విమానాశ్రయం @ కుప్పం

20 Jan, 2015 02:58 IST|Sakshi
విమానాశ్రయం @ కుప్పం

టోపోగ్రాఫికల్ సర్వే కోసం రూ.14 లక్షలు
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం


తిరుపతి: కుప్పంలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విమానాశ్రయం నిర్మాణానికి టోపోగ్రాఫికల్ (భూ పరిశీలన) సర్వేకు రూ.14 లక్షలను మంజూరు చేస్తూ సోమవా రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. శాంతిపురం, రామకుప్పం మండలాల సరిహద్దులోని కొలమడుగు పంచాయతీ అమ్మోరిపేట వద్ద విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం భూములను గుర్తించి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఐఏ)కు నివేదించింది. నాలుగు నెలల కిందట ఐఐఏ అధ్యక్షుడు అలోక్‌సిన్హా కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. భూములను పరిశీలించారు. కుప్పం నియోజకవర్గంలో  విమానాశ్రయం ఏర్పాటు ఆర్థికంగా లాభసాటి కాదని తేల్చి చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర సరుకుల రవాణాకూ ఎగుమతికి ఉపయోగపడేలా ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు చేయవచ్చునని ప్రభుత్వానికి నివేదించారు.

ఐఐఏ నివేదికను పరిగణనలోకి తీసుకోని ప్రభుత్వం కుప్పం నియోజకవర్గంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విమానాశ్రయం ఏర్పాటుకు అనుకూలమైన ప్రదేశాన్ని గుర్తించడం కోసం టోపోగ్రాఫికల్ సర్వేకు రంగం సిద్ధం చేసింది. టోపోగ్రాఫికల్ సర్వేకు రూ.14 లక్షలు కేటాయించింది.  సర్వే పూర్తయిన తర్వాత విమానాశ్రయం నిర్మించే ప్రదేశాన్ని గుర్తించి భూసేకరణ చేయనున్నారు. ఆ లోపు విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన అనుమతులు తేవడంపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. కేంద్ర విమానయాన, పర్యావరణ, ఇతర శాఖల నుంచి అనుమతులు వచ్చాక విమానాశ్రయం నిర్మాణానికి టెండర్లు పిలుస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి.
 
 

మరిన్ని వార్తలు