గగనయానం షురూ 

27 May, 2020 05:05 IST|Sakshi
విశాఖ విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న ప్రయాణికులు

కళకళలాడిన గన్నవరం, విశాఖ విమానాశ్రయాలు

బెంగళూరు, చెన్నై, ఢిల్లీలకు విమాన రాకపోకలు 

ప్రయాణికులు క్వారంటైన్‌కు తరలింపు

గన్నవరం/విశాఖపట్నం: లాక్‌డౌన్‌ కారణంగా విమానాశ్రయాల్లో రెండు నెలలుగా నిలిచిపోయిన పౌర విమాన సర్వీసులు మంగళవారం పునఃప్రారంభమయ్యాయి. దీంతో గన్నవరం, విశాఖపట్నం విమానాశ్రయాలు ప్రయాణికులతో కళకళలాడాయి. బెంగళూరు నుంచి ఉదయం 7.20 గంటలకు 78 మంది ప్రయాణికులతో తొలి విమానం గన్నవరానికి చేరుకుంది. అనంతరం 8.20 గంటలకు బెంగళూరు నుంచి 49 మంది ప్రయాణికులతో ఇండిగో విమానం వచ్చింది. ప్రయాణికులు టెర్మినల్‌లోకి ప్రవేశించగానే థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించడంతో పాటు జిల్లాల వారీగా స్పందన వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేశారు. అనంతరం రూట్‌ల వారీగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రయాణికులను ఆయా జిల్లాల్లోని హోం క్వారంటైన్‌కు తరలించారు.  

► కృష్ణా జిల్లాకు చెందిన 48 మంది ప్రయాణికులకు స్థానిక ఎన్టీఆర్‌ పశువైద్య కళాశాలలో స్వాబ్‌ పరీక్షలు నిర్వహించారు. అనంతరం హోం క్వారంటైన్‌ నిమిత్తం స్వస్థలాలకు పంపించారు. 
► చెన్నై, ఢిల్లీ నుండి వచ్చిన ప్రయాణికులను మాత్రం ఎయిర్‌పోర్టులో థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు అనంతరం ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, పెయిడ్‌ క్వారంటైన్‌ సెంటర్లకు తరలించారు.  
► ఇక్కడి నుంచి బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులు మాస్కులు, ఆరోగ్యసేతు యాప్‌ ఉన్నవారిని మాత్రమే  ఎయిర్‌పోర్టులోకి అనుమతించారు.  
► విశాఖకు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ నుంచి 3 ఇండిగో, ఎయిర్‌ ఆసియా నుంచి ఒక విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా 581 మంది ప్రయాణికులు నగరానికి చేరుకున్నారు. అవే విమానాల్లో విశాఖ నుంచి 450 మంది ఆయా ప్రాంతాలకు వెళ్లారు.  
► వచ్చిన ప్రయాణికులందరికి విమానాశ్రయంలోనే థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించి ప్రత్యేక బస్సుల్లో అక్కయ్యపాలెంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వారి చిరునామాలు, ఇతర వివరాలు తీసుకొని హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.   

మరిన్ని వార్తలు