అలాగే జరుగుతుంది... దిగులు చెంది లాభం లేదు అని సముదాయించేది. అయినా అతని మనసు కుదుట పడలేదు. ఎప్పటిలా శుక్రవారం రాత్రి గ్రామంలో ఉన్న పాన్‌షాపు సమీపంలో గ్రామస్తులంతా సమావేశం అయ్యారు. ఎయిర్ పోర్టు వస్తే మన పరిస్థితి ఏంటని వారంతా రాత్రి 11గంటల వరకు చర్చించుకున్నారు. అనంతరం త్రినాథ్ ఇంటికి చేరుకున్నాడు. ఆందోళనతోనే ఇంటికి వచ్చిన భర్తను చూసి భార్య సముదాయించింది. అయినా అతని  మనసు కుదుటపడలేదు.  
 
 ఆందోళనతో బరువెక్కిన గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. కూర్చున్న చోటే కుప్పకూలిపోయాడు.  హఠాత్పరిణామానికి  ఏం చెయ్యాలో భార్య రోహిణికి పాలుపోలేదు. కొద్దిసేపటికి తేరుకుని అతన్ని గట్టిగా తట్టి లేపింది, అయినా లేవలేదు. శరీరం చల్లబడిపోయింది.  దీంతో పెద్దపెట్టున కేకలు వేసేసరికి చుట్టు పక్కల వారు పరుగున అక్కడకి చేరుకుని అచేతనంగా ఉన్న అతనిని బయటికి తీసుకువచ్చారు. ఇంకేముంది అప్పటికే అతను మరణించినట్లు నిర్ధారించుకున్నారు. కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఘొల్లుమన్నారు.
 
 తనకి తలకొరివి పెట్టాల్సిన కొడుకు, ఇంటికి ఆధారమైన కొడుకు కళ్లముందే నిర్జీవంగా పడి ఉండడం చూసిన తండ్రి తట్టుకోలేకపోయాడు. నాన్నా లే నాన్నా అంటూ కుమార్తెలు రోదిస్తున్న తీరు స్థానికులను కంట తడి పెట్టించింది. మాయదారి ఎయిర్‌పోర్టు మా కుటుంబాన్ని ముంచేసింది అంటూ భార్య రోహిణి రోదిస్తోంది. మా జీవితాల్ని ఛిన్నాభిన్నం చేసిన ప్రభుత్వం మట్టి కొట్టుకుపోతుంది అంటూ ఆమె శాపనార్ధాలు పెట్టింది.  ఉన్నా, లేకపోయినా హాయిగా బతుకుతున్న కుటుంబం ఎయిర్‌పోర్టు ప్రతిపాదన కారణంగా రోడ్డున పడిందని గ్రామానికి చెందిన సగ్గు పోలిరెడ్డి, సగ్గు గురువులతో పాటు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చాలా జీవితాలు రోడ్డున పడనున్నాయని, మా సమాధుల మీద ఎయిర్‌పోర్టు కట్టుకుని అభివృద్ధి చేసుకోండి... మా ఉసురు తగిలిన అధికారులు, ప్రభుత్వాలు పతనమవ్వడం ఖాయమంటూ  వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు