నెల రోజుల్లో భోగాపురం ఎయిర్‌పోర్టు భూసేకరణ

11 Oct, 2015 23:38 IST|Sakshi
నెల రోజుల్లో భోగాపురం ఎయిర్‌పోర్టు భూసేకరణ

మంత్రి గంటా శ్రీనివాసరావు
 
విశాఖపట్నం : భోగాపురం వద్ద నిర్మించనున్న ఎయిర్‌పోర్టు కోసం నెల రోజుల్లో భూసేకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రాష్ర్ట మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. సేకరించనున్న భూములు వివిధ రకాలుగా ఉన్నందున వాటి కి ఏ రీతిలో పరిహారం చెల్లించాలనే విషయమై కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. వీటిపై సోమవారం నగర పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చిస్తామన్నారు.

భోగాపురం ఎయిర్‌పోర్టు భూసేకరణ పురోగతిపై గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కిమిడి మృణాళినితో కలిసి ఆదివారం సర్క్యూట్ హౌస్‌లో విజయనగరం, విశాఖ జిల్లాల కలెక్టర్లు, భోగాపురం ప్రాంత ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన 5,300 ఎకరాల్లో 300 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు, వుడా ఆమోదం పొందిన లేవుట్లు ఉన్నాయని తెలిపారు. లే అవుట్ భూములను రెండు రకాలుగా వర్గీకరించామని, లే అవుట్‌లో అమ్మకాలు జరిపినవి, భూమి వినియోగ మార్పిడి చేసి విక్రయించకుండా ఉన్నవిగా గుర్తించి వాటికి పరహారం నిర్ణయిస్తామన్నారు. భూసేకరణలో ఎవరికి నష్టం లేకుండా బాధ కలగకుండా ప్యాకేజీలు రూపొందిస్తామన్నారు.
 
 

మరిన్ని వార్తలు