వైఎస్‌ జగన్‌పై దాడి: ఏఏఐ ప్రకటన

25 Oct, 2018 18:16 IST|Sakshi

ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లో ఉండగా వైఎస్‌ జగన్‌పై దాడి

ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌కు జగన్‌

నిందితుడిని స్థానిక పోలీసులకు అప్పగించిన సీఐఎస్‌ఎఫ్‌

వెల్లడించిన విశాఖ ఎయిర్‌పోర్ట్‌ డైరక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి

సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన దాడికి సంబంధించి ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్న వ్యక్తి వైఎస్‌ జగన్‌పై దాడికి పాల్పడట్టు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ డైరక్టర్‌ జి ప్రకాశ్‌ రెడ్డి ఆ ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరమే వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌ బయలుదేరినట్టు వెల్లడించారు. 

‘వైఎస్‌ జగన్‌ మధ్యాహ్నం 1.05 గంటలకు ఇండిగో విమానంలో హైదరాబాద్‌ వెళ్లాల్సి ఉంది. అందుకోసం వైఎస్‌ జగన్‌ వీఐపీ లాంజ్‌లో వేచి చూస్తుండగా.. 12.40 గంటల ప్రాంతంలో ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న వెయిటర్‌ కత్తితో ఆయనపై దాడి చేశాడు. ఈ దాడిలో వైఎస్‌ జగన్‌ ఎడమ భుజానికి గాయం కావడంతో పాటు, రక్తస్రావం జరిగింది. దీంతో ఆయనకు వెంటనే ఎయిర్‌పోర్ట్‌ డ్యూటీ డాక్టర్‌ పర్యవేక్షణలో ప్రాథమిక చికిత్స అందించటం జరిగింది. ఆ తర్వాత ఆయన తను వెళ్లాల్సిన ఫ్లైట్‌లో హైదరాబాద్‌ వెళ్లారు. ఆయనపై దాడి చేసిన నిందితుడిని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పోలీసు శాఖ ఈ విషయంపై విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌లో పరిస్థితి సాధారణ నెలకొంద’ని ప్రకటనలో పేర్కొన్నారు. 
 

మరిన్ని వార్తలు